Laptop Shutdown: ఈ రోజుల్లో ల్యాప్‌టాప్ ప్రతిఒక్కరి జీవితంలో భాగమైపోయింది. ఆఫీస్ పని, చదువు, వినోదం.. ఇలా దేనికైనా రోజంతా ల్యాప్‌టాప్‌ను వినియోగించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అయితే రాత్రి పని పూర్తయ్యాక చాలామంది ల్యాప్‌టాప్‌ను పూర్తిగా ఆపేయకుండా (Shut Down) కేవలం మూత మూసి (Sleep Mode) పడుకుంటారు. ఇలా చేయడం వల్ల ల్యాప్ టాప్ ను తిరిగి ఆన్ చేసే సమయం ఆదా అవుతుందని చాలా మంది భావిస్తుంటారు. కానీ ప్రతిరోజూ రాత్రి ల్యాప్‌టాప్‌ను షట్‌డౌన్ చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
రోజంతా ల్యాప్‌టాప్‌లో రకరకాల యాప్‌లు, వెబ్‌సైట్‌లు చూస్తుంటారు. వాటిని క్లోజ్ చేసినప్పటికీ, కొన్ని బ్యాక్‌గ్రౌండ్ ప్రోగ్రామ్‌లు ల్యాప్‌టాప్ ర్యామ్ (RAM) మెమరీలోనే ఉండిపోతాయి. దీనివల్ల కాలక్రమేణా సిస్టమ్ నెమ్మదిస్తుంది. రాత్రి వేళ ల్యాప్‌టాప్‌ను షట్‌డౌన్ చేయడం వల్ల ర్యామ్ మెమరీ పూర్తిగా క్లియర్ అయి.. టెంపరరీ ఫైళ్లు అటోమేటిగ్గా డిలీట్ అవుతాయి. మరుసటి రోజు సిస్టమ్ వేగంగా కొత్తదానిలా పనిచేస్తుంది.
స్లీప్ మోడ్‌లో ఉన్నప్పుడు కూడా ల్యాప్‌టాప్ కొంతవరకు బ్యాటరీ పవర్ ను ఉపయోగిస్తూనే ఉంటుంది. కాబట్టిప్రతిరోజూ షట్‌డౌన్ చేయడం వల్ల బ్యాటరీకి పూర్తి విశ్రాంతి దొరుకుతుంది. ఇది బ్యాటరీ సామర్థ్యాన్ని, లైఫ్ టైమ్ ను పెంచడానికి ఎంతో దోహదపడుతుంది.
స్లీప్ మోడ్‌లో ఉన్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్ లో ఏదైనా అప్‌డేట్ రన్ అయినా, ప్రోగ్రామ్ ప్రాసెస్ జరిగినా ల్యాప్‌టాప్ వేడెక్కే ఛాన్స్ ఉంది. బ్యాగ్‌లో పెట్టి ఉంచినప్పుడు దీని వల్ల మరింత ప్రమాదం చోటుచేసుకునే అవకాశముంది. కాబట్టి రాత్రి వేళ సిస్టమ్‌ను పూర్తిగా ఆపివేయడం వల్ల హార్డ్ డిస్క్, ప్రాసెసర్, మదర్‌బోర్డ్ వంటి ఇంటర్నల్ పార్ట్స్ చల్లబడి ఎక్కువ రోజులు సమర్థవంతంగా పనిచేసేందుకు ఆస్కారం లభిస్తుంది.
విండోస్ లేదా మాక్ ఆపరేటింగ్ సిస్టమ్‌లు క్రమం తప్పకుండా సెక్యూరిటీ ప్యాచెస్, అప్‌డేట్స్‌ను ఇస్తుంటాయి. ఇవి ల్యాప్‌టాప్‌ను వైరస్‌లు, హ్యాకింగ్ నుండి ప్రొటెక్ట్ చేస్తాయి. అయితే చాలా వరకూ ఈ అప్‌డేట్స్ అన్నీ సిస్టమ్ రీస్టార్ట్ లేదా షట్‌డౌన్ అయినప్పుడే ల్యాప్‌టాప్‌లో సరిగ్గా ఇన్‌స్టాల్ అవుతాయి. కాబట్టి రోజూ షట్‌డౌన్ చేయడం వల్ల మీ సిస్టమ్ మరింత సేఫ్ గా ఉండేందుకు వీలు కలుగుతుంది.
Also Read: ఫోన్‌లో ఈ 5 యాప్స్ ఉంటే చాలు.. మీ పర్స్, ఒరిజినల్ సర్టిఫికెట్లు వెంట మోయక్కర్లేదు!
స్లీప్ మోడ్‌లో ఉన్నప్పుడూ ల్యాప్‌టాప్ కొద్ది మేర విద్యుత్తును తీసుకుంటుంది. ఒక రోజుకు ఇది కాస్త చిన్న అంశంగా కనిపించినప్పటికీ.. నెలలు, సంవత్సరాల తరబడి చూస్తే గణనీయమైన విద్యుత్ వృథా చేస్తుంది. కాబట్టి రాత్రి పూట ల్యాప్‌టాప్‌ను పూర్తిగా ఆపివేయడం ద్వారా విద్యుత్‌ను ఆదా చేయవచ్చు.
Also Read: అమెరికన్లు బట్టలు బయట ఎందుకు ఆరేయరు? కారణాలు తెలిస్తే పక్కా ఆశ్చర్యపోతారు!