Meta Fake Ads Revenue| సోషల్ మీడియాలో మెటా కంపెనీ చెందిన ఫెస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్స్‌కు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. యూజర్లు ఇందులో ప్రతిరోజు గంటల తరబడి సమయం వెచ్చిస్తుంటారు. సంప్రదాయ మాధ్యమాల కంటే ఈ రోజుల్లో సోషల్ మీడియా ద్వారానే సమాచారం వేగంగా వ్యాపిస్తోంది. అందుకే ఈ ఛానెల్స్ లో ప్రకటనలు కూడా అధిక సంఖ్యలో కనిపిస్తుంటాయి. వీటి ద్వారా సదరు కంపెనీలకు భారీగా ఆదాయం పొందుతున్నాయి. కానీ ఈ ఆదాయాన్ని పెంచుకోవడానికి బడా కంపెనీలు నకిలీ, మోసపూరిత ప్రకటనలకు కూడా చోటు కల్పిస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ విడుదల చేసిన ఒక రిపోర్ట్ లో ఈ షాకింగ్ విషయం బయటపడింది.
రాయిటర్స్ మీడియా గత కొంతకాలంగా దర్యాప్తు చేసి ఈ రిపోర్ట్ చేసి విడుదల చేసింది.ఫెస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్స్ నిర్వహించే మెటా కంపెనీ మోసపూరిత ప్రకటనల ద్వారా ఒక్క ఏడాదిలోనే 16 బిలియన్ డాలర్లు (అంటే భారత కరెన్సీలో సుమారు రూ.1.3 లక్షల కోట్లు) సంపాదించిందని తేలింది. ఈ ప్రకటనలు చట్టబద్ధమైన జూదం, నకిలీ పెట్టుబడులు, నిషేధించిన ఉత్పత్తులను ప్రచారం చేస్తుండగా.. మెటా ఈ యాడ్స్ ని ప్రోత్సహిచంది.
కంపెనీ అంతర్గత డాక్యుమెంట్ల ప్రకారం.. 2023లో మెటా మొత్తం ఆదాయంలో 10% మోసపూరిత ప్రకటనల నుంచి వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ప్రకటనలు వినియోగదారులకు ప్రమాదమని తెలిసి కూడా, మెటా ఈ ఆదాయం కోసం ఇలాంటి యాడ్స్ కు అధిక ఫీజులు వసూలు చేసి మరీ అనుమతులు ఇచ్చింది. వీటిపై ఎలాంటి నిషేధాలు పెట్టలేదు.
మెటా సిస్టమ్ లోపల ఒక అల్గారిథమ్ ఉంది. ఇది ప్రకటనదారుడికి మోసం స్కోరు ఇస్తుంది. మోసం జరిగే అవకాశం ఎంత ఉందో చూస్తుంది. అనుమానాస్పద ఖాతాలు, ప్రకటనలను గుర్తిస్తుంది. కానీ ఈ సిగ్నల్స్‌ను మెటా యజమాన్యం ఎక్కువగా పట్టించుకోదు.
ప్రకటనదారుడిని బ్లాక్ చేయడానికి మెటా 95% నిర్ధారణ కావాలి. దాదాపు పూర్తి ఆధారాలు లేకుండా ఖాతాను తొలగించదు. ఈ భారీ లోపం వల్ల మోసపూరిత ఖాతాలు, ప్రకటనలు కొనసాగుతున్నాయి.
80-90% మోసం స్కోరు ఉన్నవారికి మెటా ఎక్కువ ఫీజు వసూలు చేస్తుంది. ఇలాంటి ఫీజులు విధిస్తే మోసగాళ్లు చెల్లించలేరని మెటా వాదన. కానీ మోసగాళ్లు ఈ అదనపు డబ్బు చెల్లించి ప్రకటనలు చేస్తున్నారు. ఫలితంగా మెటాకు నేరుగా భారీ లాభం చేకూరుతోంది.
ఈ సమస్య కనీసం గత మూడేళ్లుగా కొనసాగుతోందని తెలిసింది. వినియోగదారులను మెటా తగిన రక్షణ కల్పించడంలేదు. నకిలీ పెట్టుబడి పథకాల గురించి విస్తృతంగా ప్రకటనలు వెలువడుతున్నాయి. చట్టవిరుద్ధ జూదం ప్రకటనలు మిలియన్ల మందికి చేరాయి. నిషేధిత వైద్య ఉత్పత్తుల గురంచి బాగా ప్రచారంలో ఉన్నాయి.
మోసగాళ్లు ప్రసిద్ధ బ్రాండ్‌లను అనుకరిస్తారు. ప్రభుత్వ లోగోలు కాపీ చేస్తారు. ముఖ్యంగా వృద్ధులను, మహిళలను లక్ష్యంగా చేస్తారు. ఆర్థికంగా ఇబ్బంది పడే వారిని మోసం చేస్తారు. AIతో సెలెబ్రిటీ ముఖాలు రూపొందించి క్లోన్ చేసిన వారి గొంతుని వీడియోలో ఉపయోగిస్తారు.
మెటా కంపెనీ అధికారి ఒకరు రాయిటర్స్ నివేదికను ఖండించారు. ఆ డాక్యుమెంట్లు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని చెప్పాడు. మోసపూరిత యాడ్స్ నిరోధించే చర్యలు తీసుకుంటున్నామని, ఈ సంవత్సరం 58% నకిలీ యాడ్స్ ను బ్లాక్ చేశామని తెలిపారు.
అనుమానాస్పద ప్రకటనదారుల నుంచి లాభం పొందడం వల్ల మెటా కంపెనీ మోసపూరిత యాడ్స్ ని ఒక విధంగా ప్రొత్సహిస్తున్నట్లే. ఇలా చేయడం వల్ల వినియోగదారుల భద్రత విషయంలో మెటా ప్రాముఖ్యం ఇస్తున్నట్లు కనిపించదని బిలియన్ల మంది యూజర్లు ప్రశ్నిస్తున్నారు – మా ఫీడ్‌లు నిజంగా సురక్షితమా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: మీ కంప్యూటర్ మౌస్ మీ రహస్యాలను వింటోంది.. కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు