Agentic AI: సాంకేతిక రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కీలక పాత్ర పోషిస్తోంది. ఈ కృత్రిమ మేధ రాకతో ప్రపంచం పూర్తిగా మారిపోతుంది అని అందరూ అనుకుంటున్నారు. ఇక ఐటీ, ఐటీఈఎస్, బ్యాంకింగ్, హెల్త్‌కేర్ తదితర రంగాల్లో AIతో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకొంటున్నాయి. ఇలాంటి సందర్భంలో AIలకు బాబు లాంటి టెక్నాలజీ Agentic AI రూపంలో మనముందుకు వచ్చేసింది. ఇది మనం వాడే ఏఐ టూల్స్ వంటిది కాదండోయ్.. అంతకు మించినది. ఈ ఏజెంటిక్ ఏఐ మనిషి ప్రమేయం లేకుండానే సొంతంగా నిర్ణలయాను వెలువరించే సామర్థ్యాన్ని కలిగి ఉందట.
ఈ Agentic AI.. అనే పేరు ఏజెన్సీ నుంచి వచ్చింది. ఏజెన్సీలు ఎలాగైతే అప్పగించిన పనులను స్వతంత్రంగా, నిక్కచ్చిగా పూర్తిచేస్తాయో ఈ ఏజెంటిక్ ఏఐ కూడా అలాగే తమ పనులను నిర్వర్తిస్తుందట. మానవ ప్రమేయం అత్యంత తక్కువగా తీసుకొనే ఈ ఏఐ చక్కబెట్టే పనులు 99 శాతం పర్ఫెక్షన్తో ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా మనం ఏదైనా అంశంపై ప్రశ్న అడిగితే.. ఈ జనరేటివ్ ఏఐలు నెట్‌లోని పలు వెబ్సైట్లు, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వంటి డేటాబేస్లను ఆధారంగా చేసుకుని సమాధానాలు ఇస్తుంటాయి. అయితే, Agentic AI మాత్రం దీనికి భిన్నంగా పనిచేస్తుంది. ఉదాహరణకు.. ఏదైనా కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ గురించి ప్లాన్ ఇవ్వమని అడిగితే.. కంపెనీ గోల్స్‌ను దృష్టిలో పెట్టుకుని సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ, ఒక క్యాంపెయిన్ మోడల్‌ను రెడీ చేయగలదు. అలాగే, దీన్ని రోబోలో ఇంటిగ్రేట్ చేస్తే.. ఒక పర్సనల్ అసిస్టెంట్ రోబోగానూ మారగలదు. సంస్థలో ఫైనాన్స్ విషయాలు, సైబర్ సెక్యూరిటీ డ్యూటీస్.. ఇలా ఒక ఉద్యోగి చేసే పని మొత్తం ఏజెంటిక్ ఏఐకి అప్పగించవచ్చు. ఎలాంటి టాస్కులు ఇచ్చినా.. అన్ని విషయాలను స్వతంత్రంగా విశ్లేషించి మీకు మనకు అందించగలదు.
ప్రస్తుతం మనం వాడుతున్న ఏఐను జనరేటివ్ ఏఐ అంటారు. ఇది ఏజెంటిక్ ఏఐకు భిన్నంగా ఉంటుంది. ఏజెంటిక్ ఏఐ సర్వీసులను ఆర్థిక సేవలు, హెల్త్‌కేర్, సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ తదితర రంగాల్లో ఇప్పటికే విరివిగా వినియోగిస్తున్నారు. డ్రైవర్ రహిత కార్లు, స్మార్ట్ హోమ్స్, పర్సనల్ అసిస్టెంట్స్లోనూ ఈ కృత్రిమ మేధ సేవలనే కీలకంగా వాడుతున్నారు.