Solar Stove: పశ్చిమాసియాలో యుద్దం కారణంగా ప్రపంచవ్యాప్తంగానే కాదు, మన దేశంలో కూడా గ్యాస్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో రెస్టారెంట్లు, హోటళ్లు, కొంత వరకు హాస్టళ్లు కూడా మూతపడిన విషయం తెలిసిందే. మరోవైపు కట్టెల పొయ్యి వల్ల వచ్చే పొగ ప్రజల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని దెబ్బతీస్తోంది. ఇలాంటి తరుణంలో కేరళకు చెందిన కొందరు విద్యార్థులు సూర్యరశ్మితో నడిచే ‘సోలార్ ఇండక్షన్ స్టవ్’ను ఆవిష్కరించారు.
కొల్లాంలోని టీకేఎం ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన గోకుల్, గౌతమ్, కృష్ణ, అమృత అనే నలుగురు విద్యార్థులు తమ ఫైనల్ ఇయర్ ప్రాజెక్టులో భాగంగా ఈ సోలార్ ఇండక్షన్ స్టవ్‌ను రూపొందించారు. ముఖ్యంగా కేరళలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. అక్కడి ప్రజలు వంట కోసం అడవిలోని కట్టెలపైనే ఆధారపడుతున్నారు. దీనివల్ల అడవులు అంతరించిపోవడమే కాకుండా, ఆ పొగ పీల్చడం వల్ల వారు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అలాంటి సామాజిక, ఆర్థిక వెనుకబాటు ఉన్న ప్రజలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ విద్యార్థులు తక్కువ ఖర్చుతో కూడిన సోలార్ ఇండక్షన్ స్టవ్‌ను తయారు చేశారు.
Also Read: అబ్బా.. ఏం ఫీచర్లండి బాబూ.. కుక్కర్ విజిల్స్ కూడా లెక్కపెట్టే అద్భుతమైన స్టవ్ ఇది!
సాధారణంగా మనం వాడే ఇండక్షన్ స్టవ్‌లు కరెంట్‌తో పనిచేస్తాయి. కానీ ఇది పూర్తిగా సోలార్ ఎనర్జీతో నడుస్తుంది. దీనికోసం సోలార్ ప్యానెల్స్ ఎండను గ్రహించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ఒకవేళ సూర్యరశ్మి సమయంలో లేదా రాత్రిపూట వంట చేసుకోవాలంటే ఎలా అనే సందేహం మీకు రావచ్చు. దానికి పరిష్కారంగా దీనిలో బ్యాటరీలను అమర్చారు. పగటిపూట ఎండ ఉన్నప్పుడు సోలార్ ప్యానెల్ వంటకు కావాల్సిన శక్తిని అందించడమే కాకుండా, బ్యాటరీలను కూడా ఛార్జ్ చేస్తుంది. ఈ బ్యాటరీల సహాయంతో రాత్రి వేళల్లో సుమారు 4 పాటు నిరంతరాయంగా వంట చేసుకోవచ్చు. ఈ స్టవ్‌లో వాడిన ఛార్జ్ కంట్రోలర్ విద్యుత్ ప్రవాహాన్ని క్రమబద్ధీకరిస్తూ బ్యాటరీ పాడవకుండా రక్షిస్తుంది.
నార్మల్ ఇండక్షన్ స్టవ్‌ల మీద కొన్ని రకాల పాత్రలు మాత్రమే పెట్టే వీలుంది. కానీ కేరళ విద్యార్థులు తయారు చేసిన స్టవ్ మీద ఇనుము, స్టీలు పాత్రలతో పాటు నాన్‌ఫెర్రో మాగ్నెటిక్ పాత్రలను కూడా వాడుకోవచ్చు. ఇలాంటి టెక్నాలజీ మార్కెట్‌లో చాలా ఖరీదైనది. కానీ వీరు దానిని సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేలా డిజైన్ చేశారు. గ్యాస్ స్టవ్‌లతో పోలిస్తే దీనిలో నుంచి వచ్చే మంట నేరుగా పాత్రకు తగులుతుంది. దీంతో త్వరగా వంట పూర్తవ్వడమే కాకుండా సేఫ్‌గా కూడా ఉంటుంది.
కేరళ స్టార్టప్ మిషన్ నిర్వహించిన పోటీల్లో ఈ ప్రాజెక్ట్ ఎంపికైంది. ప్రస్తుతం దీనిని ఒక బిజినెస్‌గా మార్చేందుకు ఈ యువ శాస్త్రవేత్తలు శిక్షణ పొందుతున్నారు. ప్రభుత్వం కూడా ఇలాంటి వాటిపై రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తే, గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపవచ్చని చెబుతున్నారు నిపుణులు.
Also Read: ఇండక్షనా లేక ఇన్‌ఫ్రారెడ్ స్టవా? ఈ ఒక్క తేడా తెలుసుకుంటే డబ్బు వృధా కాదు!