Old AC Sale: వేసవి కాలం వచ్చిందంటే చాలు ఏసీలకు డిమాండ్ అమాంతం పెరిగిపోతుంటుంది. అయితే పాత ఏసీని అమ్మేసి కొత్త ఇన్వర్టర్ ఏసీనో లేదా ఎక్కువ స్టార్ రేటింగ్ ఉన్న ఏసీనో కొనుక్కోవాలని చాలామంది ప్లాన్ చేస్తుంటారు. ప్రస్తుతం చాలా మంది 1.5 టన్ ఏసీలనే వినియోగిస్తున్న నేపథ్యంలో ఈ ఏసీని ఏ విధంగా అమ్మాలి? ఆన్‌లైన్‌లో ఎక్కువ ధర వస్తుందా? లేక స్థానిక మార్కెట్లో (ఆఫ్‌లైన్) ఎక్కువ వస్తుందా? ఎక్కడ అమ్మితే లాభం? అనే పూర్తి వివరాలను ఈ కథనంలో చూద్దాం.
సాధారణంగా ఒక 1.5 టన్ ఏసీని రీసేల్ (సెకండ్ హ్యాండ్) మార్కెట్లో అమ్మినప్పుడు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మధ్య ధరల్లో స్పష్టమైన వ్యత్యాసం ఉన్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు. ఆఫ్ లైన్ లో స్థానిక డీలర్లు, స్క్రాప్ షాపుల్లో సెకండ్ హ్యాండ్ ఏసీని విక్రయిస్తే.. రూ.6,000 – 9,000 పొందొచ్చని పేర్కొంటున్నారు. అదే ఓఎల్ఎక్స్ (OLX), క్యాషిఫై (Cashify), క్వికర్ (Quikr) వంటి ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్ లో ఏసీని అమ్మకానికి పెడితే రూ.9,300 నుంచి రూ.15,000లకు పైగా రీసేల్ వాల్యూ లభిస్తుందని తెలియజేస్తున్నారు. ఏసీ కండిషన్ చాలా బాగుండి.. 1 – 2 ఏళ్లు మాత్రమే వాడి ఉంటే ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో లేదా నేరుగా కొనుగోలు చేసే కస్టమర్ల ద్వారా ఇంకా మెరుగైన ధర వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు.
ఇంటి దగ్గర ఉండే పాత సామాన్లు కొనేవారికో లేదా లోకల్ ఏసీ రిపేర్ షాపుల వారికో ఏసీని అమ్మడం కొన్ని లాభనష్టాలు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. ముందుగా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే.. ఆఫ్ లైన్ లో డీల్ చాలా వేగంగా జరుగుతుంది. వారు వెంటనే ఇంటికి వచ్చి ఏసీని అన్ ఇన్ స్టాల్ చేసి చేతికి డబ్బు ఇచ్చి వెళ్లిపోతారు. ఎక్కువ రోజులు ఎదురుచూడాల్సిన పనిలేదు. ఇక మైనస్ పాయింట్స్ కు వస్తే.. ముందుగా చెప్పుకున్నట్లు ఆఫ్ లైన్ లో రీసేల్ వాల్యూ చాలా తక్కువ. ఎందుకంటే లోకల్ డీలర్లు ఆ ఏసీని మళ్లీ రిపేర్ చేసి కొంత లాభం చూసుకుని ఇంకొకరికి అమ్ముతుంటారు. కాబట్టి వారు చాలా తక్కువ ధరకు బేరం ఆడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఆన్‌లైన్‌లో కంపెనీల నుండి నేరుగా ‘డోర్‌స్టెప్ పికప్’ సౌకర్యం ఉంటుంది. క్యాషిఫై లాంటి యాప్స్‌లో ఏసీ బ్రాండ్, కండిషన్ వివరాలు ఇస్తే.. ఆటోమేటిక్‌గా ఒక ధర చూపిస్తుంది. ఆఫ్‌లైన్ మార్కెట్ కంటే ఆన్ లైన్ లో కనీసం రూ.1,500 నుండి రూ.3,000 వరకు అదనంగా ధర లభించే అవకాశం ఉంది. ఒకవేళ ‘ఓఎల్ఎక్స్’ లో నేరుగా కొనే కస్టమర్ దొరికితే ఇంకా మంచి రేట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక మైనస్ ల విషయానికి వస్తే.. ఆన్ లైన్ లో సరైన కస్టమర్ దొరకడానికి కొన్ని రోజులు సమయం పట్టొచ్చు. అలాగే ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ఫేక్ కాల్స్ లేదా ఆన్‌లైన్ మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
Also Read: ఏసీలో వింత శబ్దాలు వస్తున్నాయా? కారణం ఇదే కావొచ్చు.. జాగ్రత్త భయ్యో!
పాత ఏసీని అమ్మాలని భావించినప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాలు దాని రీసేల్ వాల్యూని డిసైడ్ చేస్తూ ఉంటాయి. ప్రధానంగా బ్రాండ్ వాల్యూ దీనిలో ముఖ్య భూమిక పోషిస్తుంది. డైకిన్, ఎల్ జీ, వోల్టాస్, శాంసంగ్, బ్లూస్టార్ వంటి పాపులర్ బ్రాండ్ల ఏసీలకు మార్కెట్లో రీసేల్ డిమాండ్ ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది. మరోవైపు ఏసీ కండిషన్ కూడా ధరను డిసైడ్ చేస్తుంది. ఏసీ ఆన్ చేసినప్పుడు శబ్దాలు లేకుండా, గ్యాస్ లీకేజీ కాకుండా.. పర్ఫెక్ట్‌గా కూలింగ్ వస్తే రీసేల్ వాల్యూ బాగుంటుంది. అలాగే 3 స్టార్ లేదా 5 స్టార్ ఏసీలకు మంచి ధర దక్కొచ్చు. ఇక ఏసీ కొని 1 నుండి 3 ఏళ్ల లోపు అయితే.. ఏసీకి సగం ధర లభించే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ 5 ఏళ్లు దాటితే రీసేల్ ధర కనిష్టానికి పడిపోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
Also Read: Central vs Split AC: ఏసీ నెత్తిన ఉంటే మంచిదా? గోడకు ఉంటే బెటరా? ఇంటికి ఏది బెస్ట్!