Tirumala: తిరుమలలో మీ పిల్లలు తప్పిపోయారా? మీ వస్తువులు పోగొట్టుకున్నారా? మీతో పాటు వచ్చిన వారి ఆచూకీ తెలుసుకోవాలా? అనుమానితులను గమనించారా? ఇతర సమాచారం కావాలా? అయితే డోంట్ వర్రీ.. మీకోసమే తిరుపతి పోలీసులు తిరుమలలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా శ్రీవారి భక్తులకు 24 గంటలు సేవలు అందించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇంతకు ఆ కార్యక్రమం ఏమిటో తెలుసుకుందాం.
తిరుమలకు కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశ, విదేశాల నుండి శ్రీవారి భక్తులు తరలి వస్తుంటారు. ఇప్పటికే భక్తుల సేవలో టీటీడీ తరిస్తుండగా, ప్రస్తుతం తిరుపతి పోలీసులు సైతం వినూత్న కార్యక్రమం ద్వారా భక్తులకు సేవలు అందించనున్నారు. ఈ సేవలు 24 గంటలు అందించేందుకు రుపతి జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు నిర్ణయించారు. తిరుమలలో ఏదైనా సమాచారం కావాలంటే టీటీడీ కౌంటర్స్ వద్దకు కానీ, ఆ అధికారులను, సిబ్బందిని సంప్రదించాలి. ఇప్పుడు పోలీసులు సైతం ఆ భాద్యతను తీసుకున్నారు. దీనితో ఇక శ్రీవారి భక్తులకు పోలీసుల సేవలు మరింత చేరువ కానున్నాయి.
MAY I HELP YOU
దేశ, విదేశాల నుండి శ్రీవారిని దర్శించుకునేందు వస్తున్న భక్తుల కోసం MAY I HELP YOU వినూత్న సేవా కార్యక్రమాన్ని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రారంభించారు. తిరుమలలో శ్రీవారి ఆలయం ముందు మే ఐ హెల్ప్ యు అనే ఒక సరికొత్త సేవను భక్తుల సౌకర్యార్థం తీసుకువచ్చారు. ఈ సిబ్బంది విజిలెన్స్, పోలీసు శాఖల నుంచి ప్రధాన భక్తులు రద్దీ ప్రాంతాలైన లడ్డు కౌంటర్, టెంపుల్ ఎగ్జిట్, అఖిలాండం, రామ్ బగీచా, బస్టాండ్, CRO అన్నదాన సత్రం, లగేజ్ కౌంటర్, వరాహ స్వామి టెంపుల్ లాంటి ప్రదేశాల్లో పోలీసు, విజిలెన్స్ సిబ్బంది MAY I HELP YOU జాకెట్ ధరించి భక్తులకు కనపడే విధంగా తిరుగుతూ ఉంటారు.
Also Read: Second hand phones: ఈ 6 విషయాలు తెలుసుకోకుండా సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనొద్దు..
వీరు భక్తులతో మాట్లాడుతూ భక్తులకు వచ్చే సందేహాలను నివృత్తి చేయడం, విజువల్ పోలీసింగ్, నేర నివారణ తో పాటు భక్తులకు తెలియని విషయాలను తెలపడం, కనపడకుండా వెళ్లిన వారి ఆచూకీ కొరకు సహకారం అందించడం, భక్తులను దర్శనం, రూమ్ పేరుతో మోసం చేసే వారి గురించి అవగాహన కల్పించడం, లాంటి కార్యక్రమాలను చేపడతారు. ఈ సేవ 24X 7 గా అందుబాటులో ఉంటుందని ఎస్పీ తెలిపారు. మరెందుకు ఆలస్యం.. తిరుమలలో ఇక మీకు ఏ సందేహం ఉన్నా, సత్వరం పోలీస్ సాయం కావాలన్నా వెంటనే మే ఐ హెల్ప్ యూ సిబ్బందిని సంప్రదించండి.