Bike Taxi: మహారాష్ట్రలో అక్రమంగా నడుస్తున్న బైక్ టాక్సీలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా బైక్ టాక్సీ సేవలను అందిస్తున్న ప్రముఖ రైడ్-హేలింగ్ సంస్థలైన ఓలా (Ola), ఉబర్ (Uber), ర్యాపిడో (Rapido) యాప్‌లను తమ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి తక్షణమే తొలగించాలని గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లను మహారాష్ట్ర సైబర్ డిపార్ట్‌మెంట్ ఆదేశించింది. ఈ మేరకు ఐటీ చట్టం-2000లోని సెక్షన్ 79(3)(బి) కింద రెండు టెక్ దిగ్గజాలకు అధికారిక నోటీసులు జారీ చేసింది.
ఇటీవల ముంబైలోని బాంద్రా ప్రాంతంలో బైక్ టాక్సీ ప్రమాదంలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ ఈ కఠిన చర్యలు చేపట్టింది. అనుమతులు లేని ఈ బైక్ టాక్సీల వల్ల ప్రయాణికుల రక్షణ గాల్లో దీపంగా మారిందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. డ్రైవర్ల బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ లేకపోవడం, సరైన ఇన్సూరెన్స్ సౌకర్యం లేకపోవడం, అత్యవసర సమయాల్లో స్పందించే వ్యవస్థలు కరువవ్వడం వంటి అంశాలను గూగుల్, యాపిల్ కు పంపిన నోటీసుల్లో ప్రధానంగా ప్రస్తావించారు.
మహారాష్ట్ర బైక్-టాక్సీ నిబంధనల ప్రకారం.. రాష్ట్రంలో కేవలం పర్యావరణహిత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను మాత్రమే కమర్షియల్ బైక్ టాక్సీలుగా నడపడానికి వీలుంటుంది. అయితే ఓలా, ఉబర్, ర్యాపిడో సంస్థలు ఈ ఈవీ పాలసీని పూర్తిగా బేఖాతరు చేస్తూ వేల సంఖ్యలో పెట్రోల్ బైక్‌లను రోడ్లపైకి తెచ్చాయని రవాణా శాఖ స్పష్టం చేసింది. ఆర్టీఓ అధికారులు విధించే జరిమానాలను కంపెనీలే తిరిగి చెల్లిస్తూ డ్రైవర్లను ప్రోత్సహిస్తున్నాయని.. ఇది చట్టాన్ని అపహాస్యం చేయడమేనని మంత్రి మండిపడ్డారు. రోడ్లపై అక్రమ వాహనాలను ఆపడం కంటే.. వాటికి మూలమైన యాప్‌లను డిజిటల్ స్టోర్ల నుండి తొలగించడమే సరైన మార్గమని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
యాప్‌లను పూర్తిగా తొలగించాలని.. గూగుల్, యాపిల్ లకు నోటీసులు ఇచ్చినప్పటికీ దీనివల్ల సాధారణ క్యాబ్ (కార్లు), ఆటో బుకింగ్స్ చేసుకునే లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బంది పడే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. యాప్ స్టోర్ల నుండి యాప్‌లను పూర్తిగా తొలగిస్తే మిగతా సేవలు కూడా నిలిచిపోతాయి కాబట్టి.. కేవలం ‘బైక్ టాక్సీ’ ఆప్షన్‌ను మాత్రమే ఆ యాప్‌లలో నిలిపివేసేలా సరికొత్త సాంకేతిక లేదా చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తున్నట్లు సైబర్ విభాగానికి చెందిన ఒక సీనియర్ అధికారి తెలిపారు.
Also Read: తొందరపాటులో ఈ పనులు చేయకండి.. ఒక్క తప్పుడు నిర్ణయం మీ జీవితాన్ని నాశనం చేస్తుంది
గూగుల్, యాపిల్ కు మహారాష్ట్ర సైబర్ విభాగం లేక రాయడంతో సోషల్ మీడియాలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఓలా, ఉబర్ సేవలు మహారాష్ట్రలో పూర్తిగా బంద్ అయ్యాయనే ప్రచారం నెట్టింట విస్తృతంగా జరుగుతోంది. అయితే రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ (DGIPR) ఈ వార్తలను ఖండించింది. సంస్థల పూర్తి సేవలపై ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేసింది. కేవలం చట్టవిరుద్ధంగా సాగుతున్న ‘బైక్ టాక్సీ’ల పైన మాత్రమే రవాణా శాఖ, సైబర్ క్రైమ్ విభాగం ఉక్కుపాదం మోపుతోందని స్పష్టత ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాలను పాటించని పక్షంలో గూగుల్, యాపిల్ సంస్థలు కూడా చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నోటీసుల్లో మహారాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది.
महाराष्ट्रात ओला, उबर आणि रॅपिडोच्या सर्व सेवा पूर्णपणे बंद करण्यात आल्याचा सोशल मीडियावरील दावा दिशाभूल करणारा आहे. #FactCheck #DGIPRFactCheck
राज्यात बेकायदेशीरपणे सुरू असलेल्या अनधिकृत बाईक टॅक्सी सेवांविरोधात परिवहन विभागाने कठोर भूमिका घेतली आहे. #ओला, #उबर आणि #रॅपिडो… pic.twitter.com/69jjCPbNbc
— MAHARASHTRA DGIPR (@MahaDGIPR) May 15, 2026
Also Read: Kirrak Seetha : స్టైలిష్ లుక్ లో కిర్రాక్ సీత.. హెయిర్ స్టైల్ అదిరిపోయింది..