Kadapa TDP Internal Issue: కడప జిల్లాలో తెలుగు తమ్ముళ్ళ మధ్య విభేదాలు ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయట. నేతల మద్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో వాటిని సెట్‌రైట్ చేయడానికి పార్టీ పెద్దలు మల్లగుల్లాలు పడాల్సి వస్తోందంట. అధికారంలో ఉంటే ప్రత్యర్థులపై ప్రతాపం చూపాల్సింది పోయి సొంత పార్టీ నేతల మధ్యనే మొదలైన ఆధిపత్య పోరు ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ కడప జిల్లా టీడీపీలో ఏం జరుగుతోంది? అసలు ఆధిపత్యపోరుకు కారణమేంటి?
కడప జిల్లా టీడీపీలో బహిర్గతమైన ఆధిపత్య పోరు
కడప జిల్లా టీడీపీలో అంతర్గత పోరు బహిర్గతమైంది. జిల్లా పార్టీ అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డి, ఆయన సతీమణి, కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవీ రెడ్డిలను సొంత పార్టీ నేతలు టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ముందు నుంచి పార్టీలో ఉన్న నాయకులను పట్టించుకోకుండా.. పక్కపార్టీల నుంచి వచ్చిన నేతలకు అందలం ఎక్కిస్తున్నారని కడప టీడీపీ సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. కూటమి అధికారం లోకి వచ్చాక జిల్లా టీడీపీ అధ్యక్షుడి చుట్టు కొత్త కోటరీ తయారైందనే టాక్ నియోజకవర్గంలోని నాయకుల మధ్య నడుస్తోందట. వలస నేతలకే పార్టీలో పదవులు, పనులు దక్కుతున్నాయని టీడీపీ సీనియర్లు చేస్తున్న ఆరోపణలు చర్చనీయంశంగా మారాయి.
కడప జిల్లాలో ఉనికి కోసం రెండు దశాబ్దాలు పోరాడిన టీడీపీ
కడప జిల్లాలో రెండు దశాబ్దాలుగా ఉనికి కోసం పోరాడిన టిడిపి.. మొన్నటి ఎన్నికల్లో సొంత జిల్లాలో వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు షాకిచ్చి అనూహ్యంగా ఐదు స్థానాలు గెలుచుకుంది. నాలుగు స్థానాల్లో టీడీపీ, ఒక్క స్థానంలో బిజెపి అభ్యర్థి గెలిచారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడి హోదాలో శ్రీనివాసులురెడ్డి సొంత పార్టీ నేతలపైనే సీనియర్లు లేదు తొక్క లేదు, తోలు లేదు అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కుంపటిని రాజేస్తున్నాయంట. బీజేపి, జనసేన లను పక్కన పెడితే సొంత పార్టీ టీడీపీలోనే ఎవరికివారుగా తమదే పై చేయి కావాలని నేతలు ఆరాట పడుతున్నారట. ఇదే అంశం ఇప్పుడు కడప కూటమి నేతల మధ్య ఆధిపత్య పోరును బహిర్గతం చేస్తోందట…జిల్లా టీడీపీలో విభేదాలకు జిల్లా టిడిపి అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డితో పాటు కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి వైఖరే కారణమని జిల్లా టిడిపి నేతలు గుర్రుగా ఉన్నారట. ఎన్నికల ముందు ఏకతాటిపై ఉన్న టిడిపి నేతలు తీరా అధికారంలోకి వచ్చాక ఇలా ఎవరికి వారుగా పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురుదెబ్బ తప్పదనే చర్చ నడుస్తోందట. కడప అసెంబ్లీ సెగ్మెంట్‌లో మొదలైన విబేధాలు ఇప్పుడు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కాక రేపుతున్నాయట..
మాధవీరెడ్డిపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన కృష్ణారెడ్డి
జిల్లా కేంద్రమైన కడప, దానికి పక్కనే ఉన్న కమలాపురం నియోజకవర్గ నేతల మధ్య ఏమాత్రం సఖ్యత లేదంటున్నారు. ప్రతి వ్యవహారంలో ఉప్పు, నిప్పులా ఉంటున్నారట. ఇటీవల కడప టీడీపీకి చెందిన నేత కృష్ణారెడ్డి ఎమ్మెల్యే మాధవీ రెడ్డిపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. బహిరంగంగా మీడియా కెక్కి విమర్శలు చేశారు. ఇది చాలదన్నట్లు ఎమ్మెల్యే మాధవి రెడ్డికి వ్యతిరేకంగా వర్గం తయారు చేసుకున్న కృష్ణారెడ్డి ఏకంగా కమలాపురం టీడీపీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహా రెడ్డిని కలిసి వినతి పత్రం ఇవ్వడం రెండు నియోజక వర్గాల ఎమ్మెల్యేల మధ్య మరింత వైరాన్ని పెంచినట్లయిందట.
ఈ వ్యవహారం వెనుక ఉండి నడిపిస్తోంది ఎవరు?
ఇప్పటికే కొన్ని విషయాల్లో తొలిసారిగా ఎన్నికైన ఈ నేతల మధ్య వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో అసమ్మతి నేతలు అధిష్టానం వద్దకు వెళ్ళకుండా.. మరో నేత దగ్గరకు వెళ్లడం ఏంటన్న చర్చ నడుస్తోందట. ఈ వ్యవహారాన్ని వెనుక నుండి ఎవరు నడుపుతున్నారనేది కడప టీడీపీలోని మాధవీరెడ్డి వర్గం నేతలకు తెలిసినా అవసరమైనప్పుడు తేల్చుకుందామన్న ధోరణిలో ఉన్నారట. కడప అసెంబ్లీ సెగ్మెంట్‌లోనే కాదు మిగిలిన నియోజక వర్గాల్లో కూడా కొందరు ప్రజా ప్రతినిధులు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయట.
ఇక కూటమి ధర్మాన్ని టిడిపి నేతలు పాటించడం లేదని ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారంటూ, బిజెపి జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి ఏకంగా ఎమ్మెల్యే మాధవి రెడ్డిపైన, పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి పైనా మీడియా వేదికగా విమర్శలు చేశారు. తీరు మార్చుకోకపోతే తాము తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతామంటూ పరోక్షంగా హెచ్చరికలు చేశారు. సొంత పార్టీలోనే కాక కూటమి పార్టీ నేతల మధ్య కూడా విభేదాలు బహిర్గతం కావడం రాజకీయంగా దుమారం రేపుతోందట. కడప జిల్లాలో కడప, కమలాపురం నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను పార్టీ అధిష్టానం సీరియస్ గానే చూస్తోందట. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యేను పిలిపించి వార్నింగ్ ఇవ్వాలనుకుందట.. అయితే అసెంబ్లీ వ్యవహారాల పని ఒత్తిడితో కడప నేతల పంచాయితీని తేల్చే సమయం లేకపోవడంతో ఈ వ్యవహారాన్ని వాయిదా వేసినట్టు తెలుస్తోంది. పార్టీ పెద్దలు కూడా కడపలో చోటుచేసుకున్న పరిణామాలపై ఆరా తీశారనే ప్రచారం జరుగుతోంది. శృతిమించితే నేతలను కట్టడం చేసేందుకు అధిష్టానం నేరుగా రంగంలోకిదిగే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరి టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ జిల్లా పరిణామాలపై ఎలా స్పందిస్తారో చూడాలి .
Story By Rami Reddy, Bigtv