AI Professionals-Women: వెంచర్ క్యాపిటల్ సంస్థ కలరి క్యాపిటల్ వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)కు సంబంధించిన శ్రామికశక్తిలో ఇప్పుడు అయిదుగురిలో ఒకరు మాత్రమే మహిళ ఉన్నారని తెలుస్తోంది. అయితే, 2027 నాటికి మహిళల సంఖ్య ఘననీయంగా పెరగనుందని ఈ నివేదిక తెలిపింది. AI, ML (మెషిన్ లెర్నింగ్)కు సంబంధించి మన దేశంలో 84,000 మహిళలు పనిచేస్తున్నారని, 2027 నాటికి వారి సంఖ్య 3.4 లక్షలకు చేరవచ్చని అంచనా వేస్తోంది కలరి రిపోర్ట్.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత ఎక్కువ మందికి అందుబాటులోకి రావడం, ఎక్కువగా అవకాశాలు అందుబాటులోకి తేవడం.. మొదలైన కారణాల వల్ల AI రంగంలో మహిళల సంఖ్య పెరుగుతుందని అంచనా వేసింది ఆ రిపోర్ట్. ఏఐ.. పురుష ఉద్యోగుల కోసం మాత్రమే అన్నట్లుగా ఉండకూడదు. ఏఐ రంగంలో స్త్రీ, పురుషులకు సమాన అవకాశాలు ఉన్నప్పుడే వైవిధ్యం కనిపిస్తుంది.
ఏఐ నిర్మాణంలో అందరి భాగస్వామ్యం ఉంటే పక్షపాతం కనిపించదు. వైవిధ్యమైన, ఏఐ ఇంటెలిజెన్స్ భవిష్యత్ కోసం స్రీ, పురుషుల సమాన భాగస్వామ్యం ఉండాలి అంటోంది. ప్రపంచవ్యాప్తంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితానికి సంబంధించి మన దేశంలో మహిళలు ముందంజలో ఉన్నారని నివేదిక పేర్కొంది. అయితే, కంప్యూటర్ సైన్స్, AI లాంటి క్లిష్టమైన విభాగాల్లో పరిస్థితి వేరే విధంగా ఉంది. ఐఐటీ విద్యార్థుల్లో మహిళలు 15% మంది మాత్రమే ఉన్నారు. స్టార్టప్ ప్రపంచంలో కూడా లింగ అంతరం స్పష్టంగా కనిపిస్తుంది. మన దేశంలోని AI స్టార్టప్‌లలో ఉమెన్ ఫౌండర్స్ 10% మాత్రమే ఉన్నారు.
ఆశారేఖ లాంటి విషయమం ఏమిటంటే.. జనరేటివ్ AI కోర్సుల్లో మహిళల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. టెక్ రంగంలో అమ్మాయిలకు ఏఐ, ఎంఎల్ టాప్ కెరీర్ ఆప్షన్‌గా మారింది. దీనిపై మైక్రోసాఫ్ట్ సీనియర్ ప్రిన్సిపల్ రిసెర్చర్ కాళికా బాలి స్పందిస్తూ.. ‘మన దేశంలోని మహిళలు యూజర్‌ల స్థాయి నుండి ఏఐ రూపకర్తల స్థాయికి చేరుకోవడానికి ఎన్నో ద్వారాలు తెరవాలి. బాలికలకు పాఠశాల స్థాయి నుంచే ఏఐకి సంబంధించిన ప్రాథమిక జ్ఞానాన్ని అందించాలి. మహిళల నేతృత్వంలోని ఏఐ పరిశోధన సంస్థలు, స్టార్టప్‌లకు తగిన నిధులు సమకూర్చాలి’ అని తెలిపారు.