Ichchapuram Elections: ఇచ్ఛాపురం నియోజక వర్గంలో 2009 నుండి ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపియే వరుస విజయాలు సాధిస్తూ వస్తోంది. ఈ నియోజక వర్గంలోని ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో మాత్రం 2014 నుండి గత ఎన్నికల వరకు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలే మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకుంటున్నారు.ఈ మున్సిపాలిటీ ఏర్పాటైన దగ్గరనుంచి ఇప్పటి వరకు టిడిపి ఒకే సారి మున్సిపల్ ఛైర్మన్ పదవిని దక్కించుకుంది. మున్సిపాలిటీలోని పిలకా కుటుంబ సభ్యులు నాలుగు సార్లు మున్సిపల్ పీఠాన్ని అధిరోహించారు. ఇప్పటికే రెండు సార్లు ఛైర్ పెర్సన్ గా వ్యవహరించిన పిలకా రాజ్యలక్ష్మినే వైసీపీ మరోసారి మున్సిపల్ ఛైర్ పెర్సన్ అభ్యర్ధిగా ప్రకటించింది. టిడిపి తరపున మాజీ కౌన్సిలర్ ఆశీ లీలారాణి బరిలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి మున్సిపాలిటీని తమ ఆధీనంలోనే ఉంచుకోవాలని వైసీపీ భావిస్తోంది. వైసీపీని ఓడించి మున్సిపాలిటీని తమ ఖాతాలో రాసుకోవాలని కూటమి పంతంగా ఉంది.
రాజ్యలక్ష్మి అనుభవమా.. లీలారాణి పట్టుదలా?
వైసీపీ అభ్యర్ధి పిలకా రాజ్యలక్ష్మి రెండు సార్లు మున్సిపల్ ఛైర్ పెర్సన్ గా వ్యవహరించారు. మున్సిపాలిటీ నిర్వహణపైనా సమస్యలపైనా ఆమెకు పూర్తి అవగాహన ఉండడం అడ్వాంటేజ్. దాంతో పాటు పిలకా కుటుంబానికి ప్రజల్లో మంచి పేరు ఉంది. ఈ సారి కూడా గెలిచి మున్సిపాలిటీని మరింతగా అభివృద్ధి చేస్తానని రాజ్యలక్ష్మి అంటున్నారు.
ఇక టిడిపి అభ్యర్ధి లీలారాణి టిడిపిలో సీనియర్ నాయకురాలు. జిల్లా పార్లమెంటరీ మహిళా ప్రధాన కార్యదర్శిగానూ వ్యవహరించారు. అన్నా క్యాంటీన్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసిన అనుభవం కూడా ఉంది ఆమెకు. కూటమి పక్షాల బలంతో ఘన విజయం సాధించాలని లీలారాణి పట్టుదలగా ఉన్నారు. విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
లీలారాణిని సింహాసనంపై కూర్చోబెడతారా?
రెండు పార్టీల్లోనూ అసంతృప్తులు ఉన్నారు. వారిని బుజ్జగించి దారికి తెచ్చుకోవడం ఇద్దరికీ సవాలే. ఇక టిడిపి నుంచి బచ్చు మంగమ్మ రెబెల్ అభ్యర్ధిగా నామినేషన్ వేశారు. పాత ఛైర్మన్ కే మరోసారి అధికారం రెన్యువల్ చేస్తారా? లేక మార్పుకు జై కొట్టి లీలారాణిని సింహాసనంపై కూర్చోబెడతారా? అన్నది ప్రజలు తేల్చాలి.
Also Read: మీ బ్యాంక్ అకౌంట్‌లో AI ఏజెంట్లు! పొరపాటున పాస్‌వర్డ్ ఇస్తే డబ్బులు మాయమేనా?