iPhone 17 Pro Price Cut: పండుగల సీజన్ వచ్చిందంటే చాలు.. ఈ-కామర్స్ సైట్లు, రిటైల్ స్టోర్లు ఆఫర్లతో హోరెత్తిస్తాయి. ఇక ఐఫోన్ లాంటి ప్రీమియం ఫోన్లపై భారీ డిస్కౌంట్లు కనిపిస్తే.. కొనాలనుకునేవారికి అంతకంటే మంచి ఛాన్స్ ఏముంటుంది? ఇప్పుడు సరిగ్గా ఇలాంటి ఆఫర్‌తోనే వార్తల్లో నిలుస్తోంది క్రోమా. రూ.1.30 లక్షలకు పైగా ధర ఉన్న ఐఫోన్ 17 ప్రోను కేవలం రూ.94 వేలకే ఇస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో ఐఫోన్ కొనాలనుకునేవారి దృష్టి ఈ ఆఫర్‌పై పడింది. అయితే, నిజంగానే అంత తక్కువ ధరకు ఫోన్ వస్తుందా? ఈ డిస్కౌంట్ వెనుక ఉన్న అసలు లెక్కేంటి? బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్‌ఛేంజ్ డీల్స్‌తో ముడిపడి ఉన్న షరతులేమైనా ఉన్నాయా? ఈ ఆఫర్ చూసి వెంటనే కొనేయడానికి ముందు తెలుసుకోవాల్సిన కీలక విషయాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
క్రోమా చెబుతున్న ఆ రూ.94,000 ధర అనేది ఏ ఒక్కరూ నేరుగా వెళ్లి దుకాణంలో తగ్గించుకునే ఫ్లాట్ డిస్కౌంట్ కాదు. ఈ ఆఫర్ వర్తించాలంటే కొన్ని షరతులు ఉన్నాయి. ఇందులో రూ.4,000 బ్యాంక్ క్యాష్ బ్యాక్, రూ.8,000 ఎక్స్చేంజ్ బోనస్ ఉన్నాయి. అలాగే మీ దగ్గర ఉన్న పాత ఐఫోన్ 14 ఫోన్ కు రూ.24,000 వాల్యూ కడితేనే ఆ మొత్తం వస్తుంది. ఒకవేళ మీ దగ్గర పాత ఫోన్ లేకపోతే మాత్రం ఈ రేటుకు ఆ ఫోన్ అస్సలు రాదు.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ కంటెంట్ ఇకపై కనిపించదు.. మెటాకు కేంద్రం గట్టి ఆదేశాలు జారీ!
డబ్బులు వెనక్కి రావడానికి బదులుగా టాటా న్యుకాయిన్స్ ఇస్తామని కూడా క్రోమా ఆఫర్ చేస్తోంది. ఈ లెక్కల ప్రకారమైతే ఐఫోన్ 17 ప్రో ధర ఇంకా తగ్గి సుమారు రూ.88,000 దాకా పడుతుందని చెబుతున్నారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఈ కాయిన్స్ నేరుగా మీ చేతికి నగదులా రావు. కేవలం ఆ కంపెనీ యాప్‌లో మాత్రమే వాడుకోవడానికి వీలవుతాయి. మీరు రోజూ ఆ ప్లాట్ ఫామ్స్‌లో షాపింగ్ చేసేవారైతే ఇది బాగానే ఉంటుంది. లేదంటే ఆ పాయింట్స్ వల్ల మీకు పెద్దగా ఒరిగేదేం ఉండదు.
కేవలం ఐఫోన్లు వాడేవారికే కాకుండా.. ఆండ్రాయిడ్ ఫోన్లు మార్చుకునే వాళ్లకు కూడా కొన్ని ఆఫర్లు పెట్టారు. రూ.70,000 నుంచి రూ.80,000 విలువ చేసే మంచి ఆండ్రాయిడ్ ఫోన్ ఇస్తే, దానికి రూ.18,000 ఎక్స్చేంజ్ వాల్యూ ఇస్తారు. దీనికి బ్యాంక్ ఆఫర్లు, బోనస్‌లు అన్నీ కలిపితే సుమారు రూ.లక్ష పడుతుంది. మీరు ఎక్స్చేంజ్ చేసే ఫోన్ కండిషన్ బట్టి ఈ ధర మారుతూ ఉంటుంది.
ఈ క్రోమా ఆఫర్లు అన్నీ ఈ నెల 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మీరు గనుక కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, మీ పాత ఫోన్ కండిషన్ ఎలా ఉందో చూసుకోవాలి. అలాగే ఏ క్రెడిట్ కార్డుపై క్యాష్ బ్యాక్ వస్తుందో ముందే చెక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే అందరికీ ఒకేలాంటి ధర రాదు, వారి వారి పాత ఫోన్లను బట్టి ఈ రేట్లు మారుతుంటాయి.