WhatsApp New Scam: సైబర్ కేటుగాళ్లు కొత్త తరహా స్కామ్ కు తెరలేపారు. ఇప్పటి వరకు బ్యాంకుల పేరుతో, లాటరీల పేరుతో, కేవైసీ అప్ డేట్ పేరుతో డబ్బులు దోచుకున్న దుండగులు.. ఇప్పుడు సరికొత్త ఆలోచనతో అంకౌట్స్ ఖాళీ చేస్తున్నారు. ఫన్నీ మీమ్స్ పేరుతో అమాయకులను కొల్లగొడుతున్నారు. ఇంతకీ ఈ కొత్త స్కామ్ ఏంటి? ఎలా చేస్తున్నారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఫన్నీ మీమ్స్ పేరుతో సైబర్ స్కామ్
గత కొద్ది రోజులుగా వాట్సాప్ కు గుర్తు తెలియని ఆగంతకులు ఫన్నీ మీమ్స్ పంపిస్తున్నారు. సాధారణంగా ఫన్నీ మీమ్స్ అనగానే ఎవరూ స్కామ్ గా భావించరు. ఏదో నవ్వుకోవచ్చని ఓపెన్ చేస్తారు. ఇదే అదునుగా భావిస్తున్నారు స్కామర్లు. మీమ్ ఓపెన్ చేయగానే మొబైల్ లోకి మాల్వేర్ లేదంటే స్పైవేర్ ను ఎంట్రీ ఇస్తుంది. హ్యాకర్లు షేర్ చేసే ఫోటోల్లో తరచుగా కొన్ని హిడెన్ QR కోడ్‌లు ఉంటాయి. అవి వినియోగదారులను ఫిషింగ్ వెబ్ సైట్లకు దారి మళ్లించి.. ఫోన్ లోని అన్ని వివరాలను క్యాచ్ చేస్తున్నాయి. సున్నితమైన డేటా అంతా హ్యాక్ అవుతుంది. బ్యాంకు వివరాలు డీటైల్స్ చేతికి రాగానే అంకౌంట్ ను ఊడ్చిపడేస్తున్నారు కేటుగాళ్లు.
వ్యక్తిగత వివరాలతోనూ బ్లాక్ మెయిలింగ్
ఈ కొత్త తరహా మోసంతో బ్యాంకు వివరాలతో పాటు ఫోన్ లోని ఫోటోలు, వీడియోలను కూడా సేకరిస్తున్నారు. ఈ ఫోటోల్లో ఏవైనా ప్రైవేట్ ఫోటోలు ఉంటే.. వాటి ద్వారా ఆయా వ్యక్తులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఆ ఫోటోలను చూపిస్తూ, పదే పదే డబ్బులు అడుగుతున్నట్లు తాజాగా పోలీసులు గుర్తించారు.
నమా స్కామ్ నుంచి ఎలా కాపాడుకోవాలంటే?
ఈ వాట్సాప్ స్కామ్ నుంచి ఎలా రక్షించుకోవాలనే విషయానికి సంబంధించి సైబర్ సెక్యూరిటీ నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చి ఏ రకమైన ఫోటోలు, స్కానర్లు, ఆడియోలు, వీడియోలు వచ్చినా ఓపెన్ చేయకూడదంటున్నారు. మీడియా ఫైల్స్ లో ఆటో డౌన్ లోడ్ ఆప్షన్స్ ను ఆఫ్ చేయాలంటున్నారు.
పాటించాల్సిన కీలక జాగ్రత్తలు:
⦿ తెలియని నంబర్ల నుంచి ఫోటోలు, మెసేజ్ లు వస్తే ఓపెన్ చేయకూడదు. అది తెలిసిన కాంటాక్ట్ లా కనిపించినప్పటికీ జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా మెసేజ్ లు అసాధారణంగా కనిపిస్తే వెంటనే అలాంటి మెసేజ్ లను డిలీట్ చేయడం మంచిది.
⦿ అనుమానాస్పద, ధృవీకరించని నెంబర్స్ నుంచి ఏవైనా ఫోటోలు, అటాచ్ మెంట్ లను డౌన్ లోడ్ చేయకుండా ఉండాలి.
⦿ ఒకవేళ మీకు స్కామ్ మెసేజ్ లు వస్తే, వాటిని వెంటనే బ్లాక్ చేయాలి. అలా చేయడం వల్ల మళ్లీ ఆ కాంటాక్ట్ నుంచి స్కామ్ మెసేజ్ లను పొందే అవకాశం ఉండదు. వాట్సాప్ యూజర్లు వీలైనంత వరకు తెలియని నెంబర్ల నుంచి వచ్చే మెసేజ్ లను అవాయిడ్ చేయడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.
Read Also: తిరగబడ్డ AI.. నీ ఎఫైర్ బయటపెడతా అంటూ బెదిరింపులు.. డెవలపర్‌కు మైండ్ బ్లాక్!