Seven Colors Hill Argentina: అర్జెంటీనాలోని జుజుయ్ ప్రావిన్స్ లో ఉన్న చిన్న గ్రామం పుర్మామార్కా ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం అక్కడ కనిపించే సెర్రో డి లాస్ సియెటె కొలోరెస్. అదే ఏడు రంగుల కొండ. గ్రామంలోని సంప్రదాయ మట్టి ఇళ్ల వెనుక భాగంలో ఉండే ఈ కొండను చూస్తే ప్రకృతే రంగులతో చిత్రాన్ని గీసినట్లు అనిపిస్తుంది. ఈ ప్రాంతం యునెస్కో గుర్తించిన క్వెబ్రాడా డి హుమాహువాకా ప్రపంచ వారసత్వ ప్రాంతంలో భాగంగా ఉంది.
ఈ కొండ అందం ఒక్క రోజులో ఏర్పడింది కాదు. దాదాపు 7.5 కోట్ల సంవత్సరాల క్రితం సముద్రాలు, సరస్సులు, నదుల ద్వారా పేరుకుపోయిన మట్టి, ఇసుక, ఖనిజాల పొరలు కాలక్రమేణా గట్టిపడి శిలలుగా మారాయి. ఆ తర్వాత భూమి అడుగున ఉన్న టెక్టోనిక్ ప్లేట్లు కదలడంతో ఈ శిలా పొరలు పైకి లేచాయి. ఆ కారణంగానే ఇప్పుడు ఈ కొండపై ఏడు రంగుల అందమైన పొరలు కనిపిస్తున్నాయి.
ఈ కొండపై కనిపించే ప్రతి రంగు వెనుక ఓ ప్రత్యేక ఖనిజం ఉంటుంది. గులాబీ రంగు సముద్రపు బురద, బంకమట్టి కారణంగా ఏర్పడింది. తెలుపు, లేత గోధుమ రంగులు సున్నపురాయి, ఇసుకరాళ్ల వల్ల కనిపిస్తాయి. ఊదా రంగుకు సీసం, కాల్షియం కార్బోనేట్ కారణం. మట్టి ఎరుపు రంగు ఇనుము ఎక్కువగా ఉన్న శిలల వల్ల వస్తుంది. ఆకుపచ్చ రంగు రాగి ఖనిజాలు, క్లోరైట్ వల్ల ఏర్పడుతుంది. పసుపు రంగు సల్ఫర్ ఉన్న ఇసుకరాళ్ల ప్రభావంతో కనిపిస్తుంది. ఈ రంగులన్నీ కలిసి కొండను అద్భుతంగా ఆకట్టుకునేలా చేస్తున్నాయి.
ఈ కొండను చూడటానికి ఉదయం వెళ్లడం మంచిది. ముఖ్యంగా మధ్యాహ్నం 1 గంటలోపు సూర్యరశ్మి నేరుగా కొండపై పడటంతో రంగులు మరింత స్పష్టంగా, ప్రకాశవంతంగా కనిపిస్తాయి. అందుకే ఎక్కువ మంది పర్యాటకులు ఉదయం వేళనే ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు. ఈ కొండ వెనుక భాగంలో పాసియో డి లాస్ కొలరాడోస్ అనే సుమారు మూడు కిలోమీటర్ల వృత్తాకార మట్టి మార్గం ఉంది. ఈ దారిలో నడుస్తూ కొండను దగ్గరగా చూడవచ్చు. గ్రామంలో ఉన్న సెర్రో ఎల్ పోరిటో అనే చిన్న కొండపైకి సుమారు 15 నిమిషాలు నడిస్తే మొత్తం ఏడు రంగుల కొండ ఒకేసారి కనిపిస్తుంది. ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన పెరూ రెయిన్ బో మౌంటెన్ 5 వేల మీటర్లకు పైగా ఎత్తులో ఉంటుంది. కానీ, పుర్మామార్కా సముద్ర మట్టానికి సుమారు 2,324 మీటర్ల ఎత్తులో మాత్రమే ఉంది. అందువల్ల చాలా మంది పర్యాటకులు పెద్దగా ఇబ్బంది లేకుండానే ఈ ప్రాంతాన్ని సందర్శించగలుగుతున్నారు.
పుర్మామార్కా, జుజుయ్ నగరానికి ఉత్తరంగా సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కారును అద్దెకు తీసుకుని జాతీయ రహదారి 9 మీదుగా సులభంగా చేరుకోవచ్చు. సాల్టా, శాన్ సాల్వడార్ డి జుజుయ్ సిటీస్ నుంచి ఒకరోజు టూర్ ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా, ఈ ప్రాంతంలో అర్జెంటీనాకు చెందిన సోలార్ రైలు కూడా నడుస్తుంది. దీంతో ప్రయాణం మరింత ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది.
ఏడు రంగుల కొండ కేవలం పర్యాటక ప్రదేశం మాత్రమే కాదు.. కోట్ల ఏళ్ల భూగర్భ చరిత్రను రంగుల రూపంలో మన కళ్లముందు ఉంచే ప్రకృతి అద్భుతం. అందుకే ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది పర్యాటకులు ప్రతి సంవత్సరం ఈ కొండను చూసేందుకు అర్జెంటీనాకు తరలివస్తున్నారు.
Read Also: గులాబీ రంగులో మెరిసే సరస్సులు.. ఈ అందం వెనుక ఇంత కథ ఉందా?