Smartphone Hacks: సాధారణంగా చాలామంది కొత్త ఫోన్ కొనుగోలు చేయగానే, పాత ఫోన్‌ను ఇంట్లో ఓ మూల పడేస్తుంటారు. ఇప్పుడా ఆ పాత స్మార్ట్‌ఫోనే మీ ఇంటికి బాడీగార్డ్‌లా మారుతుందని మీలో ఎంత మందికి తెలుసు? అవును.. మీరు విన్నది నిజమే! ప్రస్తుతం ఇంటి వద్ద CCTV కెమెరాలు అమర్చుకోవాలంటే వేలకు వేలు ఖర్చు చేయాలి. పైగా ఆ వైరింగ్, మెయింటెనెన్స్ పెద్ద తలనొప్పి. ఈ విధానం మధ్యతరగతి కుటుంబాలకు కొంత భారమే.
కానీ, కాస్త తెలివిగా ఆలోచిస్తే రూపాయి ఖర్చు లేకుండా మీ పాత ఫోన్‌నే హై క్వాలిటీ సీసీటీవీ కెమెరాగా మార్చుకోవచ్చు. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా లేదా మీరు ఊరెళ్లినప్పుడు ఇంటి వద్ద ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నా.. ఈ సింపుల్ ట్రిక్ అద్భుతంగా పనిచేస్తుంది. టెక్నాలజీ గురించి పెద్దగా తెలియకపోయినా, కొన్ని నిమిషాల్లో మీ ఫోన్‌ను సెక్యూరిటీ కెమెరాగా సెట్ చేసుకోవచ్చు.
దీని కోసం మీ దగ్గర రెండు ఫోన్లు ఉండాలి. ఒకటి ప్రస్తుతం మీరు వాడుతున్న ఫోన్, రెండోది పాత ఫోన్. పాత ఫోన్ కెమెరాగా పనిచేస్తుంది. కొత్త ఫోన్‌లో మీరు లైవ్ దృశ్యాలను చూడొచ్చు. పాత ఫోన్‌ను మీకు కావాల్సిన చోట, అంటే.. ఇంటి మెయిన్ డోర్ దగ్గరో లేదా పిల్లల గదిలోనో అమర్చుకోవాలి. అక్కడ ఇంటర్నెట్ సిగ్నల్ ఉండేలా చూసుకుంటే చాలు. అలాగే ఫోన్ ఛార్జింగ్ అయిపోకుండా ఒక ప్లగ్ పాయింట్ దగ్గర దీన్ని అమర్చడం ఉత్తమం. ఫోన్ కింద పడిపోకుండా ఒక చిన్న స్టాండ్ లేదా ట్రైపాడ్ వాడితే వ్యూ క్లియర్‌గా కనిపిస్తుంది.
Also Read: బడ్జెట్ ధరే కానీ ఫీచర్లు మాత్రం నెక్ట్స్ లెవల్.. త్వరలో లాంచ్ కానున్న టాప్-5 ల్యాప్‌టాప్స్!
మీ వద్ద ఉన్న రెండు ఫోన్లలో ఏదైనా సెక్యూరిటీ కెమెరా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీని కోసం ప్లే స్టోర్‌లో మంచి రేటింగ్ ఉన్న యాప్‌ను ఎంచుకోవచ్చు. ఈ యాప్‌లు లైవ్ స్ట్రీమింగ్ మాత్రమే కాకుండా, కదలికలను గుర్తించడం వంటి ఫీచర్లను కూడా అందిస్తాయి. రెండు ఫోన్లలోనూ ఒకే అకౌంట్‌తో లాగిన్ అవ్వడం ఇక్కడ చాలా ముఖ్యం. అప్పుడే ఒకదానికొకటి కనెక్ట్ అవుతాయి. యాప్ అడిగే కెమెరా, మైక్రోఫోన్ పర్మిషన్లను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని ఓకే చేయండి.
అన్నీ రెడీ చేసుకున్నాక.. పాత ఫోన్‌ను కెమెరా ఆప్షన్‌గా, కొత్త ఫోన్‌ను వ్యూయర్ ఆప్షన్‌గా సెట్ చేసుకోవాలి. ఒక్కసారి పెయిరింగ్ పూర్తయితే పాత ఫోన్ చూపిస్తున్న దృశ్యాలు మీ కొత్త ఫోన్ స్క్రీన్ మీద కనిపిస్తాయి. ఒకసారి చెక్ చేసుకోవడానికి కెమెరా ముందు నడుస్తూ లేదా చేతులు ఊపుతూ వీడియో క్వాలిటీని పరీక్షించుకోండి. ఒకవేళ ఎవరైనా కెమెరా ముందుకు వస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేలా మోషన్ డిటెక్షన్ ఆన్ చేసుకోండి. ఇలా చాలా తక్కువ ఖర్చుతో మీ పాత ఫోన్‌తో సీసీటీవీ కెమెరాను సెట్ చేసుకోవచ్చు.
Also Read: వచ్చేస్తున్నాయ్ ఏఐ స్మార్ట్ టీవీలు.. శాంసంగ్ నుంచి సోనీ వరకు, ఏదైనా బడ్జెట్‌లోనే!