Pixel Watch 5 Stephen Curry Edition: గూగుల్ ఇటీవలే మార్కెట్‌లోకి తీసుకొచ్చిన ‘పిక్సెల్ వాచ్ 5 సిరీస్’లో సరికొత్త మోడల్ అందుబాటులోకి వచ్చింది. బాస్కెట్‌బాల్ దిగ్గజం స్టీఫెన్ కర్రీ పేరుతో ఓ స్పెషల్ ఎడిషన్ స్మార్ట్‌వాచ్‌ను గూగుల్ సేల్స్‌కు ఉంచింది. సాధారణ మోడల్స్ వచ్చిన రెండు వారాలకే ఈ కొత్త వేరియంట్ రావడం గమనార్హం. ఇది చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉండటమే కాకుండా క్రీడాకారులకు, ఫిట్‌నెస్ ప్రియులకు బాగా నచ్చేలా ఉంది.
ఈ స్పెషల్ ఎడిషన్ వాచ్ 45 మి.మీ సైజులో మాత్రమే లభిస్తుంది. దీని కోసం శాటిన్ పైరైట్ అల్యూమినియం కేస్‌ను వాడారు. వాచ్‌తో పాటు రై కలర్‌లోని పర్‌ఫార్మెన్స్ లూప్ స్ట్రాప్ వస్తుంది. వర్కవుట్స్ చేసే సమయంలో చెమట పట్టినా ఏమీ కాకుండా దీనికి వాటర్ రెసిస్టెంట్ కోటింగ్ ఇచ్చారు. ఈ స్ట్రాప్‌పై స్టీఫెన్ కర్రీ బ్రాండింగ్ స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణ పిక్సెల్ వాచ్ 5 కొనేవారికి ఈ ప్రత్యేకమైన స్ట్రాప్ లభించదు.
Also Read: బోస్ సౌండ్‌తో నోయిస్ ప్రీమియం ఇయర్‌ఫోన్స్.. స్టైలిష్ లుక్, అదిరిపోయే ఫీచర్లు!
ఈ పిక్సెల్ వాచ్ 5 స్టీఫెన్ కర్రీ ఎడిషన్ వేరియంట్ ధర మన ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 54,800గా ఉంది. ఒకవేళ మీకు కేవలం ఆ వాచ్ స్ట్రాప్ మాత్రమే కావాలనుకుంటే విడిగా రూ.5,700 చెల్లించి కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఈ వాచ్ గూగుల్ స్టోర్, అమెజాన్ ప్లాట్‌ఫారంలలో అమ్మకానికి అందుబాటులో ఉంది. సాధారణ పిక్సెల్ వాచ్ 5 మోడల్స్ ధరలు రూ.37,700 నుండి ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే.
ఇందులో 3,000 నిట్స్ బ్రైట్‌నెస్ ఇచ్చే బెస్ట్ డిస్ప్లే ఉంది. ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి గొరిల్లా గ్లాస్ రక్షణ ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ వాచ్.. మునుపటి మోడల్ కంటే వేగంగా పనిచేస్తుంది. ఇందులో 64GB స్టోరేజ్ ఇచ్చారు. అంతేకాకుండా.. గూగుల్ జెమిని ఏఐ సపోర్ట్ కూడా ఉండటంతో మెయిల్స్, క్యాలెండర్ సమాచారాన్ని సులభంగా చూసుకోవచ్చు.
ఈ వాచ్ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది. ఈసీజీ, గుండె వేగం, ఆక్సిజన్ స్థాయిలు, నిద్ర నాణ్యత, రక్తపోటు, మానసిక ఒత్తిడిని ఇది నిరంతరం ట్రాక్ చేస్తుంది. ఇందులో ప్రమాదాలను గుర్తుపట్టే ప్రత్యేక ఏఐ ఫీచర్లు ఉన్నాయి. సింగిల్ ఛార్జ్‌పై ఈ వాచ్ దాదాపు 40 గంటల వరకు పనిచేస్తుంది. కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తో 15 గంటల బ్యాటరీ లైఫ్ పొందే వెసులుబాటు కూడా ఉంది.
Also Read: ఉచితంగా ఇంగ్లీష్ నేర్చుకునే సువర్ణావకాశం.. Airtel కస్టమర్లకు మాత్రమే ఈ ఛాన్స్!