Battery Saving Tips: ఎక్కువ డబ్బులు పెట్టి కొన్ని స్మార్ట్‌ఫోన్ ఎంత బాగున్నా.. బ్యాటరీ త్వరగా అయిపోతుంటే చిరాకు వస్తుంటుంది. ముఖ్యంగా బయటకు వెళ్లినప్పుడు లేదా అత్యవసరంగా ఫోన్ వాడాల్సిన సమయంలో ఛార్జింగ్ తగ్గిపోతే ఇబ్బందిగా ఉంటుంది. అయితే బ్యాటరీ ఎక్కువసేపు రావడానికి ప్రతిసారీ కొత్త ఫోన్ కొనాల్సిన అవసరం లేదు. కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవడం, యాప్స్ వాడే విధానంలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా బ్యాటరీ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు పాటించాల్సిన ఐదు సులభమైన చిట్కాలు ఇవే.
ముందుగా మీ ఫోన్ బ్యాటరీని ఏ యాప్స్ ఎక్కువగా వాడుతున్నాయో తెలుసుకోండి. ఆండ్రాయిడ్ ఫోన్లలో సెట్టింగ్స్‌లోని బ్యాటరీ విభాగంలోకి వెళ్లి బ్యాటరీ వినియోగాన్ని చూడొచ్చు. ఐఫోన్‌లో సెట్టింగ్స్‌లో బ్యాటరీ ఆప్షన్‌ను ఓపెన్ చేస్తే ఏ యాప్ ఎంత ఛార్జింగ్ వాడిందో తెలుస్తుంది. అవసరం లేకపోయినా ఎక్కువ బ్యాటరీ తీసుకుంటున్న యాప్స్ ఉంటే వాటిని అప్‌డేట్ చేయండి లేదా వాడటం తగ్గించండి. బ్యాటరీ హెల్త్ ఆప్షన్ ఉంటే దాని పరిస్థితిని కూడా చెక్ చేయండి.
కొన్ని యాప్స్ మనం వాడకపోయినా వెనుక నుంచి పనిచేస్తుంటాయి. కొత్త సమాచారం తీసుకోవడం, ఫైల్స్ సింక్ చేయడం వంటి పనుల వల్ల బ్యాటరీ ఖర్చవుతుంది. ఆండ్రాయిడ్‌లో సెట్టింగ్స్‌లో యాప్స్ విభాగానికి వెళ్లి అవసరం లేని యాప్స్ బ్యాక్‌గ్రౌండ్ వినియోగాన్ని పరిమితం చేయొచ్చు. ఐఫోన్‌లో జనరల్ విభాగంలోని బ్యాక్‌గ్రౌండ్ యాప్ రిఫ్రెష్ సెట్టింగ్స్ ద్వారా ఈ మార్పులు చేయవచ్చు. అయితే మెసేజ్‌లు, ఈమెయిల్స్ వెంటనే రావాలంటే వాటికి అవసరమైన అనుమతులను అలాగే ఉంచడం మంచిది.
Also Read: iPhone Duo స్టాక్‌పై యాపిల్ కీలక నిర్ణయం? కొనుగోలుదారులకు నిరాశ తప్పదు!
ఫోన్ స్క్రీన్ కూడా బ్యాటరీ త్వరగా తగ్గడానికి ఒక కారణం. బ్రైట్‌నెస్‌ను ఎప్పుడూ ఎక్కువగా ఉంచకుండా, కళ్లకు సౌకర్యంగా ఉండే స్థాయిలో సెట్ చేసుకోవాలి. ఆటో బ్రైట్‌నెస్ ఆప్షన్ ఆన్ చేసుకుంటే వెలుతురుకు తగ్గట్టుగా స్క్రీన్ మారుతుంది. మీ ఫోన్‌లో డార్క్ మోడ్ ఉంటే దాన్ని కూడా ఉపయోగించండి. ముఖ్యంగా ఓఎల్ఈడీ స్క్రీన్ ఉన్న ఫోన్లలో ఇది కొంత బ్యాటరీని ఆదా చేయడంలో ఉపయోగపడుతుంది.
బ్లూటూత్, లొకేషన్ వంటి ఫీచర్లు అవసరమైనప్పుడు మాత్రమే వాడండి. వాటిని ఆపకుండా ఉంచడం వల్ల పరిస్థితిని బట్టి బ్యాటరీ ఖర్చు పెరగొచ్చు. క్విక్ సెట్టింగ్స్ లేదా కంట్రోల్ సెంటర్ నుంచి వీటిని సులభంగా మార్చుకోవచ్చు. అయితే వైఫై, మొబైల్ డేటా అన్నింటినీ ఎప్పుడూ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. మీ అవసరాన్ని బట్టి సెట్టింగ్స్ మార్చుకుంటే సరిపోతుంది.
ఫోన్ బ్యాటరీ ఎక్కువకాలం బాగుండాలంటే ఛార్జింగ్ విషయంలోనూ జాగ్రత్త అవసరం. ఛార్జింగ్ పూర్తిగా అయిపోయేవరకు వేచి చూడకుండా వీలైనప్పుడు ముందుగానే ఛార్జ్ పెట్టండి. సాధ్యమైనంతవరకు 20 నుంచి 80 శాతం మధ్య ఛార్జింగ్ ఉంచుకోవచ్చు. అయితే అవసరమైనప్పుడు 100 శాతం ఛార్జ్ చేసుకోవడంలో తప్పులేదు. ఫోన్ వేడెక్కకుండా చూసుకోండి. అడాప్టివ్ ఛార్జింగ్ లేదా ఛార్జింగ్ లిమిట్ ఆప్షన్లు ఉంటే ఉపయోగించండి.
Also Read: రే-బాన్ మెటా గ్లాసెస్‌లో ఊహించని అప్డేట్.. ఇప్పుడిక దారి వెతకడం, మ్యూజిక్ వినడం సూపర్ ఈజీ!