Perplexity: త్వరలో భారత రాజకీయ నాయకుల స్టాక్ మార్కెట్ పెట్టుబడుల వివరాలను వెల్లడించే కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నట్లు ఏఐ (AI) సెర్చ్ ఇంజిన్ ‘పెర్‌ప్లెక్సిటీ’ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ అన్నారు. “భారత రాజకీయ నాయకుల హోల్డింగ్స్ వివరాలు కొన్ని వారాల్లో అందుబాటులోకి వస్తాయి” అని ఆయన ఎక్స్(ట్విట్టర్)వేదికగా ధృవీకరించారు.
ఇటీవలే అమెరికన్ రాజకీయ నాయకుల స్టాక్ ట్రేడింగ్ కార్యకలాపాలను ట్రాక్ చేసే ఫీచర్‌ను పెర్‌ప్లెక్సిటీ ఫైనాన్స్ ప్రారంభించింది. అదే తరహాలో ఇప్పుడు భారత్‌లో కూడా ఈ సదుపాయాన్ని తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల అఫిడవిట్లు, ఇతర పబ్లిక్ ఫైనాన్షియల్ డిక్లరేషన్ల ద్వారా లభించే సమాచారాన్ని ఉపయోగించి ఈ ఫీచర్‌ను రూపొందించనున్నారు. ఈ వార్తపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కొందరు ఈ ఫీచర్ పారదర్శకతను పెంచుతుందని హర్షం వ్యక్తం చేయగా, మరికొందరు.. చాలా మంది రాజకీయ నాయకులు తమ బంధువుల (బినామీ) పేర్ల మీద ఆస్తులు కలిగి ఉంటారని, కాబట్టి ఇది ఎంతవరకు ప్రభావవంతంగా ఉంటుందోనని సందేహాలు వ్యక్తం చేశారు.
Read Also: ISRO LVM3-M5: నింగిలోకి దూసుకెళ్లిన LVM3 M5.. ‘సీఎంఎస్-03’ ప్రయోగం విజయవంతం..
“ఇలాంటి సమాచారాన్ని ప్రజలకు అందించడం వల్ల కలిగే ప్రభావాన్ని చూడటానికి నేను ఆసక్తిగా ఉన్నాను. ప్రారంభ పరిణామాలు కొద్దిగా గందరగోళంగా ఉన్నప్పటికీ.. ధృవీకరించదగిన సమాచారానికి ప్రజలకు ఎక్కువ అందుబాటు ఉండటం అనేది, నాయకులను జవాబుదారీగా ఉంచడానికి సానుకూల అంశం అని నేను నమ్ముతున్నాను. ” అని ఒక యూజర్ కామెంట్ చేశాడు.
“AI అనేది మరొక న్యూస్ అగ్రిగేటర్ మాత్రమే. ఈ హోల్డింగ్‌లన్నీ పబ్లిక్ డొమైన్‌లోనే ఉన్నాయి. మీరు లోతుగా పరిశోధించడానికి సిద్ధంగా ఉంటే. AI దానిని యాక్సెస్ చేయడాన్ని సులభతరం చేస్తుంది.” అని మరో యూజర్ బదులిచ్చాడు. “RTI (సమాచార హక్కు) చేయలేని పనిని AI చేస్తోంది. సిద్ధంగా ఉండండి. ఇకపై మేనిఫెస్టోల కంటే పోర్ట్‌ఫోలియోలే ఎక్కువగా ట్రెండ్ కాబోతున్నాయి.” అంటూ మరో యూజర్ అన్నాడు.