LPG Delivery: వంట మధ్యలో ఉండగా గ్యాస్ అయిపోతే వచ్చే కోపం, చిరాకు అంతా ఇంతా కాదు. ఒకవేళ కొత్త సిలిండర్ బుక్ చేసినా ప్రస్తుత పరిస్థితుల్లో అది కనీసం 2, 3 రోజుల సమయం తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో సామాన్యులకు ‘ఇన్ స్టామార్ట్’ శుభవార్త చెప్పింది. కేవలం పది నిమిషాల్లోనే సిలిండర్ ను డెలివరీ చేసేందుకు ముందుకు వచ్చింది. ఇందు కోసం ప్రముఖ ప్రభుత్వ రంగ ఇంధన సంస్థ ‘హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)’తో ఒప్పందం చేసుకుంది.
ఈ భాగస్వామ్యంలో భాగంగా హెచ్‌పీసీఎల్ సంస్థ సరికొత్తగా రూపొందించిన 10 కిలోల ‘హెచ్‌పీ నవ్య’ (HP Navya) కాంపోజిట్ ఎల్పీజీ సిలిండర్‌ను ఇన్‌స్టామార్ట్ పరిచయం చేసింది. ప్రస్తుత గృహ అవసరాలకు తగ్గట్లుగా హెచ్‌పీసీఎల్ దీనిని డిజైన్ చేసింది. ఇవి సాధారణంగా వాడే ఇనుప సిలిండర్ల కంటే తేలికగా ఉండి.. సులభంగా మోసుకెళ్లడానికి వీలుగా ఉంటాయి. భద్రత పరంగానూ అత్యాధునిక ఫీచర్లను ఇందులో చేర్చారు. ఈ సిలిండర్ బాడీ పారదర్శకంగా ఉండటం వల్ల లోపల ఎంత గ్యాస్ ఉందో బయటి నుంచి ఈజీగా చూడొచ్చు.
ప్రస్తుతానికి ఈ వినూత్న సేవలను కర్ణాటక రాజధాని బెంగళూరులో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు. బెంగళూరు నగరవాసులు ఇన్‌స్టామార్ట్ యాప్ ద్వారా 10 కిలోల ‘హెచ్‌పీ నవ్య కాంపోజిట్ సిలిండర్’ను గానీ, 5 కిలోల చిన్న మెటల్ ఎల్పీజీ సిలిండర్‌ను గానీ ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు కేవలం పాలు, కూరగాయలు, మందులు, ఎలక్ట్రానిక్స్ వస్తువులకే పరిమితమైన క్విక్ కామర్స్ సేవలు.. ఇప్పుడు వంట గ్యాస్ రంగానికి కూడా విస్తరించడం సామాన్యులకు కలిసిరానుంది.
ఈ స్మాల్ సిలిండర్లను కొనుగోలు చేయడానికి ఎలాంటి ముందస్తు డొమెస్టిక్ ఎల్పీజీ కనెక్షన్ ఉండాల్సిన అవసరం లేదని ఇన్ స్టామార్ట్ వర్గాలు తెలిపాయి. ఫలితంగా గ్యాస్ కనెక్షన్ లేనివారికి ఇది పెద్ద ఊరటను కలిగించనుంది. ప్రధానంగా ఉద్యోగాల రీత్యా వేరే ఊర్లల్లో అద్దెకు ఉండే యువతీ యువకులు, విద్యార్థులు, చిన్న కుటుంబాలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.
Also Read: మోటో లవర్స్‌కు పండగే.. బడ్జెట్ To లగ్జరీ.. 2026 బెస్ట్ మోటోరోలా ఫోన్లు!
ఈ సిలిండర్ ను బుక్ చేసేందుకు పెద్దగా ప్రాసెస్ ఏమీ అక్కర్లేదని ఇన్‌స్టామార్ట్ వర్గాలు చెబుతున్నాయి. యాప్ ఓపెన్ చేసి కావాల్సిన సిలిండర్‌ను కార్ట్‌కు యాడ్ చేసి ఆర్డర్ పెట్టుకుంటే సరిపోతుందని స్పష్టం చేసాయి. అయితే తొలిసారి సిలిండర్ కొనుగోలు చేసేటప్పుడు సాధారణ ఐడీ వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది. ఆ తర్వాత రీఫిల్ కోసం పాత ఖాళీ సిలిండర్‌ను డెలివరీ బాయ్‌కు అందిస్తే సరిపోతుంది. హెచ్‌పీసీఎల్ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా అన్ని రకాల భద్రతా ప్రమాణాలను పాటిస్తూ.. శిక్షణ పొందిన సిబ్బందితో ఈ డెలివరీలను నిర్వహించనున్నారు.
Also Read: కుక్క తోక వంకరంటారు.. అసలు తోకే లేకపోతే? ప్రపంచంలోనే ఈ వింతైన డాగ్స్ గురించి తెలుసా?