Moser Lamp: కొన్నిసార్లు చిన్న చిన్న ఆలోచనలే పెద్ద పెద్ద సమస్యలకు అద్భుతమైన పరిష్కారాలను చూపుతుంటాయి. మనలో చాలామంది ప్లాస్టిక్ బాటిళ్లను వాడి పారేస్తుంటాం. కానీ, పగటిపూట కరెంట్ లేకుండానే చీకటి గదులను వెలుగుతో నింపేయడానికి అవే ప్లాస్టిక్ బాటిళ్లు బాగా పనికొస్తాయని ఎవరైనా ఊహించగలరా? అసలు ఎలాంటి విద్యుత్ ఖర్చు లేకుండా, పైసా ఖర్చు లేని ఈ అద్భుతమైన ఆలోచన బ్రెజిల్‌లో పుట్టింది. దీని వెనుక పెద్ద సైన్స్ ఏమీ లేదు, కానీ ఆచరణలో పెట్టే విధానం మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
బ్రెజిల్‌లోని ఉబెరాబా ప్రాంతానికి చెందిన అల్ఫ్రెడో మోసర్ అనే మెకానిక్ ఈ వినూత్న ఆలోచనకు రూపకల్పన చేశారు. 2000వ దశకం ప్రారంభంలో ఆ ప్రాంతంలో తీవ్రమైన కరెంట్ కోతలు, విద్యుత్ కొరత ఏర్పడ్డాయి. ఆ సమయంలో పగటిపూట కూడా ఇళ్లలో చీకటిగా ఉండటంతో ఆయన ఈ ప్రయోగానికి తెరలేపారు. పారదర్శకంగా ఉండే ప్లాస్టిక్ బాటిల్‌లో నీళ్లు నింపి, పైకప్పుకు అమర్చితే ఇల్లంతా కాంతి ఎలా ప్రసరిస్తుందో ఆయన నిరూపించారు. అదే నేడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో పేదరికం ఉన్న ప్రాంతాలకు గొప్ప వరంగా మారింది.
ఒక సాధారణ మెకానిక్ ఆలోచనగా మొదలైన ఈ కాన్సెప్ట్.. 2011లో ఫిలిప్పీన్స్ వేదికగా పెద్ద ఉద్యమంలా మారింది. అక్కడ ‘మైషెల్టర్ ఫౌండేషన్’ చేపట్టిన ‘లీటర్ ఆఫ్ లైట్’ ప్రోగ్రామ్ ఈ వాటర్ బాటిల్ ట్రిక్‌కు మరింత ప్రాచుర్యం తెచ్చింది. సామాన్య ప్రజలు సైతెం స్వయంగా తయారు చేసుకునే ఈ లో-కాస్ట్ లైటింగ్ సిస్టమ్ కేవలం కొన్ని నెలల్లోనే లక్షలాది కుటుంబాలకు చేరువయింది. అలా బ్రెజిల్ నుంచి మొదలైన ఈ ప్రయాణం.. క్రమంగా ఆసియా దేశాలతో సహా ప్రపంచవ్యాప్తంగా ముప్పైకి పైగా దేశాలకు విస్తరించింది.
ఈ టెక్నాలజీ వెనుక ఉన్న సూత్రం చాలా సులభం. పారదర్శకమైన ప్లాస్టిక్ బాటిల్‌లో నీటిని నింపి ఇంటి పైకప్పు మధ్యలో ఫిక్స్ చేస్తారు. బాటిల్ పైభాగం సూర్యరశ్మి తగిలేలా బయటికి ఉంటుంది. కింది భాగం గది లోపలికి కనిపిస్తుంది. బయట నుంచి సూర్యకాంతి ఆ బాటిల్‌లోని నీటిపై పడినప్పుడు, ఆ కాంతి కిరణాలు నీటి ద్వారా వక్రీభవనం చెంది నలువైపులా విస్తరిస్తాయి. అంటే సూర్యుడి నుంచి వచ్చే చిన్నటి కాంతి పుంజం.. బాటిల్ కారణంగా గది అంతటా ప్రతిఫలించి, పగటిపూట గదిలో వెలుతురును నింపుతుంది. అయితే ఇది కేవలం పగటిపూట మాత్రమే పనిచేస్తుంది.
ఈ బాటిల్ ల్యాంప్స్ ఎక్కువ కాలం స్పష్టంగా పనిచేయడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కాలక్రమేణా నీటిలో ఆకుపచ్చని నాచు లేదా బ్యాక్టీరియా చేరి నీరు రంగుమారే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండటానికే నీటిలో కొద్దిగా బ్లీచింగ్ పౌడర్ లేదా క్లోరిన్ కలుపుతారు. దీనివల్ల నీరు ఎల్లప్పుడూ తేటగా ఉండి, కాంతిని సరిగ్గా లోపలికి పంపిస్తుంది. అయితే రసాయనాలను కలిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
ఈ సింపుల్ ట్రిక్ చూడటానికి ఎంతో సులభంగా అనిపించినా.. దీనిని ఇళ్లపై అమర్చేటప్పుడు కొన్ని ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి. ఇంటి పైకప్పులో రంధ్రం చేసి బాటిల్‌ను ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. దీంతో వర్షం పడినప్పుడు నీరు లోపలికి లీక్ కాకుండా పక్కాగా వాటర్‌ప్రూఫ్ సీలింగ్ చేయాలి. పైకప్పు నిర్మాణాన్ని బట్టి ఇది సరిపోతుందో లేదో సరిచూసుకోవాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా పైకప్పు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే స్థానిక నిపుణుల సలహాతో దీన్ని అమర్చుకుంటే కరెంట్ బిల్లు లేకుండానే పగటిపూట చక్కని వెలుతురును సొంతం చేసుకోవచ్చు.