iPhone 18 Pro Max Leaks: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ నుంచి త్వరలో రాబోయే ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన లీక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ ఫోన్ కెమెరా విభాగంలో కంపెనీ ఒక విప్లవాత్మక మార్పు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఏ ఐఫోన్‌లోనూ లేని విధంగా, మొదటిసారిగా దీనిలో వేరియబుల్ అపెర్చర్ కలిగిన సరికొత్త సోనీ Sony IMX905 సెన్సార్‌ను వాడనున్నట్లు సమాచారం. దీంతో తక్కువ వెలుతురులోనూ అద్భుతమైన ఫొటోలు, పోర్ట్రెయిట్ షాట్స్ తీసుకోవచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ కొత్త సిరీస్ ఫోన్ల కోసం ఎదురుచూసే వారికి ధరల విషయంలో కొంచెం షాక్ తగిలేలా ఉంది. భారతదేశంలో ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధర, పాత మోడల్స్ కంటే దాదాపు రూ.15,000 నుండి రూ.25,000 వరకు ఎక్కువగా ఉండే అవకాశం ఉందట. విడిభాగాల కొరత, ర్యామ్ ధరలు పెరగడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ ఫోన్లను సెప్టెంబర్ 9న విడుదల చేసే అవకాశం ఉంది. అయితే.. ఈసారి యాపిల్ తమ విడుదల వ్యూహాన్ని మార్చబోతోంది. ప్రీమియం మోడల్స్‌ను శరదృతువులో లాంచ్ చేసి, సాధారణ ఐఫోన్ 18 మోడల్స్‌ను 2027 ప్రారంభంలో తీసుకురావాలని యోచిస్తోంది.
Also Read: గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!
ప్రస్తుతం చాలా మందిలో మెదులుతున్న ప్రశ్న ఏమిటంటే.. ఐఫోన్ 17 ప్రో సిరీస్ కొనేయాలా లేక 18 ప్రో మ్యాక్స్ కోసం ఆగాలా అని. ఇప్పుడే అప్‌గ్రేడ్ అవ్వడం వల్ల ఆఫర్ల రూపంలో డబ్బు ఆదా చేసుకోవచ్చు. అలాగే స్టాక్ కొరత వంటి సమస్యలు ఉండవు. ఒకవేళ కెమెరా పరంగా సరికొత్త టెక్నాలజీ కావాలనుకుంటే మాత్రం ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ కోసం ఆగడం మంచిది. అయితే దీనికోసం మరింత ఎక్కువ బడ్జెట్ కేటాయించాల్సి ఉంటుంది.
ఐఫోన్ 18 ప్రో సిరీస్‌తో పాటు యాపిల్ తమ మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్‌ను కూడా అదే సమయంలో పరిచయం చేయవచ్చని టెక్ నిపుణుల అంచనా. ఇది బుక్-స్టైల్ డిజైన్‌తో, పెద్ద స్క్రీన్‌తో రానుంది. తయారీలో ఉండే సంక్లిష్టత వల్ల ప్రారంభంలో దీని స్టాక్ చాలా పరిమితంగా ఉండే అవకాశం ఉంది. సరికొత్త కెమెరా ఫీచర్లు, ఫోల్డబుల్ స్క్రీన్ టెక్నాలజీతో రాబోతున్న ఈ ఫోన్లు మార్కెట్లో ఎలాంటి సంచలనం సృష్టిస్తాయో వేచి చూడాల్సిందే.
Also Read: వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!