Harbhajan Singh On Ms Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై హర్భజన్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా కెప్టెన్ గా ఉన్నప్పుడు ధోనీ పీకింది ఏమీ లేదని.. 11 మంది జట్టు సభ్యులు కష్టపడితేనే టైటిల్ దక్కిందన్నారు. అంతేకానీ, మహేంద్ర సింగ్ ధోని ఒక్కడి వల్ల టీమిండియాకు ఐసీసీ ట్రోఫీలు రాలేదని చురకలు అంటించారు. కావాలనే కొంతమంది మహేంద్ర సింగ్ ధోనీని హీరో చేస్తున్నారని ఫైర్ అయ్యారు. టీమిండియా సక్సెస్ లో మహేంద్ర సింగ్ ధోని క్రెడిట్ 10% మాత్రమేనని బాంబు పేల్చారు హర్భజన్ సింగ్. దీంతో మహేంద్ర సింగ్ ధోనీ పై హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
2011 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా మహేంద్రసింగ్ ధోని మాస్టర్ ప్లాన్ తో ట్రోఫీ దక్కిందని చాలా మంది ప్రచారం చేస్తారు. అయితే దీనిపై హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2011 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా టీమిండియా టైటిల్ గెలవడం వెనుక ధోని ఒక్కడే లేడని షాకింగ్ కామెంట్స్ చేశారు. జట్టులో ఉన్న 11 మంది కలిసి టీమిండియాను ఛాంపియన్ గా నిలిపామని గుర్తు చేశారు.
యువరాజు సింగ్, జహీర్ ఖాన్, గౌతమ్ గంభీర్, సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ అందరూ ఒక్కో మ్యాచ్ లో… ఒక్కో సందర్భంలో జట్టును ఆదుకున్నారని గుర్తు చేశారు. జహీర్ ఖాన్ వికెట్లు తీస్తే మరో ఆటగాడు పరుగులు చేశాడని వివరించారు. కానీ మహేంద్ర సింగ్ ధోని చివరలో వచ్చి సిక్సర్ కొట్టి, క్రెడిట్ మొత్తం దొంగిలించాడని మండిపడ్డారు. వాస్తవంగా ధోని కెప్టెన్సీలో వచ్చిన మూడు ఐసీసీ ట్రోఫీలు అతని వల్ల రాలేదని 11 మంది టీమిండియా క్రికెటర్లు బాగా ఆడితేనే వచ్చాయని స్పష్టం చేశారు.
సౌరవ్ గంగూలీ కెప్టెన్సీ సమయంలో టీమిండియాలో కోచ్ గ్రెగ్ చాపెల్ సర్వనాశనం చేశాడని హర్భజన్ సింగ్ విమర్శలు చేశారు. సీనియర్ క్రికెటర్ల మధ్య గొడవలు పెట్టి.. దాదా కెప్టెన్సీ పోయేలా చేశాడని ఆగ్రహించారు. ఆస్ట్రేలియాలో ఢీ కొట్టేలా టీమిండియా తయారవుతోందని కావాలనే చిచ్చులు పెట్టాడని ఆరోపణలు చేశారు. సౌరవ్ గంగూలీని కెప్టెన్ స్థాయికి తీసుకువచ్చిన గ్రెగ్ చాపెల్, ఆ తర్వాత టీమిండియా పతనానికి కారణమయ్యాడని మండిపడ్డారు. టీమిండియాను విభజించు పాలించు అన్నట్టుగా అతని వ్యవహారం తయారయిందని ఆగ్రహించారు. టీమిండియా క్రికెటర్ లలో సీనియర్లను మాత్రమే డివైడ్ చేసి అందరి మధ్య గొడవలు సృష్టించాడని ఫైర్ అయ్యారు. దీంతో టీమిండియా రెండుగా చీలి 2007 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా గ్రూప్ స్టేజ్ లోనే దారుణంగా ఓడిపోయి సిరీస్ ఇంటిదారి పట్టిందన్నారు.