ప్రపంచంలో మనిషి సమయాన్ని అత్యంత ఎక్కువగా వృథా చేస్తున్న పరికరం సెల్ ఫోన్. మనకి అత్యంత ఎక్కువ ఉపయోగపడుతున్నది కూడా అదే. అదే సమయంలో సెల్ ఫోన్ కే మనం పూర్తి సమయం కేటాయించడం వల్ల దానికి బానిసగా మారిపోతున్నాం. సెల్ ఫోన్ అనడం కంటే.. సోషల్ మీడియాకి అని సూటిగా చెప్పుకోవచ్చు. సెల్ ఫోన్ ఆన్ చేసిన వెంటనే వాట్సప్ చాట్ చూస్తాం, ఆ తర్వాత ఫేస్ బుక్ పోస్టింగ్ లు చూస్తాం, తర్వాత ఇన్ స్టా, ట్విట్టర్, స్నాప్ చాట్.. ఇలా సోషల్ మీడియా చుట్టూనే చక్కర్లు కొడుతుంటాం. స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకున్న ప్రతి ఒక్కరూ దాన్ని వినియోగించే సమయంలో దాదాపు 90శాతం సోషల్ మీడియాని చూడ్డానికే సరిపెడుతుంటారు. అయితే ఈ టైమ్ వేస్టింగ్ లో, సెకండ్ ప్లేస్ ఆన్ లైన్ గేమ్ లు దక్కించుకున్నాయి. అవును, సోషల్ మీడియా తర్వాత ఎక్కువమంది ఆన్ లైన్ గేమ్స్ కే అధిక సమయం కేటాయిస్తున్నారు.
సైబర్ మీడియా రీసెర్చ్ (CMR) తాజా సర్వే ప్రకారం, 32 శాతం కంటే ఎక్కువ మంది భారతీయులు.. వారానికి 4 నుంచి 6 గంటల సేపు మొబైల్ గేమ్స్ తో గడిపేస్తున్నారు. ఈ గేమ్ ని మొదలు పెడితే ఓ పట్టాన ఆపేయాలని అనిపించదు. ప్రతి రౌండ్ లోనూ విజయం మనల్ని వరిస్తుంటే.. మరో రౌండ్ కి వెళ్లాలని అనిపిస్తుంది. టైమ్ ఎంత అనేది పట్టించుకోకుండా విజయం కోసం మనం మొబైల్ లో పరిగెడుతూనే ఉంటాం.
జనరేషన్ Z
ముఖ్యంగా ఆన్ లైన్ గేమ్స్ కి, మొబైల్ గేమ్స్ కి జనరేషన్ Z ఎక్కువగా బానిసగా మారుతున్నట్టు తెలుస్తోంది. వీరంతా వారంలో 6 గంటలు కనీసం గేమ్స్ ఆడుతున్నారు. భారత్ లో జనరేషన్ Zలో 74శాతం మంది వారం రోజుల్లో 6 గంటలకంటే ఎక్కువగా మొబైల్ గేమ్స్ తో కాలక్షేపం చేస్తున్నారు. అంతే కాదు, ఆ తర్వాత వారు సోషల్ మీడియాతో కూడా బాగానే టైమ్ వేస్ట్ చేస్తుంటారు.
సీరియస్ గేమర్స్..
మొబైల్ గేమ్స్ ఆడేవాళ్లని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి సీరియస్ గేమర్స్. అంటే వీళ్లు ఫ్రీఫైర్, బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) గేమ్స్ ని ఎక్కువగా ఆడుతుంటారు. జట్లుగా కలసి ఈ గేమ్స్ ఆడుతుంటారు. నలుగురు వ్యక్తులు నాలుగు చోట్ల చేరి ఆన్ లైన్ లో కనెక్ట్ అవుతూ ఈ గేమ్స్ ఆడతారు. వీటికి యువత బాగా అడిక్ట్ అయిపోతోందని సర్వేలు చెబుతున్నాయి. ఈ గేమ్స్ ఆడేవారిని సీరియస్ గేమర్స్ అంటారు.
ఇక చిన్న చిన్న గేమ్స్ కూడా ఆడేవాళ్లు ఉంటారు. వీరంతా సీరియస్ గా గేమ్ గెలవాలని ఆడరు, కాకపోతే టైమ్ పాస్ గా పూర్తిగా టైమ్ వేస్ట్ చేస్తుంటారు. టైమ్ పాస్ గేమ్స్ ఆడేవారు కూడా వారంలో ఆరు గంటల కంటే ఎక్కువ సమయం వాటికి కేటాయిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, గౌహతి, చెన్నై, హైదరాబాద్, జైపూర్, అహ్మదాబాద్, ఇండోర్, గ్వాలియర్ సహా భారత్ లోని పలు ఇతర ప్రాంతాల్లో నివశిస్తున్న 1550 మందిపై సర్వే చేసింది సైబర్ మీడియా రీసెర్చ్ సంస్థ. ఈ సర్వేలో మన వాళ్ల గేమింగ్ టాలెంట్ బయటపడింది.