Amazon AI Gadgets: ఈమధ్య కాలంలో అమెజాన్ వరుసగా రకరకాల డివైజ్‌లను మార్కెట్లోకి తెస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే వాటన్నింటికంటే భిన్నంగా, మనల్ని ఎంతగానో ఆశ్చర్యపరిచే రెండు సరికొత్త ఏఐ గ్యాడ్జెట్లను తాజాగా పరిచయం చేసింది. ఇవి మనం మాట్లాడే మాటలను రోజంతా గమనిస్తూ.. ముఖ్యమైన విషయాలను గుర్తుపెట్టుకుంటాయి. మనం రోజూ చూసే పనుల్లో పడి చిన్న చిన్న విషయాలు మరచిపోకుండా చూడటమే వీటి ముఖ్య ఉద్దేశం. గతేడాది అమెజాన్ సొంతం చేసుకున్న బీ అనే స్టార్టప్ భాగస్వామ్యంతో Bee: Bee Frontier, Bee Eclipse పేర్లతో వీటిని విడుదల చేశారు.
చేతికి పెట్టుకునే ఫిట్నెస్ బ్యాండ్‌లా ఉండే ఈ డివైజ్‌ను అవసరమైతే షర్ట్‌కు కూడా క్లిప్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న రెండు మైక్రోఫోన్లు మనం మాట్లాడే మాటలను వింటూ దాదాపు 40 భాషల్లో సారాంశాన్ని అందిస్తాయి. హోటళ్లు లేదా ఎక్కువ గోల ఉన్న ప్రదేశాల్లో కూడా శబ్దాలను తగ్గించి, కేవలం మాటలను మాత్రమే ఇది సరిగ్గా క్యాప్చర్ చేయగలదు. నీటిలో తడిసినా ఏమీ కాకుండా దీనిని డిజైన్ చేశారు. దీని ధర రూ.6,400 వరకు ఉంటుంది.
Also Read: నకిలీ QR కోడ్లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!
ఈ గ్యాడ్జెట్ నేరుగా ఫోన్ వెనుక వైపు అయస్కాంతం ద్వారా అతుక్కుంటుంది. మామూలు సంభాషణలతో పాటు మనం మాట్లాడే ఫోన్ కాల్స్ విషయాలను కూడా ఇది స్పష్టంగా నోట్ చేసుకుంటుంది. క్రెడిట్ కార్డ్ పరిమాణంలో ఉండే ఈ చిన్న పరికరం 21 రోజుల పాటు ఛార్జింగ్ వస్తుంది. విడిగా మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో సంబంధం లేకుండా ఇది సొంతంగా పనిచేయడం విశేషం. దీని ధర రూ.8,500 వరకు ఉంటుంది.
ఎల్లప్పుడూ మన మాటలు వింటూ ఉంటే వ్యక్తిగత సమాచారం బయటకు పోతుందేమో అనే భయం అందరిలోనూ ఉంటుంది. కానీ దీనికోసం ఇందులో మైక్రోఫోన్ ఆఫ్ చేసుకునే ఫిజికల్ బటన్ అందించారు. మనం మాట్లాడిన సమాచారం ఎప్పటికప్పుడు ప్రాసెస్ అయ్యాక దానంతట అదే డిలీట్ అయిపోతుంది. పైగా ఈ డేటా మొత్తం పూర్తి భద్రతతో మీ సొంత డివైజ్‌లోనే ఎన్‌క్రిప్ట్ అయి ఉంటుంది కాబట్టి.. అమెజాన్ కంపెనీ కూడా మీ డేటాను చూడలేదు.
ఈ పరికరాలు రికార్డ్ చేసిన ముఖ్యమైన పాయింట్లను మొబైల్ యాప్ ద్వారా చాలా సులభంగా చూసుకోవచ్చు. మనం వాడే కొద్దీ మన అలవాట్లను, ప్రాధాన్యతలను అర్థం చేసుకుంటూ ఈ ఏఐ మరింత తెలివిగా మారుతుంది. అదనపు ప్రయోజనాల కోసం నెలకు రూ.1000 సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను కూడా అమెజాన్ ప్రవేశపెట్టింది. ఇప్పటికే ప్లాడ్, పాకెట్ వంటి సంస్థలు ఇలాంటి ప్రయత్నాలు చేసినప్పటికీ.. టెక్ దిగ్గజమైన అమెజాన్ తీసుకువచ్చిన ఈ కొత్త గ్యాడ్జెట్లు వినియోగదారులను ఏ మేర మెప్పిస్తాయో వేచి చూడాలి.
Also Read: ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?