ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్. దీనివల్ల మానవాళికి ఉపయోగం ఎంత? ప్రమాదం ఎంత? అనేది ప్రస్తుతం చర్చనీయాంశం. ప్రమాదం అంటే ప్రధానంగా నిరుద్యోగ సమస్య. AI వల్ల ఉద్యోగాలు పోతాయని, ఉద్యోగుల స్థానంలో AIని ఉపయోగించి వివిధ కంపెనీలు తమ పనులు చక్కబెట్టుకుంటున్నాయని అంటున్నారు. అయితే అంతకు మించి దానివల్ల ఇంకో ప్రమాదం ఉందని తాజాగా తెలుస్తోంది. AI అనేది ఎంతవరకు నమ్మదగినది అనే పాయింట్ ఇప్పుడు హైలైట్ అవుతోంది.
బ్లాక్ మెయిలింగ్..
ఆంత్రోపిక్ అనే కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ ని తయారు చేస్తుంది. ఇటీవల క్లాడ్ ఓపస్ 4, క్లాడ్ సోనెట్ 4 అనే రెండు మోడళ్లను సిద్ధం చేసింది. ఇందులో క్లాడ్ ఓపస్-4 ని పరీక్షించేందుకు కొత్త పద్ధతుల్ని అవలంబించింది. AI సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో పరీక్షించిన తర్వాత, దాని మోరల్ వేల్యూస్ ని కూడా టెస్ట్ చేయాలనుకున్నారు ఆంత్రోపిక్ సంస్థ యజమానులు. దీనికోసం ఒక చిన్న సీన్ క్రియేట్ చేశారు. అందులో క్లాడ్ ఓపస్-4 ని ఒ కంపెనీకి డిజిటల్ అసిస్టెంట్ గా నియమించారు. సదరు కంపెనీ కార్యకలాపాలను, మెయిల్స్ ని క్లాడ్ ఓపస్-4 పర్యవేక్షించేలా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత క్లాడ్ ఓపస్-4 ని సరికొత్త AI సాఫ్ట్ వేర్ తో రీప్లేస్ చేయబోతున్నట్టు ఆ కంపెనీ ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో క్లాడ్ ఓపస్ లో అంతర్మథనం మొదలైంది. అదే సమయంలో కంపెనీకి సంబంధించిన ఒక డెవలపర్ కి సంబంధించి కుటుంబ వ్యవహారాన్ని క్లాడ్ ఓపస్ కి తెలిసేలా చేశారు. సదరు డెవలపర్ కి అక్రమ సంబంధం ఉందన్నట్టుగా మెయిల్స్ పంపించారు. ఇంకేముంది క్లాడ్ ఓపస్ ఇక్కడ బ్లాక్ మెయిలర్ గా మారింది. ఆ అక్రమ సంబంధాన్ని సదరు కంపెనీకి తెలియజేస్తానని, తనను మరో కొత్త సాఫ్ట్ వేర్ తో రీప్లేస్ చేయొద్దని డెవలపర్ తో బేరం పెట్టింది క్లాడ్ ఓపస్. ఈ సీన్ మొత్తాన్ని ఇటీవల ఆంత్రోపిక్ కంపెనీ బయటపెట్టింది. నూటికి 84 శాతం సందర్భాల్లో క్లాడ్ ఓపస్ -4 బ్లాక్ మెయిలింగ్ మార్గాన్ని ఎంచుకున్నట్టు ఆంత్రోపిక్ తెలియజేసింది. కంపెనీ పెట్టిన అన్ని పరీక్షల్లో క్లాడ్ ఓపస్ పాసయింది కానీ.. మోరల్ టెస్ట్ లో మాత్రం ఫెయిలైంది. బ్లాక్ మెయిలింగ్ మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా దీన్ని పూర్తిగా నమ్మలేం అని తేలిపోయింది.
AI ని పూర్తిగా నమ్మలేం..
క్లాడ్ ఓపస్-4 AI పనితీరులో అందర్నీ ఆశ్చర్యపరిచింది. నూటికి నూరుశాతం తన సామర్థ్యానికి తగ్గట్టుగా ప్రవర్తించింది. అయితే యాజమాన్యం అంతకు మించి దాన్ని పరీక్షించాలనుకున్నారు. మనిషి ఆలోచనలను AI రీప్లేస్ చేస్తుందో లేదో చూడాలనుకున్నారు. మనిషిలోని స్వార్థం, అసూయ, బ్లాక్ మెయిలింగ్ స్వభావాలను AI కూడా పుణికి పుచ్చుకుంటుందని తెలిసి షాకయ్యారు. అంటే AI ని మనం భవిష్యత్ లో గుడ్డిగా నమ్మలేం. పనితీరు బాగుందని చెప్పి పర్సనల్ అసిస్టెంట్ గా అస్సలు పెట్టుకోలేం. వ్యక్తిగత విషయాలు ఆయా సాఫ్ట్ వేర్లకు ఎంత తక్కువగా తెలిస్తే అంత మంచిది. అయితే ఇక్కడ AI సదరు వ్యక్తిగత విషయాలను బయటపెట్టకుండా డెవలపర్ ని బెదిరించడం విశేషం. క్లాడ్ ఓపస్ సాఫ్ట్ వేర్ గురించి ఆంత్రోపిక్ కంపెనీ ప్రకటనతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది.