రేవంత్‌రెడ్డి అత్యుత్సాహంతో తీసుకున్న హిట్లర్ పేరు ఆయన్ను తెగ ఇబ్బందిపెట్టినట్టే ఉంది. ప్రతిపక్షాల ప్రచారం ఇరిటేషన్ తెప్పించినట్టే ఉంది. అందుకే ఆయన ఫ్యూచర్ సిటీలో తన ప్రసంగంలో హైడ్రా గురించి వివరించారే తప్ప ఎక్కడా.. దాని పేరు కూడా ఎత్తలేదు. కావాలనే ఆయన ఆ పేరును ఉచ్చరించలేదని ఆ స్పీచ్ ఆసాంతం విన్నవారికి ఇట్టే అర్థమైపోతుంది. హైడ్రా గురించి అన్ని మంచి మాటలు చెప్పినప్పుడు, సిటీ డెవలప్‌మెంట్ గురించే ఆ సభలో ప్రాధాన్యతా ప్రసంగం నడిచినప్పుడు.. కనీసం కీలకమైన హైడ్రా పేరును ఉచ్చరించకపోవడం.. రేవంత్‌రెడ్డి హిట్లర్ పేరుని దీనికి లింక్ చేసి గతంలో మాట్లాడిన తీరే దీనికి కారణమని తెలిసిపోతున్నది.
హైడ్రా ఉద్దేశ్యాన్ని బలంగా వినిపించే క్రమమే కావొచ్చు.. అనుకున్నది సాధించే విషయంలో వెనక్కి తగ్గని కమిట్‌మెంట్ గురించి క్లారిటీగా చెప్పాలనే అయి ఉండొచ్చు..కానీ అక్కడ హిట్లర్ పేరును తీసుకోవడం పొరపాటై పోయింది. దీన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా తీసుకున్నాయి. కానీ బీఆరెస్ విషాదమేమిటంటే.. గతంలో కేసీఆర్ కూడా హిట్లర్ ప్రస్తావన తేవడం.. ఆయన పాలన అంతకన్నా ఘోరంగా ఉండటం.. ఇనవ్నీ చూసిన జనం దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం న్యూట్రల్ పర్సన్స్ కూడా రేవంత్ .. హిట్లర్ పేరు తీసుకోవడంపై అసంతృప్తే వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి రాగానే ఎవరైనా ఇంతేనా..? ఆ మాటల్లో దర్పం.. అహంకార ప్రదర్శనతో కూడిన ప్రసంగాలు.. నోటికేదొస్తే అది అనేయడం.. విచక్షణ లేకపోవడం.. ఇవన్నీ గమనిస్తున్నారు జనం.
పది మందిలో మాట్లాడే మాటలు జాగ్రత్తగా, ఆచితూచి మాట్లాడాల్సి వస్తుంది. కానీ చాలా సందర్భాల్లో రేవంత్‌రెడ్డి అది కోల్పోతున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినా చెల్లుబాటయ్యింది. అధికార పక్షంపై అప్పటికే జనం వ్యతిరేకతతో ఉండటం.. సరే, ఏదో ప్రశ్నిస్తున్నాడు కదా.. నిలదీస్తున్నాడు కదా..! అని జనం సరిపెట్టుకున్నారు కావొచ్చు. కానీ ఇప్పుడలా కాదు. కావాల్సిన సంక్షేమం దరి చేరనప్పుడు, హామీలు ఇంకా పూర్తికానప్పుడు.. పెట్టుకున్న ఆశలు భంగం అవుతున్నాయనే నమ్మకం బలపడినప్పుడు.. జనం ఏ తప్పునూ క్షమించరు. అందులో ఇక్కడ బలమైన, పాతుకుపోయిన ప్రతిపక్షం ఉంది. దానికి బలమైన సోషల్ మీడియా టీం ఉంది.
అధికారం కోసం అది పక్కలో బల్లెంలా కాచుక్కూర్చుని ఉంది. మరలాంటప్పుడు అధికార ప్రదర్శనలెందుకు? చూశారా..? ఆ యుద్దంతో ఎలా నేలమట్టం అయ్యాయో ఇండ్లు.. ఇక్కడా ఆక్రమణలు అలా నేలమట్టం చేశాం..! ఇదేం చచ్చు పోలిక. అసలు ఎవరైనా రేవంత్‌తో ఈ విషయాలపై చర్చిస్తున్నారా? కేసీఆర్‌కు చెప్పేందుకు జంకినట్టే.. ఈయనకు జడుసుకుంటున్నారా? తనకు తానే కేసీఆర్‌లా అపర మేథావిలా రేవంత్ కూడా ఫీలవుతున్నాడా? ఫీలవ్వడం లేదని మాత్రం అనిపిస్తుంది.. నిన్న హైడ్రా పేరును ఉచ్చరించకుండా కొంచెం జంకినప్పుడు. అవును ఇప్పుడు.. హైడ్రా పేరు తీయగానే.. వెంటనే జనానికి గుర్తొచ్చేది హిట్లర్ పేరే.
కొద్ది రోజులైన తరువాత ఈ వివాదం సమిసిపోయినంక.. అది వేరు విషయం. కానీ ఇప్పుడు అదింకా రాజుకుంటున్నది. అందుకే ఆ హిట్లర్ లొల్లిపై నీళ్లు చల్లేందుకు రేవంత్ ఒకడుగు వెనక్కి వేశాడు. తప్పదు. వేయాల్సిందే. జనం నాడి తెలుసుకుని ముందుకు సాగాల్సిందే. అన్నిటికీ మించి అహంకార ప్రదర్శనను తగ్గించుకోవాల్సిందే. ప్రతిపక్షంపై మాట్లాడుతున్నాను కదా.. అనే భ్రమలో మాట్లాడే మాటలను కూడా జనం పసిగడతారు. ఇప్పుడు మాటలు తగ్గించి చేతలు కదా చూపాల్సింది. చేతలు చేస్తూ తిడితే ఆ తిట్లకు ఆమోదం ఉంటుంది. లేదంటే వాటిని ఉత్త పలుకులుగా, చెత్త పలుకులుగానే చూస్తారు.