Portable AC vs Tower Air Cooler: రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఎండలు ఎలా మండిపోతున్నాయో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో ఉక్కపోతను భరించలేక పోతున్నారు. దీంతో ప్రతి ఇంట్లోనూ చల్లదనం కోసం ఏదో ఒక కూలింగ్ మెషిన్ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో చాలామంది మండిపోతున్న ఈ ఎండలకు పోర్టబుల్ ఏసీ బాగుంటుందా లేక టవర్ కూలర్ తీసుకోవాలా అని తలలు పట్టుకుంటున్నారు. మరి ఈ రెండింటిలో ఏది బెస్టో ఓసారి క్లియర్‌గా తెలుసుకుందామా..
ఈ వేసవిలో మనకు కావాల్సింది చల్లగాలి. టవర్ కూలర్లు నీటి సాయంతో గాలిని అందిస్తాయి. ఇవి ఒకే దిశలో గాలిని స్పీడ్‌గా విసురుతాయి కాబట్టి.. వాటి ముందు కూర్చుంటే భలే హాయిగా ఉంటుంది. కానీ గది మొత్తం చల్లబడాలంటే మాత్రం టైమ్ పడుతుంది. అదే పోర్టబుల్ ఏసీ విషయానికి వస్తే.. ఇది అచ్చం మన ఇంట్లో ఉండే ఏసీ లాగే కంప్రెషర్‌తో పనిచేస్తుంది. కాబట్టి గదిని చాలా త్వరగా చల్లబరుస్తుంది. కాకపోతే ఏసీ నుంచి వచ్చే వేడి గాలిని బయటకు పంపడానికి ఒక పైపును కిటికీకి అమర్చాల్సి ఉంటుంది. ఇది ఒక్కటే ఇందులో చిన్న తలనొప్పి.
బడ్జెట్ గురించి ఆలోచించే వారికి కూలర్ ఎప్పుడూ బెస్ట్ ఆప్షనే. ఎందుకంటే.. టవర్ కూలర్లు చాలా తక్కువ కరెంటును వాడుకుంటాయి. నెలకు కేవలం రూ.200 నుంచి రూ.350 లోపే బిల్లు వస్తుంది. కానీ పోర్టబుల్ ఏసీ అలా కాదు. ఇది పక్కా ఏసీ లాగే కరెంటును లాగేస్తుంది. వాడకాన్ని బట్టి కరెంటు బిల్లు నెలకు రూ.1500 నుంచి రూ.2500 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. పొదుపుగా ఉండాలనుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూలర్ వైపు మొగ్గు చూపడం బెటర్.
కొనేటప్పుడు రేటు కూడా చూడాలి కదా. మార్కెట్లో మంచి కంపెనీ టవర్ కూలర్లు రూ.6,000 నుండి రూ.14,000 లోపే దొరుకుతున్నాయి. కానీ పోర్టబుల్ ఏసీలు మాత్రం చాలా కాస్ట్‌లీ. వీటి ధరలు రూ.25,000 నుండి రూ.35,000 వరకు ఉంటాయి. నిజం చెప్పాలంటే.. ఇంత బడ్జెట్ ఉన్నప్పుడు నార్మల్ విండో ఏసీ లేదా స్ప్లిట్ ఏసీ కొనుక్కోవడం తెలివైన పని. కేవలం ఎక్కడికైనా మోసుకెళ్లాలి అనుకుంటేనే పోర్టబుల్ ఏసీ గురించి ఆలోచించాలి.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. వైజాగ్, ముంబై లాంటి తీర ప్రాంతాల్లో లేదంటే గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు కూలర్లు సరిగ్గా పని చేయవు. గాలి జిగట జిగటగా అనిపిస్తుంది. అలాంటి చోట్ల పోర్టబుల్ ఏసీలే బెస్ట్. ఇక కూలర్లలో రోజూ నీళ్లు పోయడం, వాటిని కడగడం లాంటి పనులు ఉంటాయి. ఏసీలో ఆ శ్రమ ఉండదు కానీ.. ఫిల్టర్లను మాత్రం అప్పుడప్పుడు క్లీన్ చేయాలి.
అలాగే తక్కువ ఖర్చులో సమ్మర్‌లో మంచి చల్లదనం కావాలనుకుంటే.. కళ్లు మూసుకుని టవర్ కూలర్ తీసేసుకోండి. లేదు.. మాకు బిల్లుతో సంబంధం లేదు.. గది వెంటనే చిల్ అయిపోవాలి, అద్దె ఇల్లు కాబట్టి గోడలకు కన్నాలు పెట్టలేము అనుకుంటే మాత్రం పోర్టబుల్ ఏసీని కొనుగోలు చేయొచ్చు.
Also Read: మరో సెన్సేషన్‌కు రియల్‌మీ ప్లాన్.. తక్కువ ధరలో 7000mAh బ్యాటరీతో కొత్త ఫోన్!