ISRO LVM3-M5: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆదివారం సాయంత్రం 5.26 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఎల్ఎం3-ఎం5 రాకెట్ (LVM3-M5)ను ప్రయోగించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ రాకెట్ ద్వారా సీఎంఎస్–03 (CMS-03) అనే ఆధునిక సమాచార ఉపగ్రహాన్ని కేవలం 16 నిమిషాలు 09 సెకండ్లలోనే శాటిలైట్‌ను ఇస్రో విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది.
ఈ ప్రయోగం విజయవంతమైన అనంతరం ఇస్రో చైర్మన్ నారాయణన్ మాట్లాడుతూ.. ‘‘ప్రియమైన ఇస్రో కుటుంబ సభ్యులకు, పారిశ్రామిక భాగస్వాములకు మరియు దేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈ రోజు మనం మరో చారిత్రక విజయాన్ని నమోదు చేశాం. మన నమ్మకమైన వాహక నౌక LVM3-M5, శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుండి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. కేవలం 16 నిమిషాల 09 సెకన్లలో, 4,410 కిలోల బరువున్న CMS-03 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని నిర్దేశిత భూస్థిర బదిలీ కక్ష్య (GTO)లో ఖచ్చితంగా ప్రవేశపెట్టాం. ఈ అద్భుతమైన ఘనతను సాధించడానికి, మా బృందాలు వాహన పేలోడ్ సామర్థ్యాన్ని 10% వరకు మెరుగుపరిచాయి.’’ అని అన్నారు.
LVM3 వాహనానికి ఇది ఎనిమిదవ వరుస విజయమని ఇస్రో చైర్మన్ పేర్కొన్నారు. ‘‘ఇదే వాహనం గతంలో మన ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 మిషన్‌ను మోసుకెళ్లి, చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ అయి భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పింది. LVM3 యొక్క 100% విజయాల రికార్డు మన సాంకేతిక నైపుణ్యానికి మరియు పటిష్టమైన సమీక్షా విధానాలకు నిదర్శనం.’’ అని తెలిపారు.
‘‘ఈ విజయం వెనుక ఇస్రో బృందాలు, ప్రాజెక్ట్ డైరెక్టర్లు మా పారిశ్రామిక భాగస్వాముల అంకితభావం, అవిశ్రాంత కృషి ఉన్నాయి. ప్రయోగ సమయంలో వాతావరణం సహకరించకపోయినా, ఎంతో సవాలుగా ఉన్న పరిస్థితుల్లోనూ ఈ మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన ప్రతి ఒక్కరికీ నా వందనాలు.’’ అని అన్నారు.
‘ఆత్మనిర్భర్ భారత్’ స్ఫూర్తితో రూపొందిన ఈ CMS-03 ఉపగ్రహం, రాబోయే 15 సంవత్సరాల పాటు భారత భూభాగం, సముద్ర ప్రాంతాలకు కీలకమైన మల్టీబ్యాండ్ కమ్యూనికేషన్ సేవలను అందిస్తుందన్నారు. ‘‘ఈ గొప్ప ప్రయాణంలో మాకు మార్గనిర్దేశం చేసిన మా మార్గదర్శకులకు, సమీక్షా కమిటీలకు, మా కుటుంబ సభ్యులకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ విజయం మనందరి సమిష్టి కృషికి దక్కిన ఫలం. దేశం గర్వపడేలా చేసిన మీ అందరికీ మరోసారి అభినందనలు.’’ అని అన్నారు.
ఇస్రోకు అభినందనలు: ప్రధాని మోదీ
CMS-03 ఉపగ్రహం విజయవంతం అయిన సందర్భంగా ఇస్రోకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ‘‘మన అంతరిక్ష రంగం మనల్ని నిరంతరం గర్వపడేలా చేస్తోంది! భారతదేశపు అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-03ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రోకు అభినందనలు. మన అంతరిక్ష శాస్త్రవేత్తల కృషితో, మన అంతరిక్ష రంగం శ్రేష్ఠతకు, నవకల్పనలకు పర్యాయపదంగా మారడం అభినందనీయం. వారి విజయాలు జాతీయ పురోగతిని వేగవంతం చేస్తూ, లెక్కలేనన్ని జీవితాలకు సాధికారతను అందిస్తున్నాయి.’’ అని ఎక్స్ వేదికగా మోదీ అన్నారు.