Dark Comedy Movie OTT : స్నేహితులతో కలిసి గడిపే పుట్టినరోజు వేడుక అంటే సరదా మాటలు, పాత జ్ఞాపకాలు, నవ్వులతో నిండిపోవాలి. ఎన్నాళ్లుగానో కలవని వాళ్లు ఒకచోట చేరితే పాత విషయాలు గుర్తు చేసుకుంటూ సమయం గడిచిపోతుంది. కానీ అదే వేడుక మధ్యలో భారీ తుఫాను వచ్చి, అందరూ ఒకే చోట చిక్కుకుపోతే పరిస్థితి ఎలా మారుతుంది ? బయటకు ప్రశాంతంగా కనిపించే వ్యక్తుల మధ్య దాగి ఉన్న అసూయలు, పాత గొడవలు, చెప్పని నిజాలు ఒక్కొక్కటిగా బయట పడితే ఆ రాత్రి మరిచిపోలేని భయంకరమైన కాలరాత్రిగా మారుతుంది. ఈ ఆలోచనను డార్క్ కామెడీతో చూపించే స్వీడిష్ చిత్రం ‘ది స్టార్మ్’ (The Storm). మరి ఈ సినిమాను ఎక్కడ చూడవచ్చు ? అనేది తెలుసుకుందాం పదండి.
ఫిలిప్ తన 45వ పుట్టినరోజును ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఉత్తర స్వీడన్ లో కొత్తగా కొనుగోలు చేసిన విలాసవంతమైన వ్యవసాయ క్షేత్రంలో భార్యతో కలిసి స్నేహితుల కోసం విందు ఏర్పాటు చేస్తాడు. అందరూ ఒకచోట చేరి ఆనందంగా గడపాలని అతని ఉద్దేశం. కానీ ఊహించని ట్విస్ట్ ఈ వేడుకను పూర్తిగా మార్చేస్తుంది. భారీ తుఫాను కారణంగా అతిథులు అక్కడి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది. మొదట్లో ఇది కేవలం వాతావరణ సమస్యలా కనిపించినా, సమయం గడిచేకొద్దీ అక్కడి వాతావరణం మరింత అసౌకర్యంగా మారుతుంది.
ఒకే చోట ఎక్కువసేపు ఉండాల్సి వచ్చినప్పుడు మనుషులు తమ భావాలను ఎప్పటికీ దాచలేరు. సాధారణంగా నవ్వుతూ పలకరించే స్నేహితుల మధ్య పాత పగలు బయట పడతాయి. తాగిన మత్తులో అప్పటిగా మర్యాదగా వ్యవహరించిన వాళ్ళే గొడవల్లోకి వస్తారు. కొందరు తమను తాము సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తే, మరికొందరు ఇంతకాలం దాచుకున్న అసంతృప్తిని బయట పెడతారు. విందులో మొదలైన చిన్న మాటల యుద్ధం క్రమంగా అదుపు తప్పుతుంది. తుఫాను బయట ఎంత తీవ్రంగా ఉందో, అక్కడి మనుషుల మధ్య భావోద్వేగాల తుఫాను కూడా అంతే తీవ్రంగా మారుతుంది.
Also Read : వయసు 50 దాటినా యాక్షన్లో తగ్గేదేలే… పాత గూఢచారులు మళ్లీ రంగంలోకి… అదిరిపోయే కొరియన్ యాక్షన్ కామెడీ సిరీస్
‘ది స్టార్మ్’ అక్టోబర్ 15 నుంచి నెట్ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ కు వచ్చింది. జోసెఫిన్ బోర్నెబుష్ (Josephine Bornebusch) ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు నటించారు. గుస్తాఫ్ స్కార్స్గార్డ్ (Gustaf Skarsgård), అలియెట్ ఒప్హైమ్ (Aliette Opheim), ఫిలిప్ బెర్గ్ (Filip Berg), జోనాస్ కార్ల్సన్ (Jonas Karlsson) తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఇది కేవలం తుఫానులో చిక్కుకున్న స్నేహితుల కథ కాదు. మనిషి తనకు అనుకూలంగా ఉన్నప్పుడు చూపించే ముఖం, ఒత్తిడిలో ఉన్నప్పుడు బయటపడే నిజమైన స్వభావం మధ్య ఉన్న తేడాను సెటైరికల్ గా చూపించే కథ.