Greenish Star: అంతరిక్షంలో నక్షత్రాలు ఎరుపు, తెలుపు లేదా నీలం రంగుల్లో మెరవడం సాధారణం. కానీ విజ్ఞాన శాస్త్రానికే సవాలు విసురుతూ.. పసుపు, ఆకుపచ్చ కలిసిన విచిత్రమైన రంగులో వెలిగే ఒక అరుదైన నక్షత్రాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమికి దాదాపు 280 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ ‘వైట్ డ్వార్ఫ్’ లేదా శ్వేత వామన నక్షత్రానికి ‘WD J1330+6435’ అని పేరు పెట్టారు. సాధారణంగా నక్షత్రాల రంగు అనేది వాటి ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది. కానీ ఈ చనిపోయిన నక్షత్రం విచిత్రమైన రంగును సంతరించుకోవడం వెనుక ఒక పెద్ద రసాయనిక ప్రక్రియ దాగి ఉంది.
ఒకప్పుడు ఈ నక్షత్రం చుట్టూ తిరిగిన గ్రహాలు నశించిపోతూ, వాటి శకలాలు ఈ నక్షత్ర ఉపరితలంపై పడ్డాయి. దీనివల్ల ఆ నక్షత్ర వాతావరణంలో కాల్సియం, లిథియం, ముఖ్యంగా సోడియం పరిమాణం భారీగా పెరిగింది. అత్యంత తీవ్రమైన సాంద్రత ఉండే ఈ వాతావరణంలో సోడియం పరమాణువులు ఎరుపు, పసుపు, నారింజ రంగు కాంతులను పీల్చేసుకుంటున్నాయి. దీనివల్ల ఆ నక్షత్రం నుంచి బయటకు వచ్చే కాంతిలో మిగిలిన ఛాయలు కలసిపోయి, మానవ కంటికి ఇది ఆకుపచ్చని రంగులో కనిపిస్తోంది. సరిగ్గా ఒక పెయింటర్ రంగులను మిక్స్ చేసినట్లే ఈ కాంతి విశ్లేషణ జరుగుతోంది.
శాస్త్రవేత్తలు ఇలాంటి 151 నక్షత్రాలను పరిశోధించినప్పుడు అద్భుతమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. కార్బన్ ఎక్కువగా ఉన్న కొన్ని నక్షత్రాలు గులాబీ, ఊదా రంగుల్లో కనిపిస్తుంటే, మరికొన్ని నీలం, పసుపు రంగుల్లో వెలుగుతున్నాయి. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో తప్ప నిజ జీవితంలో ఇలాంటి పచ్చటి నక్షత్రాలు ఉండవని భావించిన శాస్త్రవేత్తలకు ఈ పరిశోధన ఒక కొత్త సవాలు విసిరింది. గ్రహాల నాశనం, నక్షత్రాల అంతం వల్ల విశ్వంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో అర్థం చేసుకోవడానికి ఈ ప్రయోగం ఎంతగానో దోహదపడుతుంది.