Madhu Yashki Goud: ప్రస్తుతం దేశం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంటోందని ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి పౌరులందరూ కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి దేశ రాజ్యాంగానికి తీవ్ర ముప్పు ఏర్పడిందని ఆరోపించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పౌరుల ప్రాథమిక స్వేచ్ఛను కాలరాస్తోందని మధుయాష్కి విమర్శించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను రక్షించడానికే 2017లో రాహుల్ గాంధీ మార్గదర్శకత్వంలో ‘ప్రొఫెషనల్ కాంగ్రెస్’ ఆవిర్భవించిందని గుర్తుచేశారు. దేశంలో ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ ద్వారా మోదీ ప్రభుత్వం సుమారు 13 కోట్ల ఓట్లను అక్రమంగా తొలగించిందన్నారు. అలా తొలగించిన ఓట్లలో దళితులు, ఆదివాసీలు, మైనారిటీ వర్గాలకు చెందినవే అత్యధికంగా ఉన్నాయన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా బయటపెట్టామని స్పష్టం చేశారు.
దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో బారిస్టర్లు, లాయర్లు, డాక్టర్లు వంటి ప్రొఫెషనల్స్ ఎంతటి కీలక పాత్ర పోషించారో అందరికీ తెలుసని మధుయాష్కి పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లోనూ వారి పాత్ర అంతకంటే కీలకమని పేర్కొన్నారు. కాంగ్రెస్ లో సభ్యత్వం లేని వారు, ఇతర పార్టీల సానుభూతిపరులు కూడా రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రొఫెషనల్ కాంగ్రెస్లో భాగస్వాములు కావచ్చునని పిలుపునిచ్చారు. ఇందులో పనిచేసే వారికి విశ్వసనీయత (Credibility) ఉండాలన్నదే రాహుల్ గాంధీ ఆకాంక్ష అని తెలిపారు. నిష్ణాతులతో కూడిన నూతన కమిటీలను కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు.
మేధావులను తీర్చిదిద్దేందుకు చేపట్టిన మన్మోహన్ సింగ్ ఫెలోషిప్ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందని మధుయాష్కి అన్నారు. మొదటి విడతలో వివిధ రంగాల నిపుణులైన 50 మందికి ఏడాది పాటు శిక్షణ ఇచ్చామని తెలిపారు. రెండో విడతలో ఏకంగా 800 దరఖాస్తులు రాగా అందులో 100 మందిని ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇచ్చామని వెల్లడించారు.
Also Read: రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!
మరోవైపు స్వాతంత్ర్య పోరాట సమయంలో బ్రిటిష్ వారితో చేతులు కలిపిన చరిత్ర బీజేపీ, జనసంఘ్ నాయకులదని మధుయాష్కి ఆరోపించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన ఇందిరా గాంధీ కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ ఎప్పటికీ దేశానికి హాని తలపెట్టరని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ బంగ్లాదేశ్ వంటి పరిస్థితులను కోరుకోవడం లేదని, ప్రజలను అప్రమత్తం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్గా తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని మధుయాష్కీ గౌడ్ హామీ ఇచ్చారు.
Also Read: జనసేన మున్సిపల్ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల.. విజయవాడ బరిలో వంగవీటి రాధాకృష్ణ