AI-Heart Condition: సాధారణంగా గుండె సమస్యలు ఉన్నాయోమో అని తెలుసుకోవాలంటే.. ఆసుపత్రికెళ్లి కొన్ని రకాల పరీక్షలు చేయించుకుంటేగానీ తెలియదు. అక్కడ గుండె జబ్బులను గుర్తించడానికి ఎలక్ట్రోకార్డియోగ్రామ్(ECG) పరీక్ష చేస్తుంటారు. దీని ద్వారా గుండె రంధ్రాలను గుర్తించగలిగితే.. బ్రెగమ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్, జపాన్‌లోని కీయో యూనివర్సిటీ అలాంటి వినూత్న విధానాన్నే రూపొందించాయి.
డీప్ లెర్నింగ్ ఏఐతో పనిచేసే ఇది ఈసీజీలో దాగున్న గుండె రంధ్రం సంకేతాలను సులభంగా గుర్తిస్తుందట. అదికూడా సంప్రదాయ పద్ధతుల కంటే.. మెరుగ్గా. మనకు గుండె రంధ్రాలు అనగానే.. పిల్లలే గుర్తుకొస్తారు. ఎందుకంటే.. ఇది పుట్టుకతో తలెత్తే లోపం. కొందరిలో చిన్నప్పుడే బయటపడుతుంది. కొందరిలో పెద్దయ్యాక కూడా తెలియకపోవచ్చు. దీని లక్షణాలు చాలా స్వల్పంగా ఉండటం, కొందరిలో పెద్దయ్యేవరకూ ఎలాంటి లక్షణాలు లేకపోవటం వల్ల చాలామందిలో సమస్య గుర్తించలేకుండానే ఉండిపోతుంటుంది.
గుండెలో రంధ్రాలు ఉన్నా సరే.. పైకి ఎలాంటి లక్షణాలు కనిపించవు. కానీ, ఇది గుండె మీద ఎక్కువ భారం పడేలా చేస్తుంది. గుండె లయ తప్పటం, పక్షవాతం, గుండె వైఫల్యం, ఊపిరితిత్తుల్లో అధిక రక్తపోటు వంటి వాటి ముప్నుపు పెంచుతుంది. తొలిదశలోనే గుండె రంధ్రాన్ని గుర్తిస్తే చిన్నకోత సర్జరీతోనే సరిచేయొచ్చు. సమస్యలను తగ్గించి, వారి జీవనకాలాన్ని పెంచవచ్చు.
చాలామంది వైద్యులు స్టెతస్కోప్‌ను ఉపయోగించి గుండె చప్పుడు ద్వారానే రంధ్రాన్ని గుర్తిస్తుంటారు. కానీ, కేవలం 30% మందిలోనే ఈ విధానంలో సమస్య బయటపడుతోంది. ఎకోకార్డియోగ్రామ్ తోనూ గుండె రంధ్రాన్ని తెలుసుకోవచ్చు. కాకపోతే.. దీనికి టైం పడుతుంది. కాబట్టి.. ముందస్తు పరీక్షలకు ఇది అంతగా ఉపయోగపడదు. మరో పద్ధతి ECG. ఇది కేవలం నిమిషంలోనే పూర్తయ్యే పరీక్ష. అందువల్ల దీన్ని స్క్రీనింగ్‌కు వాడుకోవచ్చు. అయితే, గుండె రంధ్రంతో ముడిపడిన లోపాల కోసం ECGని పరిశీలించేటప్పుడు అంత ఎక్కువ సమాచారం లభించదు. ఈ నేపథ్యంలోనే.. కృత్రిమ మేధ నమూనాను రూపొందించారు. ఇది ఈసీజీని విశ్లేషించి, 93.7% వరకూ గుండె రంద్రాన్ని సరిగ్గా గుర్తిస్తుండటం విశేషం.