Amit Mishra on Anil Kumble-Virat Kohli: టీమిండియా ఒకప్పటి లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా గురించి తెలియని వారుండరు. సింగిల్ హ్యాండ్ తో మ్యాచ్ టర్న్ చేసే దమ్మున్న బౌలర్ ఈ మిశ్రా. అలాంటి అమిత్ మిశ్రా కెరీర్ నాశనానికి కారణం టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటూ నేషనల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా అమిత్ మిశ్రానే పేర్కొన్నారు. తాజాగా ఆకాశ్ చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న అమిత్ మిశ్రా, 2017 తర్వాత టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వకపోవడం పై కీలక అంశాలను పంచుకున్నారు. విరాట్ కోహ్లీ, అనిల్ కుంబ్లే సమయంలో తనకు జట్టులో అవకాశాలు రాలేదని, దీనిపై వాళ్లను బతిలాడినా పట్టించుకోలేదంటూ ఆగ్రహించారు.
విరాట్ కోహ్లీ, కుంబ్లే వల్లే నా కెరీర్ నాశనం అయిందని అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2017లో గాయపడిన తనను టీమిండియాలోకి తీసుకుంటానని కోహ్లీ, అనిల్ కుంబ్లే మాట ఇచ్చి, ఆ తర్వాత పట్టించుకోలేదని మాజీ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఆరోపించాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఫోన్లు, మెసేజ్ లు పెట్టినా స్పందించలేదంటూ పేర్కొన్నాడు. బెంగళూరులోనే తన కాలికి తీవ్రమైన గాయమైందని తెలిపాడు. దీంతో అప్పటి కోచ్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లీని కలిసినట్టు గుర్తు చేశాడు. ఆ సమయంలో తనకు ఆ ఇద్దరూ ఎంతో ధైర్యం చెప్పారన్నాడు. గాయం నుంచి కోలుకుని ఫిట్‌నెస్ సాధిస్తే టీమిండియాలోకి తీసుకునే బాధ్యత తమదంటూ హామీ ఇచ్చినట్టు స్పష్టం చేశాడు.
ఫిట్ నెస్ సాధించిన తర్వాత కోహ్లీ, కుంబ్లేకు మెసేజ్‌లు పెడితే రియాక్ట్ కాలేదని అమిత్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత నేరుగా కోహ్లీని కలిసి, రీఎంట్రీపై ఆడిగినట్టు గుర్తు చేశాడు. వారం, పది రోజులలో టీమిండియా వచ్చేస్తావ్..దానిపైనే బీసీసీఐతో మాట్లాడతానని చెప్పినట్టు వెల్లడించాడు. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్లు చేసినా విరాట్ కోహ్లీ లిఫ్ట్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. చివరగా కుంబ్లేను ప్రాధేయపడ్డానన్నాడు. టీమిండియాలోకి ఏ ప్లేయర్ రావాలన్నా, కోహ్లీ పర్మిషన్ కావాలని…తన చేతిలో ఏం లేదని కుంబ్లే చేతులెత్తేసినట్టు చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ కంటే, ధోని సారథ్యంలోనే తనకు ఎక్కువగా అవకాశాలు వచ్చాయని తెలిపారు. ధోని చాలా సార్లు తనకు సహాయం చేశాడు తప్ప, ఎన్నడూ మోసం చేయలేదని క్లారిటీ ఇచ్చారు. దీంతో అమిత్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.