Samsung Software Updates: కొత్త ఫోన్ కొనేటప్పుడు కెమెరా, బ్యాటరీ, ధరతో పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఎన్ని సంవత్సరాల పాటు వస్తాయో కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే అప్‌డేట్స్ ఆగిపోయిన తర్వాత కొత్త ఫీచర్లు అందకపోవడంతో పాటు, ఫోన్ భద్రతకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. శాంసంగ్ తమ కొత్త ఫోన్లకు ఎక్కువకాలం అప్‌డేట్స్ అందిస్తున్నప్పటికీ.. పాత మోడళ్లకు మాత్రం గతంలో ప్రకటించిన అప్‌డేట్ విధానమే వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో 2029 నాటికి సెక్యూరిటీ అప్‌డేట్స్ ముగిసే అవకాశం ఉన్న ఐదు శాంసంగ్ ఫోన్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
2024లో వచ్చిన గెలాక్సీ A55, ఆ సమయంలో A సిరీస్‌లో మంచి ఫీచర్లు ఉన్న ఫోన్. ఇందులో 120Hz AMOLED డిస్‌ప్లే, Exynos 1480 చిప్‌సెట్, 50MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ఈ మోడల్‌కు నాలుగు ప్రధాన ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, ఐదేళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ మాత్రమే ఉన్నాయి. ఆండ్రాయిడ్ 18 వరకు అప్‌డేట్ అందుకుని, సెక్యూరిటీ ప్యాచ్‌లు 2029లో ముగిసే అవకాశం ఉంది.
గెలాక్సీ A35 కూడా 2024లోనే విడుదలైంది. A55 కంటే తక్కువ ధరలో వచ్చిన ఈ ఫోన్‌లో 120Hz AMOLED స్క్రీన్, 50MP ప్రధాన కెమెరా, 4K వీడియో రికార్డింగ్ ఉన్నాయి. అయితే ఇందులో Exynos 1380 ప్రాసెసర్ ఉండటంతో పనితీరు A55 కంటే కొంచెం తక్కువ. ఈ ఫోన్‌కు కూడా నాలుగు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, ఐదేళ్ల సెక్యూరిటీ సపోర్ట్ వర్తిస్తాయి. ప్రధాన అప్‌డేట్స్ 2028లో ముగిసి, సెక్యూరిటీ అప్‌డేట్స్ 2029 వరకు రావచ్చు.
Also Read: భారత్‌లో యాపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ సేల్ షురూ.. స్టోర్‌కి వెళ్తే దొరుకుతుందా? లేక జనవరి దాకా ఆగాలా?
2023 చివర్లో విడుదలైన గెలాక్సీ A15 తక్కువ బడ్జెట్‌లో AMOLED స్క్రీన్ కావాలనుకునేవారికి మంచి ఎంపికగా నిలిచింది. ఇందులో MediaTek Helio G99 చిప్‌సెట్, 90Hz డిస్‌ప్లే, 50MP ప్రధాన కెమెరా ఉన్నాయి. అయితే కెమెరాకు OIS లేదు. అల్ట్రావైడ్ కెమెరా కూడా సాధారణ స్థాయిలోనే ఉంటుంది. ఈ ఫోన్‌కు నాలుగు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ అందుతాయి. ఆండ్రాయిడ్ 18 చివరి ప్రధాన అప్‌డేట్ కావచ్చు. సెక్యూరిటీ సపోర్ట్ 2029 ప్రారంభం వరకు కొనసాగొచ్చు.
గెలాక్సీ A06 5G, తక్కువ ధరలో 5G కావాలనుకునేవారిని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 90Hz LCD స్క్రీన్, డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 50MP ప్రధాన కెమెరా ఉన్నాయి. శాంసంగ్ ఈ మోడల్‌కు నాలుగు తరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, నాలుగేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ హామీ ఇచ్చింది. అందువల్ల ఆండ్రాయిడ్ 19 వరకు అప్‌డేట్ రావచ్చు. సెక్యూరిటీ సపోర్ట్ 2029 వరకు ఉండొచ్చు. అయితే కొన్ని ప్రాంతాల్లో సపోర్ట్ 2030 వరకు చూపిస్తున్నారు.
బలమైన ఫోన్ కావాలనుకునేవారికి XCover 7 ఉపయోగపడుతుంది. ఇందులో నీరు, దుమ్ము నుంచి రక్షణ కోసం IP68 రేటింగ్, MIL-STD-810H ప్రమాణం, మార్చుకోగల బ్యాటరీ ఉన్నాయి. 50MP వెనుక కెమెరా, డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్ కూడా ఉన్నాయి. 2024లో విడుదలైన ఈ మోడల్‌కు నాలుగు ప్రధాన అప్‌డేట్స్, ఐదేళ్ల సెక్యూరిటీ సపోర్ట్ లభిస్తుంది. కాబట్టి ప్రధాన అప్‌డేట్స్ 2028లో ముగిసి, సెక్యూరిటీ అప్‌డేట్స్ 2029 వరకు కొనసాగవచ్చు. కొనుగోలు చేసే ముందు మీ ప్రాంతానికి వర్తించే అప్‌డేట్ వివరాలను కంపెనీ అధికారిక సైట్‌లో చూసుకోవడం మంచిది.
Also Read: ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు బ్యాటరీ సేవ్ చేయడానికి పాటించాల్సిన 5 రూల్స్!