Vibe Coding: కృత్రిమ మేధ(ఏఐ) టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ.. టెక్ రంగంలో ఉద్యోగాల భవిష్యత్తుపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంతకాలంగా ‘వైబ్‌కోడింగ్’ అనే పదం టెక్ ప్రపంచంలో విపరీతంగా పాపులర్ అవుతోంది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ డెవలపర్ల విషయంలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం గూగుల్ తన AI స్టూడియో ప్లాట్‌ఫారంలో కొత్త ఫీచర్‌గా తీసుకొచ్చిన ఈ వైబ్‌కోడింగే. కంప్యూటర్ సైంటిస్ట్, ప్రముఖ AI కంపెనీ OpenAI కోఫౌండర్ ఆండ్రెజ్ కర్పతి ద్వారా వైబ్‌కోడింగ్ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం కోడర్‌ల నుంచి సామాన్యుల వరకు ఈ వైబ్‌కోడింగ్‌ను వినియోగిస్తున్నారు.
వైబ్ కోడింగ్ అనేది AI టూల్స్‌ను ఉపయోగించి సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లు తయారుచేసే పద్ధతి. ఇందులో డెవలపర్ ఒక ప్రాజెక్ట్ లేదా పనికి సంబంధించి లార్జ్ లాంగ్వేజ్ మోడల్(LLM)కు వివరిస్తారు. ఇది ప్రాంప్ట్ ఆధారంగా కోడ్‌ను జనరేట్ చేస్తుంది. అయితే, డెవలపర్ కోడ్‌ను ఎడిట్, రివ్యూ చేయడం లాంటివి ఏమీ చేయడు. మార్పులు చేర్పులు చేసి మరింత మెరుగు పరచాలనుకుంటే ‘LLM’ని అడుగుతాడు. స్థూలంగా చెప్పాలంటే సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్‌లో విస్తృత శిక్షణ. నైపుణ్యం లేని అమెచ్యూర్ ప్రోగ్రామర్స్ కూడా వైబ్‌కోడింగ్ ద్వారా సాఫ్ట్‌వేర్ సృష్టించవచ్చు. న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్ట్ కెవిన్ రూస్ వైబ్‌కోడింగ్ మెథడ్‌ను ఉపయోగించి ఎన్నో స్మాల్‌స్కేల్ అప్లికేషన్‌లను రూపొందించాడు.
వైబ్‌కోడింగ్ పద్ధతి వల్ల కొన్ని రకాల ఉద్యోగాలకు డిమండ్ తగ్గొచ్చని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఏఐ టూల్స్ ప్రాథమిక స్థాయి కోడింగ్‌ను సులభంగా చేయగలుగుతున్నాయి కాబట్టి.. జూనియర్ డెవలపర్ల అవసరం అంతగా ఉండకపోవచ్చు.
మెనుజెన్ వంటి ప్రోటోటైప్‌లను నిర్మించడానికి ఈ వైబ్‌కోడింగ్ మెథడ్‌ను జర్నలిస్ట్ కెవిన్ ఉపయోగించాడు. కోడ్ క్రియేషన్‌లో ఏదైనా ఎర్రర్ కనిపించినప్పుడు.. ఆ ఎర్రర్ మెసేజెస్‌ను కామెంట్ లేకుండానే సిస్టమ్‌లో కాపీ, పేస్ట్ చేసేవాడు. దీనితో జరిగిన లోపాలను AI సవరిస్తుంది. వైబ్ మార్కెటింగ్, వైబ్ డిజైనింగ్, వైబ్ అనలిటిక్స్, వైబ్ వర్కింగ్.. ఇలా రకరకాలుగా వైబ్‌కోడింగ్ పాపులర్ అయ్యందని చెప్పవచ్చు.
ఈ వైబ్‌కోడింగ్ పద్ధతిలో సానుకూల విషయాలు ఉన్నప్పటికీ.. వైబ్‌కోడింగ్‌తో జవాబుదారీతనం లోపిస్తుంది, భద్రతా సమస్యలు ఏర్పడతాయి, కార్యాచరణ పూర్తిగా అర్థం చేసుకోకుండానే AI సృష్టించిన కోడ్‌ను ఉపయోగించడం వల్ల గుర్తించబడని బగ్‌లు, లోపాలు, భద్రతాపరమైన సమస్యలు ఏర్పడతాయని కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. ప్రోగ్రామర్లు కానివారిని కూడా ఫంక్షనల్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడానికి వైబ్‌కోడింగ్ వీలు కల్పిస్తున్నప్పటికీ.. ఈ మెథడ్ ద్వారా 100 శాతం కరెక్టే అనుకోవడానికి లేదు. ఊహించినంత ఫలితాలు కూడా రాకపోవచ్చు.
లవబుల్.. అనేది స్వీడీష్ వైబ్‌కోడింగ్ యాప్. దీని కోసం రూపొందించిన కోడ్‌లో భద్రతా లోపాలు ఉన్నాయని, లవబుల్ వెబ్‌అప్లికేషన్‌లలో వ్యక్తిగత సమాచారాన్ని ఎవరైనా యాక్సెస్ చేసుకునే అవకాశం ఉందని.. ఇలా ఎన్నో లోపాలు బయటపడ్డాయి. ఇక ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో ఫేక్ రివ్యూలు సృష్టించడానికి ఈ మెథడ్‌ను ఉపయోగించుకున్నారని, వైబ్‌కోడింగ్ గురించి ఐ జస్ట్ సీ థింగ్స్, సే థింగ్స్, రన్ థింగ్స్, అండ్ కాపీ థింగ్స్ అని గొప్పగా చెప్పిన ఆండ్రేజ్ కూడా ఈ మెథడ్‌లోని పరిమితుల గురించి ఎన్నో సందర్భాలలో చెప్పాడు. కొన్ని బగ్స్ రిపేర్‌కు సంబంధించి టూల్స్ విఫలమయ్యాయి అనేది అందులో ఒకటి.