Credit Card Reward Points: క్రెడిట్ కార్డులను క్రమం తప్పకుండా వాడేవారికి బ్యాంకులు రివార్డ్ పాయింట్లను అందిస్తుంటాయి. అయితే చాలామంది ఈ పాయింట్లను ఎలా వాడుకోవాలో తెలియక చివరకు వాటిని గడువు ముగిసేలా వదిలేస్తుంటారు. నిజానికి ఈ రివార్డ్ పాయింట్లను నేరుగా నగదు రూపంలోకి మార్చుకోవడానికి లేదా క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపుల్లో మినహాయింపు పొందేందుకు చక్కటి అవకాశాలు ఉన్నాయి. సరైన పద్ధతులు ఉపయోగిస్తే పైసా ఖర్చు లేకుండా వీటిని మన అవసరాలకు వాడుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం రండి..
మీ దగ్గర ఉన్న రివార్డ్ పాయింట్లను నగదుగా మార్చుకోవడానికి ప్రధానంగా రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది మీ బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ యాప్‌లోకి లాగిన్ అయి Cashback విభాగాన్ని ఎంచుకోవడం. అక్కడ ఉన్న పాయింట్లను నేరుగా మీ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ క్రెడిట్‌గా మార్చుకోవచ్చు. దీనివల్ల ఆ మొత్తం మీ తదుపరి బిల్లులో తగ్గిపోతుంది. రెండవ మార్గం ఏంటంటే.. ఈ పాయింట్లతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల గిఫ్ట్ వోచర్లు కొనుగోలు చేయడం. వీటిని షాపింగ్ లేదా నిత్యావసరాల కొనుగోలుకు నగదులాగే ఉపయోగించుకోవచ్చు.
Also Read: నకిలీ QR కోడ్లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!
చాలా బ్యాంకులు రివార్డ్ పాయింట్లను క్యాష్‌గా లేదా గిఫ్ట్ కార్డులుగా మార్చే సమయంలో Redemption Fee పేరిట కొంత రుసుము వసూలు చేస్తాయి. సాధారణంగా ఇది రూ.100 నుండి రూ.200 వరకు ఉంటుంది. ఈ ఛార్జీలు పడకుండా ఉండాలంటే మీరు పాయింట్లను విడతల వారీగా కాకుండా.. ఒకేసారి పెద్ద మొత్తంలో జమ అయినప్పుడు రిడీమ్ చేసుకోవడం మంచిది. అలాగే కొన్ని రకాల ప్రీమియం కార్డులలో ఎలాంటి రిడెంప్షన్ రుసుములు ఉండవు. మీ కార్డు నిబంధనలను ఒకసారి సరిచూసుకోవడం ద్వారా ఈ అదనపు భారాన్ని సులభంగా తప్పించుకోవచ్చు.
నేరుగా క్యాష్‌గా మార్చడం కంటే బ్రాండ్ వోచర్లు తీసుకోవడం వల్ల కొన్నిసార్లు ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది. బ్యాంకులు పండుగల సమయంలో కొన్ని బ్రాండ్లపై పాయింట్ల విలువను పెంచి ఇస్తుంటాయి. ఆ సమయంలో వోచర్లు తీసుకుంటే తక్కువ పాయింట్లకు ఎక్కువ విలువైన షాపింగ్ చేసుకోవచ్చు. అలాగే ఇంధన వినియోగం, కరెంట్ బిల్లులు, రీఛార్జీల కోసం ఈ పాయింట్లను నేరుగా వాడితే అదనపు ఛార్జీలు పడకుండా నగదు ఆదా అవుతుంది.
రివార్డ్ పాయింట్లకు సంబంధించి అందరూ చేసే పెద్ద పొరపాటు వాటి గడువును గమనించకపోవడం. సాధారణంగా ఈ పాయింట్లు రెండు నుండి మూడేళ్ల వరకు చెల్లుబాటు అవుతాయి. గడువు ముగిసిపోతే ఆ పాయింట్లు వ్యర్థమవుతాయి. అందుకే ప్రతి నెల వచ్చే కార్డ్ స్టేట్మెంట్లో పాయింట్ల వివరాలను సరిచూసుకోవాలి. గడువు దగ్గర పడుతున్నప్పుడు వెంటనే వాటిని బిల్లు చెల్లింపులకో లేదా వోచర్లకో మార్చేసుకోవాలి. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే క్రెడిట్ కార్డ్ పాయింట్లతో మంచి లాభం పొందవచ్చు.
Also Read: గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?