WhatsApp Message Scheduling: స్నేహితులకు అర్ధరాత్రి బర్త్‌డే విషెస్ చెప్పాలన్నా.. ఆఫీస్ కొలీగ్స్‌కు ఉదయాన్నే ముఖ్యమైన రిమైండర్ పంపాలన్నా ఇకపై నిద్ర పాడుచేసుకోవాల్సిన అవసరం లేదు. మనందరి రోజువారీ జీవితంలో భాగమైపోయిన ప్రముఖ మెమేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సప్ త్వరలోనే ఒక సరికొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది. అదే మెసేజ్ షెడ్యూలింగ్. దీని ద్వారా మనం పంపాలనుకునే సమాచారాన్ని ముందుగానే సమయం కేటాయించి సెట్ చేసి పెట్టుకోవచ్చు. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే టైమ్‌కి మెసేజ్ చేయడం మరిచిపోతామనే భయమే ఉండదు.
ఈ కొత్త అప్డేట్ ద్వారా కేవలం సాధారణ టెక్స్ట్ మెసేజ్‌లు మాత్రమే కాకుండా.. ఫొటోలు, వీడియోలు అలాగే వెబ్సైట్ లింక్‌లను కూడా షెడ్యూల్ చేయవచ్చు. గరిష్టంగా 14 రోజుల ముందే.. అంటే రెండు వారాల వ్యవధికి సరిపడా మెసేజ్‌లను సెట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే ఫొటోలు లేదా వీడియోలు పంపేటప్పుడు ఒకసారికి ఒక సందేశాన్ని మాత్రమే షెడ్యూల్ చేసేలా ప్రస్తుతం టెస్టింగ్ చేస్తున్నారు. వ్యక్తిగత చాట్లతో పాటు గ్రూప్‌లలో కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
Also Read: వాషింగ్ మెషీన్లపై అమెజాన్ సంచలన ఆఫర్లు.. రూ.27 వేలకే బ్రాండెడ్ మోడల్!
వాట్సప్‌లో మెసేజ్ టైప్ చేసిన తర్వాత సాధారణంగా నొక్కే సెండ్ బటన్‌ను కొద్దిసేపు ప్రెస్ చేసి పట్టుకుంటే చాలు. అక్కడ మనకు తేదీ, సమయం ఎంచుకునే ఆప్షన్ కనిపిస్తుంది. కనిష్టంగా 10 నిమిషాల నుంచి గరిష్టంగా 14 రోజుల వరకు సమయాన్ని సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ పొరపాటున ఏదైనా తప్పుగా షెడ్యూల్ చేసినా.. చాట్ ఇన్ఫోలోకి వెళ్లి ఆ మెసేజ్‌ను ఎడిట్ చేయడం లేదా డిలీట్ చేయడం వంటివి చాలా సులభంగా చేసుకోవచ్చు.
మన ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉన్నా లేదా ఇంటర్నెట్ ఆఫ్‌లో ఉన్నా సరే, మనం సెట్ చేసిన సమయానికి ఆ మెసేజ్ అవతలి వ్యక్తికి ఆటోమేటిక్‌గా వెళ్లిపోతుంది. ఎప్పటిలాగే ఈ షెడ్యూల్ మెసేజ్‌లకు కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ భద్రత ఉంటుంది. కాబట్టి.. ప్రైవసీ గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదు. గ్రూప్ చాట్స్‌లో అయితే మెసేజ్ పంపే సమయానికి ఆ గ్రూప్‌లో ఉన్న సభ్యులకు మాత్రమే అది డెలివరీ అవుతుంది.
ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ వాడుతున్న కొంతమంది యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. మెటా సంస్థ దీనిపై తుది పరీక్షలు నిర్వహిస్తోంది. త్వరలోనే ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులందరికీ ఈ ఆసక్తికరమైన ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ అప్డేట్ వస్తే వాటసాప్ వాడకం మరింత సులభంగా, అనుకూలంగా మారడం ఖాయం.
Also Read: మ్యాక్‌బుక్ కొనాలనే డ్రీమ్ నెరవేర్చుకునే టైమ్ వచ్చింది.. అమెజాన్ సేల్‌లో రూ.68 వేలకే లభ్యం!