Chamala Kiran Kumar: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు’ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేవలం కేసీఆర్ కుటుంబానికే పరిమితమయ్యాయని భువనగిరి లోక్‌సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా మార్చిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లు వచ్చి రైతులకు కోట్లు వస్తున్నాయని కేసీఆర్ భ్రమపడతున్నారని ఎద్దేవా చేశారు.
ఫామ్‌హౌస్‌కు నీటి తరలింపు..
కొండపోచమ్మ సాగర్ నిర్మించిందే కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌కు నీటి తరలింపు కోసమని ఆరోపించారు. రాష్ట్రమంతా ఎల్ నినో ప్రభావంతో నీటి ఎద్దడి ఉంటే, కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మాత్రం ఆ ప్రభావం ఎందుకు లేదని ప్రశ్నించారు.2017లో ఫామ్‌హౌస్ పక్కనే 58 ఎకరాల్లో పాండురంగ చెరువు తవ్వారని, ఎర్రవెల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నిరంతరం ఫామ్‌హౌస్‌లోని 3 ఎకరాల బావిలోకి నీటిని తరలిస్తున్నారని వెల్లడించారు. 300 ఎకరాల అసైన్డ్ భూములపై సర్వే జరుగుతున్న సమయంలో ఈ నీళ్ల మళ్లింపు వ్యవహారం బయటపడిందన్నారు.కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో డ్రిప్ ఇరిగేషన్ కోసం 100 శాతం సబ్సిడీతో రూ.42 కోట్ల 54 లక్షల ప్రజాధనాన్ని వాడుకున్నారని మండిపడ్డారు.
ఇంటికో ఉద్యోగం అంటే కేసీఆర్ ఇంట్లోనే 5 ఉద్యోగాలు
తెలంగాణ ప్రజలకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేసీఆర్, తన ఇంట్లోనే కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావులకు పదవులు ఇచ్చుకుని 5 ఉద్యోగాలు భర్తీ చేసుకున్నారని ఎద్దేవా చేశారు. 1,600 మంది బలిదానాలతో సిద్ధించిన తెలంగాణలో పదేళ్ల పాటు కేసీఆర్ కుటుంబానికే న్యాయం జరిగిందని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు కాంట్రాక్టర్లతో లేఖలు రాయించే కుట్రలు చేస్తున్నారని ఎంపీ ఆరోపించారు. బీఆర్ఎస్ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన ఆర్వీఎమ్ (నామా రమేష్, నామా వివేక్) కంపెనీ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు లేఖ రాయడం ఇందులో భాగమేనన్నారు.2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సదరు కంపెనీ రూ.77 కోట్ల విలువైన పనులు తీసుకుందని, రూ.25 కోట్ల బిల్లులు పెట్టగా ప్రభుత్వం ఇప్పటికే రూ.20 కోట్లు చెల్లించిందని స్పష్టం చేశారు. కేవలం రూ.4 కోట్లు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
ఇరిగేషన్ అధికారులపై కఠిన చర్యలు
ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేఖ రాస్తేనే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామని బీఆర్ఎస్ అధిష్ఠానం నామా నాగేశ్వరరావును భయపెట్టిందా? అని ప్రశ్నించారు.ఇక సింగరేణికి డిస్కమ్‌ల బకాయిలు చెల్లించకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో దాన్ని నాశనం చేసిందని, జీతాలు కూడా ఇవ్వలేని క్లిష్ట పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఫామ్‌హౌస్‌కు అక్రమంగా నీటిని తరలించిన వ్యవహారంతో పాటు, ఇందుకు సహకరించిన ఇరిగేషన్ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.
Also Read: సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!