Weight regain after dieting| బరువు తగ్గడం కోసం చాలామంది నెలల తరబడి డైటింగ్ చేస్తారు. ఆహార నియమాలు పాటిస్తూ, వ్యాయామం చేస్తూ కష్టపడతారు. అయితే, తగ్గిన బరువును ఎక్కువకాలం అలాగే కొనసాగించడం చాలామందికి కష్టంగా మారుతుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? బరువు తగ్గిన తర్వాత మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? నిపుణులు సూచించే ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.
బరువు తగ్గినప్పుడు శరీరంలోని కొన్ని హార్మోన్ల లెవెల్స్ మారుతాయి. కొవ్వు కణాల నుంచి విడుదలయ్యే లెప్టిన్ హార్మోన్ ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీరంలో కొవ్వు తగ్గినప్పుడు ఈ హార్మోన్ లెవెల్స్ కూడా తగ్గవచ్చు. దీంతో ఆకలి పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా, ఆకలిని ప్రేరేపించే గ్రెలిన్ హార్మోన్ స్థాయులు కూడా పెరగవచ్చు. ఫలితంగా తిన్న తర్వాత మళ్లీ త్వరగా ఆకలి వేస్తుంది.
బరువు తగ్గిన తర్వాత శరీరానికి అవసరమయ్యే కేలరీల సంఖ్య తగ్గుతుంది. కొన్నిసార్లు శరీరం శక్తిని ఖర్చు చేసే విధానంలో అదనపు మార్పులు కూడా వస్తాయి. ఈ ప్రక్రియను అడాప్టివ్ థర్మోజెనిసిస్ అంటారు. దీనివల్ల బరువు తగ్గించడం, తగ్గిన బరువును కొనసాగించడం మరింత కష్టమవతుంది.
చాలా తక్కువ ఆహారం తీసుకోవడం, ఎక్కువసేపు తినకుండా ఉండటం వల్ల అలసట, ఆకలి పెరగవచ్చు. దీంతో రోజువారీ పనులు చేయాలనే ఉత్సాహం తగ్గుతుంది. శారీరక కదలికలు తగ్గినప్పుడు కేలరీల ఖర్చు కూడా తగ్గుతుంది. అంతేకాకుండా, తగినంత ప్రోటీన్ తీసుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం వల్ల కండరాల పరిమాణం తగ్గవచ్చు. ఇది శరీర శక్తి అవసరాలను ప్రభావితం చేస్తుంది.
దక్షిణాసియా ప్రజల్లో కొందరికి తక్కువ బాడీ మాస్ ఇండెక్స్ (BMI) ఉన్నప్పటికీ మధుమేహం, ఇన్సులిన్ నిరోధకత, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు రావచ్చు. అందువల్ల బరువుతోపాటు నడుము చుట్టుకొలత, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయులను కూడా పరిశీలించాలి.
Also Read: మీరు నమ్మిన వ్యక్తి మోసం చేస్తే నిశ్శబ్దంగా సహించాల్సిన అవసరం లేదు.. చాణక్యుడు ఏం చెప్పాడంటే
బరువు తగ్గిన తర్వాత దాన్ని కొనసాగించడానికి సమతుల్య ఆహారం, క్రమమైన వ్యాయామం అవసరం. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు చేయాలి. నడక, సైక్లింగ్, ఈత వంటి యాక్టివిటీస్ కూడా ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.
తగినంత నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా ముఖ్యం. కఠినమైన డైట్లకు బదులుగా దీర్ఘకాలం పాటించగల ఆరోగ్యకరమైన అలవాట్లను ఎంచుకోవాలి.
Also Read: ఈ 7 రకాల వ్యక్తులతో గొడవపడితే మీకే నష్టం.. వీరితో శత్రుత్వం అసలు పెట్టుకోకూడదు
తీవ్రమైన ఊబకాయం ఉన్న కొందరికి వైద్యులు బేరియాట్రిక్ సర్జరీ సూచించే అవకాశం ఉంది. స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ, గ్యాస్ట్రిక్ బైపాస్ వంటి విధానాలు ఆకలి, కడుపు నిండినట్లు కలిగే భావనపై ప్రభావం చూపుతాయి. అయితే, శస్త్రచికిత్స తర్వాత కూడా కొందరిలో బరువు మళ్లీ పెరగవచ్చు. అందువల్ల వైద్యుల పర్యవేక్షణ, పోషకాహార సూచనలు, క్రమంగా ఫాలో అప్‌లు అవసరం.