Induction Stove: ప్రస్తుతం పశ్చిమాసియా దేశాల యుద్ధ ప్రభావం భారత్‌పై పడుతుంది. దీని కారణంగా గత కొన్ని రోజులుగా దేశం లోని ముఖ్య పట్టణాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు కొరత ఏర్పడింది. దీంతో చాలా పట్టణాల్లో హోటళ్లు మూసేశారు. ప్రస్తుతం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లకు ఏం కొరత లేకపోయినా.. కొంత మంది కృత్రిమ కొరత సృస్టిస్తున్నారు. దీంతో చాలామంది ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడం, లభ్యత తగ్గడంతో చాలామంది ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టౌవ్ (Induction Stove) వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది వంటను వేగవంతం చేయడమే కాకుండా, పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది. అయితే, గ్యాస్ స్టౌవ్‌తో పోలిస్తే దీని పనితీరు భిన్నంగా ఉంటుంది. కాబట్టి, ఇండక్షన్ స్టౌవ్ వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు ఇక్కడ తెలుసుకోండి.
Read also-Prabhas Record: ఓవర్సీస్ వద్ద రెబల్ స్టార్ ప్రభాస్ వన్ మ్యాన్ షో.. ఏంది సామీ ఆ రికార్డులు..
ఇండక్షన్ స్టౌవ్ అయస్కాంత శక్తి ఆధారంగా పనిచేస్తుంది. కాబట్టి అన్ని రకాల పాత్రలు దీనిపై పని చేయవు. పాత్ర అడుగు భాగం పూర్తిగా చదునుగా ఉండాలి. ఇనుము (Cast Iron), స్టెయిన్‌లెస్ స్టీల్ వంటి అయస్కాంత గుణం ఉన్న పాత్రలే వాడాలి. రాగి, అల్యూమినియం, గాజు పాత్రలు దీనిపై పని చేయవు. మీ పాత్ర ఇండక్షన్‌కు పని చేస్తుందో లేదో తెలియాలంటే, ఒక అయస్కాంతాన్ని పాత్ర అడుగున ఉంచండి. అది అంటుకుంటే ఆ పాత్ర ఇండక్షన్ స్టౌవ్‌కు సరిపోతుంది.
ఇండక్షన్ స్టౌవ్ ఎక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంది. కాబట్టి నాణ్యమైన సాకెట్ ప్లగ్ పాయింట్ వాడాలి. లో-క్వాలిటీ ఎక్స్‌టెన్షన్ బాక్స్‌లు వాడటం వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. స్టౌవ్ లోపలికి లేదా కంట్రోల్ ప్యానెల్‌పై నీరు పడకుండా జాగ్రత్త వహించాలి. ఇది ఎలక్ట్రానిక్ పరికరం కాబట్టి తేమ వల్ల పాడయ్యే అవకాశం ఉంది.
స్టౌవ్ ఆన్ చేసి ఖాళీ పాత్రను దానిపై ఉంచకూడదు. ఇది పాత్రను అతి త్వరగా వేడి చేస్తుంది, తద్వారా పాత్ర అడుగు భాగం దెబ్బతినవచ్చు. గ్యాస్ స్టౌవ్‌తో పోలిస్తే ఇండక్షన్ చాలా వేగంగా వేడెక్కుతుంది. కాబట్టి వంట ప్రారంభంలో తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంచి, అవసరాన్ని బట్టి పెంచుకోవాలి. స్టౌవ్ కింద లేదా వెనుక వైపున ఫ్యాన్ ఉంటుంది. అది స్టౌవ్‌ను చల్లబరుస్తుంది. ఆ ఫ్యాన్ తిరిగే దారిలో పేపర్లు లేదా బట్టలు అడ్డుగా లేకుండా చూసుకోవాలి.
స్టౌవ్ పైభాగం గ్లాస్‌తో ఉంటుంది. దానిపై పాత్రలను బలంగా కొట్టడం లేదా గీతలు పడేలా చేయడం చేయకూడదు. వంట పూర్తయిన వెంటనే స్టౌవ్‌ను తుడవకండి. వేడి తగ్గిన తర్వాత మెత్తటి గుడ్డతో శుభ్రం చేయాలి. గరుకుగా ఉండే స్క్రబ్బర్లు వాడకూడదు. అంతే కాకుండా ఇది ఆరోగ్యానికి సంబంధించినది.. పేస్‌మేకర్ (Pacemaker) అమర్చుకున్న వారు ఇండక్షన్ స్టౌవ్‌కు కాస్త దూరంగా ఉండటం మంచిది, ఎందుకంటే ఇందులోని అయస్కాంత క్షేత్రం వాటిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వంట పూర్తయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసినా, లోపల ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. అది ఆగిపోయే వరకు ప్లగ్ తీయకూడదు. ఇండక్షన్ స్టౌవ్ వాడటం వల్ల సమయం, డబ్బు ఆదా అవుతాయి. పైన పేర్కొన్న చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే, ఎటువంటి ప్రమాదాలు లేకుండా సురక్షితంగా వంట చేసుకోవచ్చు.