UPI Spend Analytics| గూగుల్ పే, ఫోన్ పే లాంటి యుపిఐ సేవలతో డిజిటల్ చెల్లింపులు చాలా సులభంగా, వేగంగా జరిగిపోతాయి. అయితే ఈ సులభ పేమెంట్స్ అలవాటుతో చాలా మంది రోజువారీ ఖర్చులను ట్రాక్ చేయలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం అనవసర ఖర్చులు పెరిగిపోవడం. గతంలో నగదుతో చెల్లించేటప్పుడు డబ్బు మన చేయి దాటి వెళ్తున్నట్లు స్పష్టంగా కనిపించేది. అది ఖర్చులను నియంత్రించడానికి సహాయపడేది. కానీ డిజిటల్ చెల్లింపుల్లో ఆ భావన లేకపోవడంతో చిన్న చిన్న UPI లావాదేవీలు కలిసి బ్యాంకు బ్యాలెన్స్‌ను తగ్గిస్తున్నాయి. అకౌంట్ బ్యాలెన్స్ చూసినప్పుడే ఎక్కువ ఖర్చు అయినట్లు తెలుస్తోంది. ఈ సమస్యకు ప్రభుత్వం ఒక మంచి పరిష్కారం సూచించింది. BHIM UPI యాప్‌లో ఖర్చులను గమనించేందుకు ఒక ట్రాకింగ్ ఫీచర్ ఉంది.
దీంతో డిజిటల్ ఖర్చులను సులభంగా అర్థం చేసుకుని నియంత్రించవచ్చు.
BHIM అనేది భారత ప్రభుత్వం సపోర్ట్ చేసే UPI పేమెంట్స్ యాప్. ఇందులో స్పెండ్ అనలిటిక్స్ అనే స్మార్ట్ ఫీచర్ ఉంది. ఈ ఫీచర్ మీ UPI ఖర్చులను వివరంగా చూపిస్తుంది. ఒకే ట్యాప్‌తో మీ ఖర్చుల రికార్డ్ చూడవచ్చు. ఇది డిజిటల్ ఖర్చు డైరీ లాంటిది. సాంప్రదాయ నగదు బడ్జెట్ లాగే డబ్బును ట్రాక్ చేయడానికి సహాయపడుతుంది. డిజిటల్ చెల్లింపుల్లో ఖర్చు అవగాహన తిరిగి తెస్తుంది.
స్పెండ్ అనలిటిక్స్ BHIM హోమ్ స్క్రీన్‌పైనే కనిపిస్తుంది. నెలవారీ ఖర్చు వివరాలను తక్షణమే చూడవచ్చు. యాప్ ఆటోమాటిక్‌గా ఖర్చులను కేటగిరీలుగా విభజిస్తుంది. షాపింగ్, ఫుడ్, యూటిలిటీస్ వంటి వర్గాల్లో ఎంత ఖర్చు అయిందో చూపిస్తుంది. ఎక్కడ ఎక్కువ ఖర్చు చేస్తున్నారో సులభంగా తెలుస్తుంది. దీంతో అనవసర ఖర్చులను తగ్గించవచ్చు. ఉదాహరణకు షాపింగ్ ఖర్చు ఎక్కువగా ఉంటే స్పష్టంగా కనిపిస్తుంది. దాని ఆధారంగా మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయిని పరిశీలించుకోవచ్చు.
Also Read: ఇంటర్నెట్‌లో ఫ్రీగా సినిమాలు చూసేవారిపై కేసులు.. హెచ్చరిక జారీ చేసిన ప్రభుత్వం
మీ స్మార్ట్‌ఫోన్‌లో BHIM UPI యాప్ ఓపెన్ చేయండి. హోమ్ స్క్రీన్‌పై స్పెండ్ అనలిటిక్స్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేస్తే నెలవారీ ఖర్చు సమ్మరీ కనిపిస్తుంది. మొత్తం ఖర్చు, కేటగిరీల వారీగా వివరాలు చూడవచ్చు. “వ్యూ ఆల్ కేటగిరీస్” సెలెక్ట్ చేస్తే ప్రతి కేటగిరీలో ఎంత ఖర్చు అయిందో కచ్చితమైన మొత్తాలు కనిపిస్తాయి. కిందికి స్క్రోల్ చేస్తే అంతకుముందు నెలల ఖర్చు చార్ట్‌లు కనిపిస్తాయి. ఈ చార్ట్‌లు నెలల వారీగా పోలిక చూపిస్తాయి. ఏ నెలలో ఎక్కువ ఖర్చు అయిందో సులభంగా తెలుస్తుంది.
స్పెండ్ అనలిటిక్స్‌లో బడ్జెట్ సెట్ చేసే ఆప్షన్ కూడా ఉంది. ఇది ఓవర్ స్పెండింగ్‌ను అరికట్టడానికి సహాయపడుతుంది. పైన “సెట్ బడ్జెట్” ఆప్షన్‌పై ట్యాప్ చేయండి. మీరు కోరుకునే నెలవారీ ఖర్చు మొత్తాన్ని ఎంటర్ చేయండి. బడ్జెట్ సెట్ అయ్యాక చార్ట్‌పై ఎరుపు లైన్ కనిపిస్తుంది. ఆ లైన్ దాటితే అంటే బడ్జెట్ దాటిపోయినట్లు. ఈ విజువల్ వార్నింగ్ మంచి ఆర్థిక క్రమశిక్షణకు దోహదపడుతుంది.
BHIMలో పారదర్శకత, సరళమైన ఫీచర్స్ ఉన్నాయి. రియల్-టైమ్‌లో ఖర్చు అవగాహన ఇస్తుంది. ఖర్చులు ట్రాక్ చేయడానికి అదనపు యాప్స్ అవసరం లేదు. అన్నీ ఒకే సురక్షిత ప్రభుత్వ యాప్‌లో ఉంటాయి. స్మార్ట్ డిజిటల్ చెల్లింపు అలవాట్లను ప్రోత్సహిస్తుంది. దీంతో నిరంతరం డబ్బు ఆదా చేయవచ్చు.