Oppo Find X10 Series: మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ల జోరు ఎప్పుడూ ఉంటుంది కానీ, కొన్ని ఫోన్లు మాత్రం అంచనాలను పూర్తిగా తారుమారు చేస్తుంటాయి. ఇప్పుడు ఒప్పో ఇండియా తీసుకువచ్చిన కొత్త సిరీస్ కూడా సరిగ్గా అలాంటిదే. ఎప్పటికప్పుడు టెక్నాలజీలో కొత్త పుంతలు తొక్కే ఒప్పో.. ఈసారి ఏకంగా టెన్త్ జనరేషన్‌కు చెందిన Find X10 సిరీస్‌ను మన ముందుకు తెచ్చింది. ఇందులో Find X10తో పాటు మరో పవర్‌ఫుల్ మోడల్ అయిన Find X10 Pro Max కూడా ఉంది. కేవలం ఫోన్లు మాత్రమే కాకుండా.. ట్యాబ్లెట్, ఇయర్ బడ్స్ లాంటి గ్యాడ్జెట్స్‌ను కూడా ఒకేసారి లాంచ్ చేసి టెక్ ప్రపంచంలో సరికొత్త చర్చకు తెరలేపింది.
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఈసారి ఒప్పో గట్టిగానే ప్లాన్ చేసింది. ప్రసిద్ధ కెమెరా బ్రాండ్ హాస్లాబ్లాడ్ సహకారంతో ఈ ఫోన్లలో కెమెరా సిస్టమ్‌ను రూపొందించారు. బేసిక్ మోడల్‌లో డ్యూయల్ 200MP కెమెరా ఉంటే.. ప్రో మాక్స్ వెర్షన్‌లో ట్రిపుల్ 200MP కెమెరా సెటప్‌ను ఇచ్చారు. అంటే వెనక ఉన్న మూడు కెమెరాలూ 200 మెగాపిక్సెల్సే అన్నమాట. దీనివల్ల మనం కళ్లతో చూసే సహజమైన రంగులు, లైటింగ్ ఏమాత్రం పాడవకుండా ఫొటోలు అలాగే పడతాయి. ఇక వీడియోల విషయానికి వస్తే.. 4k, 8k రికార్డింగ్ ఆప్షన్లతో పాటు డాల్బీ విజన్ ఫీచర్లు ఉన్నాయి.
Also Read: సైబర్ మోసంలో డబ్బులు పోయాయా? తిరిగి పొందేందుకు మీకున్న హక్కులివే!
స్మార్ట్‌ఫోన్ ఎంత బాగున్నా బ్యాటరీ నిలవకపోతే పెద్దగా ఉపయోగం ఉండదు. అందుకే ఒప్పో ఈ సిరీస్‌లో ఏకంగా 8000mah కెపాసిటీ గల సిలికాన్-కార్బన్ బ్యాటరీని అమర్చింది. దీనికి తోడు 80 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే.. ఫైండ్ ఎక్స్10లో మీడియాటెక్ డైమెన్సిటీ 9600m చిప్‌సెట్ ఇస్తే.. ప్రో మాక్స్ మోడల్‌లో మరింత శక్తివంతమైన 2nm డైమెన్సిటీ 9600 ప్రో ప్రాసెసర్‌ను వాడారు. గేమింగ్ చేసినా, భారీ యాప్స్ వాడినా ఫోన్ వేడెక్కకుండా కూలింగ్ సిస్టమ్ కూడా చాలా బలంగా ఉంది.
ఈ ఫోన్లలో సరికొత్త కలర్‌ఓఎస్ 17 సాఫ్ట్‌వేర్‌ను ఇచ్చారు. ఇది చూడటానికి చాలా మృదువైన యానిమేషన్లతో, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ఉండే ‘ఏఐ మైండ్ పిలట్’ మన ఫోన్‌లోని ఫొటోలు, ఫైళ్లను అర్థం చేసుకుని రోజువారీ పనులను చాలా సులభం చేస్తుంది. ఏఐ ఫోటో ఏజెంట్ సాయంతో ఫొటోలను ఎడిట్ చేయడం కూడా చాలా ఈజీ అయిపోయింది. అలాగే కాల్స్‌లో మోసాలను పసిగట్టేందుకు ప్రత్యేకంగా ఏఐ కాల్ గార్డ్ ఫీచర్‌ను కూడా పొందుపరిచారు.
భారత దేశంలో ఒప్పో ఫైండ్ ఎక్స్10 ప్రారంభ ధర రూ.1,39,999 నుండి మొదలవుతుంది. ఇక టాప్ ఎండ్ మోడల్ అయిన ఫైండ్ ఎక్స్10 ప్రో మాక్స్ ధర రూ.1,99,999గా ఉంది. వీటితో పాటు ఒప్పో ప్యాడ్ మిని ట్యాబ్లెట్ రూ.94,999 ధరకు, ఎన్కో ఎక్స్4 ఇయర్‌బడ్స్ రూ.19,999 ధరకు రానున్నాయి. కొత్త ఫీచర్లు, అదిరిపోయే డిజైన్‌తో వస్తున్న ఈ గ్యాడ్జెట్లు టెక్ ప్రియులను కచ్చితంగా ఆకట్టుకుంటాయి.
Also Read: ఇంటి పైకప్పుపై నీళ్ల బాటిల్.. 30కి పైగా దేశాలు ఫాలో అవుతున్న పవర్ సేవింగ్ ట్రిక్ ఇదే!