CNAP Caller ID: సాధారణంగా మన ఫోన్‌కి ఏదైనా కొత్త నంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు.. అది ఎవరు చేశారు? లిఫ్ట్ చేయాలా వద్దా? అని చాలామంది ఆలోచిస్తుంటారు. దాదాపు ప్రతిఒక్కరూ రోజూ ఈ రకమైన సమస్యను ఎదుర్కొంటూనే ఉంటారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మన ఫోన్ స్క్రీన్ మీద కాలర్ పేరు స్పష్టంగా కనిపిస్తుంది. దీనికోసం ప్రత్యేకంగా ఏ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ కొత్త మార్పు గురించిన పూర్తి వివరాలు మీకోసం..
కేంద్ర టెలికాం శాఖ ‘కాలర్ నేమ్ ప్రజెంటేషన్’ (CNAP) అనే కొత్త వ్యవస్థను తీసుకొస్తోంది. నవంబర్ 1 నుంచి 4జీ, 5జీ నెట్వర్క్ వినియోగదారులందరికీ ఇది ఉచితంగా, స్వయంచాలకంగా ప్రారంభమవుతుంది. మీరు ఎవరి నంబర్‌నైనా సేవ్ చేసుకుంటే మీ ఫోన్లో ఏ పేరుతో ఉందో అదే కనిపిస్తుంది. ఒకవేళ నంబర్ సేవ్ లేకపోతే.. టెలికాం కంపెనీల వద్ద ఉండే అధికారిక సమాచారం ఆధారంగా వారి అసలు పేరు స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతుంది. విదేశాల నుంచి వచ్చే కాల్స్ విషయంలో మాత్రం ‘ఇంటర్నేషనల్ కాల్’ అని చూపిస్తుంది.
Also Read: వాట్సప్‌లో ఇప్పటివరకు రాని క్రేజీ ఫీచర్.. ఇది తెలిస్తే గాల్లో తేలిపోతారు!
కాలర్ వివరాలను చూపించే క్రమంలో వినియోగదారుల ప్రైవసీకి ఎలాంటి భంగం వాటిల్లకుండా టెలికాం శాఖ కఠిన నిబంధనలు విధించింది. ఫోన్ కాల్ ముగిసిన వెంటనే ఆ కాలర్ పేరుకు సంబంధించిన సమాచారం సిస్టమ్ నుంచి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. ఎలాంటి డేటా స్టోర్ కాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే, తమ నంబర్ రహస్యంగా ఉంచుకునే కాలర్ లైన్ ఐడెంటిఫికేషన్ రెస్ట్రిక్షన్ (CLIR) సదుపాయం వాడుకునే వారి వివరాలను ఈ సిస్టమ్ బయటపెట్టదు.
కంపెనీలు లేదా వ్యాపారాలు చేసేవారు తమ కస్టమర్లకు కాల్స్ చేసేటప్పుడు తమకు ఇష్టమొచ్చిన పేరును ప్రదర్శించడానికి వీల్లేదు. వారు ఉపయోగించే పేరు కచ్చితంగా నమోదిత ట్రేడ్‌మార్క్ లేదా జీఎస్టీ ఆమోదించిన వ్యాపార పేరుతో మాత్రమే సరిపోలాలి. టెలికాం కంపెనీలు అన్ని పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఆ పేరును అనుమతిస్తాయి. దీనివల్ల నకిలీ కంపెనీల పేరుతో జరిగే మోసాలకు చెక్ పడుతుంది.
ప్రస్తుతానికి ఈ కొత్త ఫీచర్ కేవలం 4జీ, 5జీ నెట్‌వర్క్‌లలో మాత్రమే అందుబాటులోకి వస్తోంది. పాత 2జీ, 3జీ నెట్‌వర్క్‌లతో పాటు ల్యాండ్‌లైన్ ఫోన్లకు కూడా ఈ సౌకర్యాన్ని ఎలా విస్తరించాలనే దానిపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. ట్రాయ్ సిఫార్సుల మేరకు తీసుకొచ్చిన ఈ నిర్ణయం వల్ల సైబర్ మోసాలు, అనవసర ప్రమోషనల్ కాల్స్ నుంచి సామాన్యులకు ఉపశమనం లభిస్తుంది. అయితే, స్క్రీన్ మీద పేరు కనిపించినంత మాత్రాన ప్రతీ కాల్‌నూ గుడ్డిగా నమ్మకుండా, అప్రమత్తంగా ఉండటం ఎప్పుడూ మంచిది.
Also Read: ల్యాప్‌టాప్ ఛార్జింగ్ 80% దగ్గరే ఆగిపోతుందా? బ్యాటరీ పాడైపోయిందనుకుంటే పప్పులో కాలేసినట్లే!