Bandi Sanjay: స్వేచ్ఛ బ్యూరో: కాళేశ్వరంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఫైరయ్యారు. కాంగ్రెస్ డైరెక్షన్.. బీఆర్ఎస్ యాక్షన్ మూవీ.. రక్త కన్నీరు-2 అని ఆయన ఎద్దేవాచేశారు. తెలంగాణ ప్రజలకు రెండు పార్టీల నేతలు రక్తకన్నీరు సినిమా చూపిస్తున్నారని ఫైరయ్యారు. రక్త కన్నీరు నాగభూషణంను మించి నటనలో జీవిస్తున్నారని ఇరు పార్టీల నేతలపై బండి ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ కాళేశ్వరాన్ని కూల్చి రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని నీళ్ల పాల్జేసిందని విరుచుకుపడ్డారు.
కాళేశ్వరాన్ని కోమాలోకి నెట్టారు..
ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్ సర్కార్ కాళేశ్వరాన్ని కోమాలోకి నెట్టిందని విమర్శించారు. ఈ రెండు పార్టీల పాపాలకు తెలంగాణ రైతులే బలవుతున్నారని బండి ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ చేతకానితనాన్ని ఎన్డీఎస్ఏపై నెట్టడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం ఇకనైనా మానుకోవాలని బండి ఇరు పార్టీలకు సూచించారు. డ్యామ్ సేఫ్టీ యాక్ట్-2021 ప్రకారం.. బ్యారేజీల యజమాని తెలంగాణ ప్రభుత్వమేనని కేంద్ర మంత్రి స్పష్టంచేశారు. ఎన్డీఎస్ఏ, సీడబ్ల్యూసీ కమిటీలు సలహాలు మాత్రమే ఇస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
Also Read: కమీషన్ ఇస్తేనే బిల్లులు.. కాంగ్రెస్ పాలనపై డీకే అరుణ షాకింగ్ కామెంట్స్!
కాంగ్రెస్ సర్కార్ పై సంజయ్ ఫైర్..
బ్యారేజీ మరమ్మతు పనులు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని, బాధ్యత వహించాల్సింది కూడా రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ ఇప్పటికే మూడుసార్లు నివేదిక ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని బండి ప్రశ్నించారు. పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని పదేపదే చెప్పినా ఎందుకు పెడచెవిన పెడుతున్నారని ఫైరయ్యారు. కాంగ్రెస్ సర్కార్ చేతగానితనాన్ని కేంద్రంపై నెట్టడం అలవాటుగా మారినట్లుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని, బాధ్యులను జైల్లో వేస్తామని గతంలో ప్రకటించింది కాంగ్రెస్సేనని గుర్తుచేశారు.
బండి సంజయ్ ప్రశ్నల వర్షం..
అధికారంలోకి వచ్చాక రూ.లక్ష కోట్ల అవినీతిపై విచారణ జరపకుండా రూ.9 వేల కోట్ల అవినీతిపై విచారణకే పరిమితమైంది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఆ కేసులో సూత్రధారులను అరెస్ట్ చేసి జైల్లో వేయకుండా సీబీఐ దర్యాప్తు చేయాలంటూ కేంద్రంపై రుద్ది తప్పుకున్నది నిజం కాదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. కాళేశ్వరంపై విజిలెన్స్ నివేదిక ఇస్తే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదుని నిలదీశారు. అసలు విజిలెన్స్ నివేదికను బయటపెట్టే దమ్ముందా? అని సంజయ్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పాపాలను రేవంత్ రెడ్డి మోయడం వెనుక మతలబు ఏంటని కేంద్ర మంత్రి అనుమానం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.
Also Read: రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిన ఎస్ఐ.. నిలదీస్తే ‘నా ఇష్టం’ అంటూ హల్‌చల్!
బండి సంజయ్ ఆవేదన..
కాళేశ్వరం మరమ్మతుల విషయంలోనూ రెండున్నరేళ్లు జాప్యం చేసింది కాంగ్రెస్ కాదా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల నుంచి ఒత్తిడి వస్తుంటే చర్చను దారి మళ్లించేందుకు ఎన్డీఎస్ఏ కు అప్పగిస్తామంటూ కేంద్రంపై నెట్టాలని చూస్తున్నారని బండి సంజయ్ విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పదేళ్ల అవినీతి, నిర్లక్ష్యం, కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతవల్ల గోదావరి జలాలను తెలంగాణ ప్రజలు వినియోగించుకోలేని దుస్థితి ఏర్పడిందని బండి ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా రాజకీయ డ్రామాలు పక్కనపెట్టాలని ఆయన సూచించారు. ఎన్డీఎస్ఏ సిఫార్సులను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణను వేగవంతం చేయాలన్నారు. లేదంటే తెలంగాణ రైతుల ఆగ్రహానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ బలికాక తప్పదని బండి సంజయ్ హెచ్చరించారు.