YouTube Monetization: ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌గా యూట్యూబ్ కొనసాగుతోంది. ప్రతి నెలా బిలియన్ల కొద్దీ వ్యూవర్స్.. విద్య, వినోదం, ట్యుటోరియల్స్, వార్తలతో పాటు అనేక రకాల సమాచారం కోసం దీనిపైనే ఆధారపడుతున్నారు. అయితే కేవలం వీడియోలు చూడటానికే పరిమితం కాకుండా తమలోని సృజనాత్మకత, నైపుణ్యాలతో డిజిటల్ కంటెంట్ క్రియేటర్లుగా మారి రాబడి గడించేందుకు కూడా యూట్యూబ్ ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తోంది. అయితే యూట్యూబ్‌లో విజయం సాధించి, స్థిరమైన ఆదాయం పొందాలంటే అంత తేలికైన విషయం కాదు. యూట్యూబ్ లో సక్సెస్ కావాలంటే అనుసరించాల్సిన మార్గాలేంటో ఈ కథనంలో చూద్దాం.
యూట్యూబ్‌లో సంపాదన దిశగా పడే మొదటి అడుగు సొంత ఛానెల్‌ను క్రియేట్ చేయడమే. దీనికోసం మెుదటగా ఒక గూగుల్ (Gmail) ఖాతా ఉంటే సరిపోతుంది. లాగిన్ అయిన తర్వాత మీ అభిరుచి, నైపుణ్యాలకు తగిన రంగాన్ని (Niche) ఎంచుకుని ఛానెల్ ప్రారంభించవచ్చు. టెక్నాలజీ, ఎడ్యుకేషన్, ఫైనాన్స్, ఎంటర్టైన్మెంట్, హెల్త్, ట్రావెల్, గేమింగ్, కుకింగ్, ప్రొడక్ట్ రివ్యూస్ వంటి విభాగాలు ప్రస్తుతం మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి. నిర్దిష్టమైన ఒక అంశాన్ని ఎంచుకోవడం వల్ల టార్గెటెడ్ ఆడియన్స్‌ను ఆకర్షించడం, సబ్స్క్రైబర్ల బేస్‌ను వేగంగా పెంచుకోవడం సులభమవుతుంది.
యూట్యూబ్‌లో ఛానెల్ రీచ్ పెరగాలంటే క్రమం తప్పకుండా వీడియోలు అప్లోడ్ చేయడం చాలా కీలకం. వీక్షకులకు ఉపయోగపడే, ఆకట్టుకునేలా ఉండే ఒరిజినల్ కంటెంట్‌ను ఒక నిర్దిష్టమైన టైమ్‌టేబుల్ ప్రకారం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. క్లారిటీ ఆడియో, నాణ్యమైన విజువల్స్, విలువైన సమాచారం వీక్షకులను ఎక్కువసేపు వీడియోలు చూసేలా చేస్తాయి. ఇది కొత్త సబ్స్క్రైబర్లను తేవడమే కాకుండా పాత వీక్షకులు మళ్లీ మళ్లీ ఛానెల్‌ని సందర్శించేలా చేస్తుంది. అంతేకాకుండా రెగ్యులర్‌గా పోస్టింగ్‌లు చేయడం వల్ల యూట్యూబ్ రికమండేషన్ సిస్టమ్‌లో మీ వీడియోల విజిబిలిటీ కూడా పెరుగుతుంది.
యూట్యూబ్ లో వీడియో ప్రకటనల ద్వారా డబ్బు సంపాదించాలంటే క్రియేటర్లు ఖచ్చితంగా ‘యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్’ (YPP)కి అర్హత సాధించాలి. దీనికోసం యూట్యూబ్ నిర్ణయించిన కొన్ని నిర్దిష్టమైన నిబంధనలు ఉంటాయి. సబ్స్క్రైబర్ల సంఖ్య, వాచ్ టైమ్ గంటలు లేదా షార్ట్స్ వ్యూస్ పరంగా నిర్దేశించిన పరిమితులను దాటాల్సి ఉంటుంది. వీటితో పాటు ఛానెల్ నిర్వాహకులు.. యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్, మానిటైజేషన్ పాలసీలు, కాపీరైట్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి. అర్హత ప్రమాణాలు పూర్తయిన వెంటనే యూట్యూబ్ స్టూడియో (YouTube Studio) ద్వారా YPP కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
మీ దరఖాస్తును యూట్యూబ్ ఆమోదించిన తర్వాత, అర్హత కలిగిన వీడియోలకు మానిటైజేషన్ ఆన్ చేసుకోవచ్చు. దీనివల్ల మీ వీడియోల ప్రారంభంలో, మధ్యలో లేదా చివరిలో ప్రకటనలు వస్తాయి. ఈ యాడ్స్ ప్లే అయినప్పుడు క్రియేటర్లకు ఆదాయం సమకూరుతుంది. అయితే ఈ రాబడి అనేది ప్రేక్షకుల ప్రాంతం (Audience Location), అడ్వర్టైజర్ల డిమాండ్, కంటెంట్ రకం, వ్యూవర్ ఎంగేజ్ మెంట్ వంటి పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. కేవలం యాడ్స్ మాత్రమే కాకుండా ఛానెల్ మెంబర్‌షిప్‌లు, సూపర్ చాట్స్, సూపర్ థాంక్స్, షాపింగ్, యూట్యూబ్ ప్రీమియం రెవెన్యూ షేరింగ్ వంటి ఇతర మార్గాల ద్వారా కూడా క్రియేటర్లు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.
యూట్యూబ్ అడ్వర్టైజింగ్లో ‘CPM’ (Cost Per Mille) అనేది అత్యంత కీలకమైన కొలమానం. అంటే ప్రతి 1,000 ప్రకటనల ఇంప్రెషన్లకు (Ad Impressions) అడ్వర్టైజర్లు చెల్లించే మొత్తాన్ని సీపీఎమ్ అంటారు. దీనివల్ల క్రియేటర్లకు వచ్చే అసలు ఆదాయంలో వ్యత్యాసాలు ఉంటాయి. వీడియో టాపిక్, ఆడియన్స్ డెమోగ్రాఫిక్స్, వాచ్ టైమ్, ప్రకటనల పోటీ వంటివి సంపాదనను ప్రభావితం చేస్తాయి. అయితే భారత్ లో రంగాలవారీగా CPM రేట్లు భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా ఫైనాన్స్, బిజినెస్, టెక్నాలజీ ఛానెళ్లకు లభించే ప్రకటనల రేట్లు.. సాధారణ వినోద కంటెంట్‌తో పోలిస్తే కాస్త ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి 1,000 వ్యూస్‌కు ఇంత ఆదాయం వస్తుందని ఖచ్చితంగా చెప్పలేం. ఇది ఛానెల్‌ను బట్టి మారే అవకాశం ఉంటుంది.
యూట్యూబ్ ద్వారా మంచి ఆదాయాన్ని పొందాలనుకునే వారు కొన్ని విషయాలపై బాగా ఫోకస్ చేయాలి. వీక్షకులను ఆకట్టుకునేలా స్పష్టమైన టైటిల్స్, థంబ్‌నెయిల్స్, డిస్క్రిప్షన్లను ఉపయోగించాలి. కాపీరైట్, కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఉల్లంఘించకుండా జాగ్రత్త వహించాలి. కామెంట్స్, కమ్యూనిటీ పోస్ట్‌ల ద్వారా వీక్షకులతో నిరంతరం టచ్‌లో ఉండాలి. యూట్యూబ్ అనలిటిక్స్ (YouTube Analytics) ఆధారంగా ఛానెల్ పెర్ఫార్మెన్స్ను విశ్లేషించుకుంటూ కంటెంట్ స్ట్రాటజీని ఎప్పటికప్పుడు మెరుగుపరచుకోవాలి.
యూట్యూబ్‌ను ఒక ఆదాయ మార్గంగా మలుచుకోవడం సాధ్యమే అయినప్పటికీ దానికి సమయం, ఓపిక, నిరంతర శ్రమ ఎంతో అవసరం. కేవలం వ్యూస్ లేదా సంపాదనపైనే ధ్యాస పెట్టకుండా వీక్షకులకు నాణ్యమైన, విలువైన సమాచారాన్ని అందించడానికే ప్రాధాన్యత ఇవ్వాలి. సరైన ప్లానింగ్, రెగ్యులర్ అప్లోడ్స్, యూట్యూబ్ నిబంధనల అవగాహనతో ముందుకు సాగితే.. డిజిటల్ ప్రపంచంలో సుదీర్ఘకాలం నిలదొక్కుకోవడమే కాకుండా మెరుగైన ఆదాయ అవకాశాలను అందుకోవచ్చు.
Also Read: ఫుడ్ లవర్స్‌కు క్రేజీ ఆఫర్.. SBI ఎటర్నల్ కార్డ్ లాంచ్.. ఉచితంగా జొమాటో గోల్డ్ సేవలు!