OnePlus 15R: సాధారణంగా కొత్త మొబైల్ మార్కెట్‌లోకి వస్తే.. దాని ఫీచర్లు, ధర వంటి వివరాలు లాంచ్ రోజే అధికారికంగా తెలుస్తాయి. కానీ కొన్నిసార్లు ఈ సమాచారం ముందే లీక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అదే కోవలోకి OnePlus 15R కూడా వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ 17న భారత్‌లో విడుదల కానున్నట్లు ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది. వన్‌ప్లస్ 15 సిరీస్‌లో ఇది అత్యంత చౌకైన ధరలో వచ్చే మోడల్‌గా ఉండనుందని కంపెనీ సంకేతాలు ఇచ్చింది.
తాజా లీక్‌ల ప్రకారం.. OnePlus 15R బేస్ వేరియంట్ ధర సుమారు రూ.47,000గా ఉండొచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, దీనిపై కంపెనీ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి.. లాంచ్ రోజునే తుది ధర స్పష్టత తెలియనుంది. అయితే, ఇప్పటికే కంపెనీ త్వరలో భారత మార్కెట్‌లోకి రానున్న OnePlus 15Rకు సంబంధించిన కొన్ని కీలక అంశాలను అధికారికంగా వెల్లడించింది. ఈ ఫోన్‌లో ఉపయోగించిన చిప్‌సెట్, బ్యాటరీ సామర్థ్యం, కెమెరా వివరాలతో పాటు కలర్ ఆప్షన్లు, వేరియంట్లపై కూడా క్లారిటీ ఇచ్చింది.
Read Also: పోకో అభిమానులకు గుడ్ న్యూస్.. 6.9 అంగుళాల డిస్‌ప్లేతో C85 5G ఫోన్ మార్కెట్లోకి వచ్చేసింది!
ముఖ్యంగా వన్‌ప్లస్ 15R హ్యాండ్ సెట్ భారీ 7,400mAh బ్యాటరీని కలిగి ఉండనుంది. ఈ సెగ్మెంట్‌లో ఇంత పెద్ద బ్యాటరీ ఉండటం యూజర్లకు ప్రధాన ఆకర్షణగా మారే అవకాశం ఉంది. అదనంగా, బ్యాంక్ ఆఫర్ల రూపంలో రూ.3వేల నుంచి రూ.4వేల వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉందని సమాచారం.
ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ ఆటోఫోకస్ సెల్ఫీ కెమెరా ఉంటుందని కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది. R సిరీస్‌లో ఇప్పటివరకు ఇదే అత్యంత అధునాతన ఫ్రంట్ కెమెరా అని వన్‌ప్లస్ చెబుతోంది. వన్‌ప్లస్ 15లో Sony IMX709 సెన్సార్‌ను ఉపయోగించగా, 15Rలో OmniVision సెన్సార్‌ను వాడినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
డిస్‌ప్లే పరంగా కూడా ఈ ఫోన్ ప్రత్యేకంగా నిలవనుంది. 165Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లేను అందించనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు.. మెరుగైన పనితీరు కోసం దీనిలో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నారు. ఈ ప్రాసెసర్‌తో విడుదలయ్యే ప్రపంచంలోనే తొలి స్మార్ట్‌ఫోన్ ఇదేనని వన్‌ప్లస్ పేర్కొంది.
ఇక కెమెరా సెటప్ విషయానికి వస్తే.. OnePlus 15Rలో డ్యూయల్ రియర్ కెమెరా వ్యవస్థ ఉంటుంది. దీనిలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉండగా, ఇది 4K వీడియోను 120fps వద్ద రికార్డ్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా అందించారు. భద్రత పరంగా IP68, IP69 రేటింగ్‌లను కూడా ఈ ఫోన్ కలిగి ఉంది. మొత్తంగా చూస్తే.. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్ల పరంగా ప్రీమియం సెగ్మెంట్‌లో బలమైన పోటీని ఇవ్వనుంది. లాంచ్ తర్వాత అధికారిక ధర, ఆఫర్లు వెలువడితే ఈ ఫోన్‌పై మరింత స్పష్టత రానుంది.
Read Also: అమెజాన్‌లో మోటోరొలా ఎడ్జ్ 50 ప్రోపై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.18,650 ధర తగ్గింపు!