iPhone 17 Series: చాలామంది యువతకి ఐఫోన్ 17 అనేది ఒక డ్రీమ్ ఫోన్. అయితే ఈ ఫోన్ సొంతం చేసుకోవడం ఇకపై అంత తేలికయ్యేలా లేదు. భారత మార్కెట్లో ఐఫోన్ 17 సిరీస్ ధరలు ఊహించని రీతిలో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మార్కెట్‌లో కొన్ని చోట్ల ఈ ఫోన్ల లభ్యత తగ్గడం, మరోవైపు ధరల పెంపు వార్తలు రావడం కొనుగోలుదారులను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. విడిభాగాల ఖర్చులు పెరగడమే దీనికి కారణమని అంటున్నా.. ఐఫోన్ ప్రియులకు మాత్రం ఇది పెద్ద జలక్ అనే చెప్పాలి. మరి ఈ కొత్త రేట్లు ఎప్పటి నుంచి అమల్లోకి రానున్నాయి? ఆ రేట్ల లిస్ట్ ఏంటో.. ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. యాపిల్ కంపెనీ త్వరలోనే కొత్త ధరలను అమల్లోకి తీసుకురానుంది. బేసిక్ మోడల్ ఐఫోన్ 17 ధర ప్రస్తుతం ఉన్న రూ.82,990 నుంచి దాదాపు రూ.94,990కి చేరవచ్చు. ఇక ఐఫోన్ 17 ప్రో ధర రూ.1,34,900 నుంచి రూ.1,46,990 వరకు, టాప్ ఎండ్ మోడల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ ధర రూ.1,49,900 నుంచి ఏకంగా రూ.1,62,000 వరకు పెరిగే అవకాశం ఉంది. అంటే ప్రతి మోడల్‌పై దాదాపు రూ.12,000 వరకు భారం పడేలా కనిపిస్తోంది.
ఒకవైపు ధరల పెంపు వార్తలు భయపెడుతుంటే.. మరోవైపు మార్కెట్‌లో ఈ ఫోన్లకు విపరీతమైన స్టాక్ కొరత ఏర్పడింది. సరఫరాలో తలెత్తిన సమస్యల వల్ల స్టోర్లలో ఫోన్లు త్వరగా దొరకడం లేదు. అయితే వచ్చే వారంలో కొత్త స్టాక్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ధరలు ఎక్కడ పెరుగుతాయోనన్న భయంతో చాలామంది కస్టమర్లు ముందే ఫోన్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.
స్మార్ట్‌ఫోన్ విడిభాగాల తయారీ ఖర్చులు పెరగడం, గ్లోబల్ సప్లై చెయిన్ సమస్యలే ఈ ధరల పెంపునకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల యాపిల్ తమ మ్యాక్‌బుక్, ఐప్యాడ్ మోడళ్ల ధరలను కూడా పెంచడం ఈ వార్తలకు మరింత బలాన్నిస్తోంది. అయితే.. ఈ ధరల పెంపుపై యాపిల్ సంస్థ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి.. ఐఫోన్ 17 సిరీస్ తీసుకోవాలనుకునేవారు కంపెనీ ప్రకటన వచ్చే వరకు వేచి చూడటం మంచిది.
Also Read: ఇంట్లో తేమగా ఉందని హ్యూమిడిఫైయర్ వాడుతున్నారా? నిపుణులు ఎందుకు వద్దంటున్నారో తెలిస్తే..