Geyser Power Saving Tips: దేశంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతుండటంతో దాదాపు ప్రతి ఇంట్లోనూ గీజర్లు తిరిగి వాడకంలోకి వస్తున్నాయి. అయితే గీజర్ల వాడకం వల్ల కరెంటు బిల్లు భారీగా వస్తుందని చాలా మంది భయపడుతుంటారు. ఇళ్లలో ఏసీల తర్వాత అత్యధికంగా విద్యుత్ ఖర్చు చేసే సాధనాల్లో గీజర్ కూడా ఒకటని నిపుణులు సైతం పేర్కొంటు ఉంటారు. అయితే కొన్ని చిన్న చిన్న మార్పుల ద్వారా గీజర్ విద్యుత్ వినియోగాన్ని ఏవిధంగా తగ్గించుకోవచ్చో ఈ కథనంలో చూద్దాం.
చాలా గీజర్లలో థర్మోస్టాట్ ఉష్ణోగ్రత డిఫాల్ట్‌గా 60 నుండి 75 డిగ్రీల సెల్సియస్ వద్ద ఫిక్స్ చేసి ఉంటుంది. అయితే స్నానానికి అంతటి వేడి నీరు అవసరం లేదు. ఈ ఉష్ణోగ్రతను 45 నుండి 50 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గించుకోవడం మంచిది. దీనివల్ల గీజర్ త్వరగా హీట్ అయి ఆటోమేటిక్ కట్-ఆఫ్ అవుతుంది. అంతేకాకుండా నీరు మళ్లీ మళ్లీ వేడెక్కే అవసరం ఉండదు.
చాలామంది గీజర్‌ను రోజంతా ఆన్‌లోనే ఉంచుతారు. దీనివల్లా ట్యాంక్‌లోని నీరు చల్లబడినప్పుడల్లా గీజర్ దాన్ని మళ్లీ వేడి చేయడానికి ఎక్కువ విద్యుత్‌ను తీసుకుంటుంది. కాబట్టి స్నానానికి 15 నుంచి 20 నిమిషాల ముందు మాత్రమే గీజర్ ఆన్ చేసి, నీరు వేడెక్కగానే ఆపేయడం బెటర్. ఈ పనిని సులభతరం చేసుకోవడానికి 16A స్మార్ట్ ప్లగ్ లేదా టైమర్‌ను సెట్ చేసుకోవచ్చు.
పాత గీజర్‌ను తీసివేసి కొత్తది కొనాలని భావిస్తే.. 5-స్టార్ రేటింగ్ ఉన్న మోడల్‌నే తీసుకోండి. అలాగే కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి లీటర్ల సామర్థ్యాన్ని ఫిక్స్ చేసుకోండి. ఒకరిద్దరు ఉండే ఇళ్లకు 15 లీటర్లు, నలుగురు ఉన్న కుటుంబానికి 25 లీటర్ల గీజర్ సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
దేశంలోని చాలా నగరాల్లో హార్డ్ వాటర్ సమస్య ఎక్కువగా ఉంది. దీనివల్ల గీజర్‌లోని హీటింగ్ ఎలిమెంట్‌పై ఉప్పు పారలు పేరుకుపోయి నీరు వేడెక్కడానికి ఎక్కువ సమయం పట్టే ఛాన్స్ ఉంది. అందుకే ఏడాదికి ఒకసారైనా ట్యాంక్‌ను క్లీన్ (డీస్కేలింగ్) చేయించాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వేడి నీటి కుళాయి లీక్ కాకుండా జాగ్రత్త వహించాలని స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే లీక్ అయ్యే ప్రతి నీటి బొట్టు స్థానంలోకి కొత్త చల్లటి నీరు వచ్చి ట్యాంక్‌లో చేరి మళ్లీ వేడెక్కే ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలియజేస్తున్నారు.