Perplexity AI PC: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచంలో సెర్చ్ ఇంజిన్‌గా సంచలనం సృష్టించిన పర్ప్లెక్సిటీ Perplexity, ఇప్పుడు హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ కలయికతో కూడిన ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఆస్ట్రియన్ డెవలపర్ పీటర్ స్టెయిన్‌బెర్గర్ రూపొందించిన ఓపెన్ క్లా ‘OpenClaw’ అనే ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ నుండి ప్రేరణ పొంది, పర్ప్లెక్సిటీ తన సరికొత్త పర్సనల్ కంప్యూటర్ కాన్సెప్ట్‌ను ప్రకటించింది.
పీటర్ స్టెయిన్‌బెర్గర్ ఒక మాక్ మినీ కంప్యూటర్‌ను ఉపయోగించి, అది 24 గంటలూ పనిచేస్తూ, స్మార్ట్‌ఫోన్ ద్వారా నియంత్రించగలిగే ఒక AI ఏజెంట్‌ను సృష్టించారు. దీనినే ఓపెన్ క్లా అని పిలుస్తారు. ఈ ఆలోచన ఎంత శక్తివంతమైనదంటే, ఇది ఆయనకు ఏకంగా ఓపెన్ ఓఐలో ఉద్యోగాన్ని సంపాదించి పెట్టింది. ఇప్పుడు అదే స్ఫూర్తితో పర్ప్లెక్సిటీ తన సొంత వెర్షన్‌ను రూపొందించింది.
సాధారణంగా మనం వాడే విండోస్ లేదా మాక్ ఆపరేటింగ్ సిస్టమ్‌లు మనం ఇచ్చే కమాండ్ల ప్రకారం పనిచేస్తాయి. కానీ పర్ప్లెక్సిటీ తీసుకువస్తున్న ఈ AI కంప్యూటర్ “లక్ష్యాల” ఆధారంగా పనిచేస్తుంది. ఇది ఒక మాక్ మినీ హార్డ్‌వేర్‌పై రన్ అవుతూ, యూజర్ కోసం 24/7 అందుబాటులో ఉంటుంది. మీరు నిద్రపోతున్నా లేదా ఆఫీసులో ఉన్నా, మీ తరపున ఇది పనులను పూర్తి చేయగలదు. పర్ప్లెక్సిటీ CEO అరవింద్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం, ఇది కేవలం క్లౌడ్ ఆధారిత AI మాత్రమే కాదు. ఇది మీ లోకల్ ఫైళ్లు, అప్లికేషన్లు సెషన్స్‌తో అనుసంధానమై ఉంటుంది. అంటే మీ పర్సనల్ డేటాను అర్థం చేసుకుని, దానికి అనుగుణంగా స్పందిస్తుంది. యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్ లేదా ఇతర పరికరాల ద్వారా ఎక్కడి నుండైనా ఈ కంప్యూటర్‌ను ఆజ్ఞాపించవచ్చు.
AI వ్యవస్థలకు లోకల్ ఫైళ్లకు యాక్సెస్ ఇచ్చినప్పుడు భద్రత అనేది ప్రధాన సమస్య. దీనిని దృష్టిలో ఉంచుకుని పర్ప్లెక్సిటీ కొన్ని కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. ఏదైనా కీలకమైన లేదా సున్నితమైన పని చేసేటప్పుడు సిస్టమ్ తప్పనిసరిగా యూజర్ అనుమతి అడుగుతుంది. AI చేస్తున్న ప్రతి చిన్న పని రికార్డ్ చేయబడుతుంది, దీనివల్ల పారదర్శకత ఉంటుంది. ఏదైనా తప్పు జరుగుతుందనిపిస్తే, వెంటనే వ్యవస్థను నిలిపివేసే అత్యవసర బటన్ సదుపాయం ఉంటుంది. ప్రస్తుతం ఈ సేవలు పొందాలనుకునే వారి కోసం పర్ప్లెక్సిటీ ఒక ‘వెయిటింగ్ లిస్ట్’ను ప్రారంభించింది. మొదటి విడతలో ఎంపిక చేసిన వినియోగదారులకు అవసరమైన సపోర్ట్ రిసోర్స్‌లను అందించాలని సంస్థ భావిస్తోంది. యాపిల్ సంస్థ తన మాక్ మినీ ఉత్పత్తిని పెంచుతున్న తరుణంలో, దానిని ఒక AI సర్వర్‌లా మార్చాలనే పర్ప్లెక్సిటీ ఆలోచన సాంకేతిక ప్రపంచంలో సరికొత్త చర్చకు దారితీసింది. మీ వ్యక్తిగత పనులను చక్కబెట్టే ఒక “డిజిటల్ ప్రతినిధి”గా ఈ పర్సనల్ కంప్యూటర్ నిలవబోతోంది.