భారతదేశపు అగ్రగామి ఏఐ ఆధారిత స్థానిక భాషా ప్లాట్ ఫామ్ అయిన VerSe Innovation తన పాలనా యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. డైలీహంట్, జోష్, మ్యాగ్జ్టర్ వంటి ఫేమస్ ప్లాట్‌ఫామ్‌లకు మాతృ సంస్థ అయిన VerSe.. తన బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా పీఆర్ రమేష్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. కేవలం డైరెక్టర్‌గానే కాకుండా ఆయన కంపెనీ ఆడిట్ కమిటీకి ఛైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వహించనున్నారు. సంస్థ మరింత ఎదుగుతున్న తరుణంలో ఈ నియామకం కార్పొరేట్ గవర్నెన్స్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఆర్థిక రంగంలో మంచి అనుభవం..
పీఆర్ రమేష్ ఆర్థిక రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్. గతంలో ఆయన డెలాయిట్ ఇండియా వంటి గ్లోబల్ ఆడిటింగ్ దిగ్గజ సంస్థకు ఛైర్మన్‌గా పనిచేశారు. 40 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆయన గతంలో ఎన్నో క్లిష్టమైన ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించారు. ప్రస్తుతం ఆయన ఎయిర్ ఇండియా, నెస్లే ఇండియా, ఎల్ అండ్ టీ, సిప్లా వంటి ప్రతిష్టాత్మక కంపెనీల బోర్డులలో సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన ప్రతిభకు గుర్తింపుగా 2022-23 సంవత్సరానికి గాను ఏషియన్ సెంటర్ ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్ నుంచి ఉత్తమ స్వతంత్ర డైరెక్టర్ అవార్డును సైతం అందుకున్నారు.
ఆర్బీఐలో కూడా..?
కేవలం కార్పొరేట్ కంపెనీలకే కాకుండా భారత ఆర్థిక నియంత్రణ సంస్థలైన సెబీ (SEBI), ఆర్బీఐ (RBI), ఐఆర్డీఏ (IRDA) వంటి విభాగాల్లో కీలక కమిటీ సభ్యుడిగా ఆయన సేవలను అందించారు. భారతదేశ ఆర్థిక విధానాల రూపకల్పనలో, పాలనాపరమైన సంస్కరణల్లో ఆయన పాత్ర ఎంతో కీలకం. ఇప్పుడు అదే అనుభవాన్ని VerSe Innovation తన డెవలప్ మెంట్ కోసం ఉపయోగించుకోవాలని భావిస్తోంది. బోర్డులో ఆయన చేరికతో కంపెనీ నిర్వహణలో పారదర్శకత పెరగడమే కాకుండా ఇన్వెస్టర్లలో కూడా నమ్మకం రెట్టింపు అవుతుందని యాజమాన్యం ఆశిస్తోంది.
ఆర్థిక క్రమశిక్షణ అవసరం: ఉమంగ్ బేడీ
ఈ సందర్భంగా VerSe సహ వ్యవస్థాపకుడు ఉమంగ్ బేడీ మాట్లాడుతూ.. ఏ సంస్థ అయినా మార్కెట్ లో పోటీని తట్టుకుని నిలబడాలంటే బలమైన ఆర్థిక క్రమశిక్షణ అవసరమని పేర్కొన్నారు. పీఆర్ రమేష్ వంటి అంతర్జాతీయ స్థాయి అనుభవం ఉన్న వ్యక్తి తమతో చేరడం తమ గవర్నెన్స్ ప్రమాణాలను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా కంపెనీ స్థిరమైన వృద్ధి సాధించడానికి ఆయన సూచనలు దిశానిర్దేశం చేస్తాయని వెల్లడించారు. బాధ్యతాయుతమైన కార్పొరేట్ సంస్థగా ఎదిగే క్రమంలో ఇటువంటి నియామకాలు అనివార్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
తన నియామకంపై పీఆర్ రమేష్ స్పందిస్తూ.. ఒక సంస్థ విస్తరిస్తున్న కొద్దీ దానికి బాధ్యత కూడా పెరుగుతుందని గుర్తుచేశారు. ఆవిష్కరణలతో పాటు క్రమశిక్షణ, జవాబుదారీతనం ఉంటేనే గొప్ప సంస్థలు నిర్మించబడతాయని ఆయన వ్యాఖ్యానించారు. VerSe బోర్డుతో కలిసి పనిచేస్తూ ఆర్థిక నియంత్రణలు, రిస్క్ మేనేజ్‌మెంట్ వంటి అంశాలలో తన వంతు సహకారాన్ని అందిస్తానని చెప్పారు. సంస్థ కార్యకలాపాల్లో పారదర్శకతను పెంచడం ద్వారా దీర్ఘకాలిక విలువలను సృష్టించడమే తన ప్రాధాన్యత అని ఆయన వివరించారు.
VerSe Innovation తన ఏఐ టెక్నాలజీ ద్వారా కోట్లాది మంది భారతీయులకు వారి సొంత భాషల్లో కంటెంట్ అందిస్తోంది. స్థానిక భాషా కంటెంట్ రంగంలో మొట్టమొదటి యూనికార్న్‌గా అవతరించిన ఈ సంస్థలో గూగుల్, మైక్రోసాఫ్ట్, కార్లైల్ గ్రూప్ వంటి దిగ్గజ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు పీఆర్ రమేష్ రాకతో ఈ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ తన మార్కెట్లో మరింత పటిష్టం చేసుకుని భవిష్యత్తు సవాళ్లకు సిద్ధమవుతోంది.
ALSO READ: Tiny Desktop PC: టీవీని కంప్యూటర్‌లా మార్చే.. బుల్లి సీపీయూ.. దీంతో మీ డబ్బంతా ఆదా!