iPhone 18 Pro vs iPhone 17 Pro: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ప్రతిఏటా కొత్త ఐఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చినప్పుడు మనందరిలోనూ ఒకటే గందరగోళం మొదలవుతుంది. పాత మోడల్ కొంటే డబ్బులు ఆదా అవుతాయా? లేక కాస్త ఎక్కువైనా సరే లేటెస్ట్ ఫీచర్లు ఉన్న కొత్త వెర్షన్‌కే వెళ్లాలా? అని ఆలోచిస్తాం. ఈనెల 9న జరగబోయే యాపిల్ ఈవెంట్‌కు ముందు iPhone 17 Pro, త్వరలో రాబోతున్న iPhone 18 Proల విషయంలోనూ ప్రతి ఒక్కరిలోనూ ఇదే సందేహం ఏర్పడింది.
iPhone 18 Proలో రాబోతున్న A20 ప్రో చిప్ ఒక పెద్ద మార్పు కానుంది. ఇది 2-నానోమీటర్ ప్రాసెస్‌పై తయారవుతుండటం వల్ల ఫోన్ చాలా స్పీడ్‌గా పనిచేస్తుంది. గేమ్స్ ఆడేవారికి, వీడియోగ్రాఫర్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. iPhone 17 Proలోని A19 ప్రో చిప్ కూడా చాలా శక్తివంతమైనదే అయినప్పటికీ.. భవిష్యత్తులో వచ్చే కొత్త యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను తట్టుకోవడానికి 18 Proలోని 12GB ర్యామ్, కొత్త ప్రాసెసర్ చాలా కాలం పాటు ఫోన్ హ్యాంగ్ కాకుండా కాపాడుతాయి.
రెండు ఫోన్లలోనూ వెనుక వైపు మూడు 48MP కెమెరాలే ఉన్నప్పటికీ.. iPhone 18 Proలో రాబోయే వేరియబుల్ అపెర్చర్ టెక్నాలజీ పెద్ద తేడాను చూపుతుంది. దీంతో లైటింగ్‌కు తగ్గట్టుగా కెమెరా లెన్స్ మారి, చీకటిలో కూడా అద్భుతమైన ఫొటోలు తీయవచ్చు. ఇక ముందు భాగంలో ఉండే డైనమిక్ ఐలాండ్ సైజ్ కూడా ఈసారి కాస్త చిన్నదిగా మారే అవకాశం ఉంది.
Also Read: పాత లాప్‌టాప్ ఉందా? రిలయన్స్ జియో తెచ్చిన అప్డేట్‌తో సూపర్ స్పీడ్ PCగా మార్చేయండి!
రోజంతా అదే పనిగా ఫోన్ వాడేవారికి iPhone 18 Pro మంచి రిలీఫ్ ఇస్తుంది. దీనిలో పెద్ద బ్యాటరీతో పాటు యాపిల్ సొంతంగా తయారుచేసిన C2 మోడెమ్‌ను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల సిగ్నల్స్ సరిగా లేనిచోట కూడా కాల్స్ స్పష్టంగా మాట్లాడవచ్చు, ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుంది. iPhone 17 Proలో కూడా బ్యాటరీ లైఫ్ బాగున్నప్పటికీ, నెట్‌వర్క్ ఎఫిషియెన్సీ విషయంలో కొత్త మోడల్ ఒకడుగు ముందే ఉంటుంది.
ఇక ధర విషయానికొస్తే.. కొత్త ఐఫోన్ 18 ప్రో విడుదలయ్యాక దాని రేటు కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. అదే సమయంలో ఐఫోన్ 17 ప్రో ధర గణనీయంగా తగ్గుతుంది. బడ్జెట్ చూసుకుని, ఫ్లాగ్‌షిప్ అనుభవం కావాలనుకునే వారికి తగ్గ ధరలో దొరికే ఐఫోన్ 17 ప్రో బెస్ట్ ఆప్షన్ అవుతుంది. పైగా ఇప్పటికే 17 ప్రో వాడుతున్నవారు వెంటనే 18 ప్రోకి మారాల్సిన అత్యవసరమైతే ఏమీ లేదు.
ప్రస్తుతానికైతే కొత్త ఫోన్ కొనాలనుకునేవారు సెప్టెంబర్ 9 వరకు ఆగడమే మంచిది. ఈవెంట్ పూర్తయ్యాక రెండు ఫోన్ల అసలు ధరలు, ఫీచర్లు స్పష్టంగా తెలుస్తాయి. అత్యుత్తమ పనితీరు, కెమెరా అప్‌డేట్స్ కావాలంటే ఐఫోన్ 18 ప్రోను పరిశీలించవచ్చు. లేదు, తక్కువ ధరకు మంచి ప్రో మోడల్ ఐఫోన్ కావాలనుకుంటే ధర తగ్గక ఐఫోన్ 17 ప్రోను సొంతం చేసుకోవడం తెలివైన నిర్ణయం అవుతుంది.
Also Read: మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!